Perni Nani: అమరావతిలో కీలక నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలను వేడుకగా నిర్వహించింది ప్రభుత్వం. దీంతో ప్రజల్లోకి బలంగా వెళ్తోంది అమరావతి రాజధాని అంశం. తొలి దశ నిర్మాణ పనులు 2028 నాటికి పూర్తవుతాయి అన్న ఆశాభావం కలుగుతోంది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రకమైన స్పందన కనిపిస్తోంది. అసలు అవి నిర్మాణాలే కావు అన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* ఆరేళ్ల సమయం పట్టిందని..
ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ఈ నిర్మాణాలు జరిపేందుకు ఆరేళ్ల సమయం తీసుకున్నారని చెబుతున్నారు. గతంలో టిడిపి హయాంలో వీటి నిర్మాణాలను ప్రారంభించారు. మధ్యలో వైసిపి రావడంతో పనులు నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు కూటమి రావడంతో పూర్తి చేయగలిగారు. అప్పట్లో నాలుగేళ్లు, ఇప్పుడు రెండేళ్లు కలుపుకొని ఆరేళ్లపాటు జాప్యం జరిగిందన్నది పేర్ని నాని అభిప్రాయం. కానీ మధ్యలో ఐదేళ్లపాటు తాము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. దానిపైనే నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
* ఆ పనుల కోసమే వాడుతారు..
మరోవైపు ఈ క్వార్టర్స్ పై నోరు జారారు పేర్ని నాని. అక్కడ ఎవరు ఉంటారని ప్రశ్నించారు. ఆ భవనాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎంతవరకు ఉపయోగిస్తారు చూస్తాం అన్నట్టు మాట్లాడారు. గన్మన్లతోపాటు సిబ్బందిని అక్కడ పడుకోబెడతారని.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే ఏకంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఆయన నోటి వెంట రావడంతో.. గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అటువంటివి జరిపారా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే పేర్ని నాని తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీకు బుద్ధి రాదు అన్నవారు కూడా ఉన్నారు. అయితే పేర్ని నాని కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.