Alluri Sitarama Raju International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకగా సాగింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ప్రధానికి ఆత్మీయ స్వాగతం లభించింది. సంప్రదాయ కూచిపూడి తో పాటు గిరిజనుల సంప్రదాయ నృత్యం ధింసాతో స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. వేడుకల సాగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అయితే గతంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భీమవరంలో క్షత్రియ సేవా సంఘం ఏర్పాటు చేసిన భారీ అల్లూరి విగ్రహాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. కానీ ఈ ప్రభుత్వంలో ఒక భారీ ప్రాజెక్టుతో ప్రారంభమైన ఈ అల్లూరి విమానాశ్రయాన్ని ప్రారంభించడం గొప్ప విషయం.
* మన్యం వీరుడు అంటూ..
సాధారణంగా అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని చాటి చెప్పే క్రమంలో.. మన్యం వీరుడు అంటూ మొదలు పెడతాం. ప్రధాని నరేంద్ర మోడీ సైతం అలానే సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒక ఐదు నిమిషాల పాటు తెలుగులో కష్టంగా మాట్లాడుతూ.. అల్లూరి పట్ల తనకు ఇష్టాన్ని చాటుకున్నారు. అయితే అది ఇప్పుడు కాదు గతంలో భీమవరంలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణలో. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి అలుపెరగని పోరాటాన్ని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ నాడు. ఆ సభలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు హాజరయ్యారు. అప్పట్లో కూడా అల్లూరి సేవలను కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు కూడా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా మన్యం వీరుడిని చేస్తారని అంతా భావించారు. కానీ నరేంద్ర మోడీ ఆ ప్రస్తావన తేలేదు.
* గొప్ప ప్రసంగం..
అంతకుముందు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ఏకంగా 13000 మందికి పైగా గిరిజన కళాకారులు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీని అబ్బురపరిచారు. అలాగే ఓ 200 మంది విద్యార్థులకు కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఆయనను ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం అందుబాటులోకి రావడం పై ఆనందం వ్యక్తం చేశారు. అటువంటి విమానాశ్రయానికి మన్యం వీరుడు పేరు పెట్టడం మంచి నిర్ణయంగా చెప్పుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో ఏపీ ప్రజలు ముందుకు సాగాలని కూడా పిలుపునిచ్చారు. ప్రధాని మాట్లాడుతున్నంత సేపు సభలో ప్రజలు సైలెంట్ గా ఉన్నారు. అదే మాదిరిగా హర్షద్వానాలతో ప్రధాని పట్ల తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు. కాగా ప్రధాని హిందీ ప్రసంగాన్ని తెలుగులో తర్జుమా చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.