Amaravati Outer Ring Road: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఓ కీలక ప్రతిపాదన వచ్చింది. ఇప్పటివరకు 140 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం చేపడతారని భావించారు. అయితే 250 మీటర్ల వెడల్పుతో చేపట్టనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
* అన్ని జిల్లాలకు కనెక్ట్..
అమరావతిని అన్ని జిల్లాలకు కనెక్ట్ చేసేలా ఔటర్ రింగ్ రోడ్డు( Outer Ring Road) రాబోతుంది. అమరావతి ఓఆర్ఆర్ కు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ కూడా జరుగుతోంది. గుంటూరు, పల్నాడు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ చేపట్టారు. అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్డును 140 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తామని ప్రతిపాదించారు. కానీ గెజిట్లో మాత్రం 250 మీటర్లుగా పేర్కొనడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అధికారులను వారు ప్రశ్నించడంతో వారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 250 మీటర్లు అనేది ముందు జాగ్రత్త కోసమేనని.. ఔటర్ రింగ్ రోడ్డును మాత్రం 140 మీటర్ల వెడల్పుతోనే నిర్మిస్తామని చెప్పుకొస్తున్నారు అధికారులు. మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగానే గెజిట్లో 250 మీటర్లు రాసినట్లు స్పష్టతనిచ్చారు.
* దాదాపు కొలిక్కి..
ఈ ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వస్తోంది. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత.. సర్వే పూర్తి చేసి 140 మీటర్లకే కొలత వేసి సరిహద్దులు వేస్తారు. ఆ మేరకు మాత్రమే భూమిని తీసుకుంటారు. ఈ అంశాలను తుది నోటిఫికేషన్లో పొందుపరుస్తామని తెలిపారు. ఎవరికి ఆందోళన వద్దని సూచించారు. గత నెలలోనే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వీలైనంత త్వరగా.. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది ప్రభుత్వం. అయితే ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే మాత్రం ఐదు జిల్లాల వరకు కనెక్టివిటీ పెరుగుతుంది.