A grand event in Amaravati: అమరావతి( Amravati capital ) రైతులకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. అమరావతి వేదికగా భారీ ఈవెంట్ కు సిద్ధమవుతోంది. దీనికోసం అమరావతి రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపింది ప్రభుత్వం. ప్రస్తుతం అమరావతిలో రెండో విడత భూ సమీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామసభలు పూర్తయ్యాయి. భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. నివాసాలతో పాటు వాణిజ్య అవసరాలకు సంబంధించిన ప్లాట్లను అందిస్తున్నారు అమరావతి రైతులకు. వెనువెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం చేపడుతున్నారు. ఎటువంటి రుసుం లేకుండానే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగానే అమరావతి రైతులకు రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానాలు అందించింది ప్రభుత్వం. దీనిపై అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని నిర్వీర్యం..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం( Telugu Desam). నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అందరి అభిప్రాయం తీసుకుని 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్వీర్యం అయింది. రైతుల నుంచి తీసుకున్న భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. నిర్మాణాలను ఉన్నఫలంగా ఆపేసి మూడు రాజధానులను ప్రకటించారు. అటు మూడు రాజధానులను పూర్తి చేయలేకపోయారు. ఇటు అమరావతిని పట్టించుకోవడం మానేశారు. ఐదేళ్ల లో పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది అమరావతి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని యధాస్థానానికి తీసుకువచ్చి.. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం.
తొలిసారిగా రిపబ్లిక్ డే..
అయితే అమరావతి రాజధాని లో ఎప్పుడూ జరగని వేడుకకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలను( Republic Day event) జరపాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తోంది. ఓ 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిపేందుకు నిర్ణయించింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించింది. ప్రతి ఒక్కరికి ఆహ్వానాలు పంపింది. వారిని వీఐపీలుగా చూస్తోంది. కేవలం వారి కోసమే ఒక ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసింది. దాదాపు 13 వేల మంది అక్కడ కూర్చునేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇంతవరకు అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ.. గణతంత్ర దినోత్సవ వేడుకలు గాని జరగలేదు. తొలిసారి జరుపుతున్న ఈ వేడుకల్లో భూములను త్యాగం చేసిన రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచన చేయడం విశేషం.