Chanakya Niti: మౌర్య సమాజానికి చెందిన అపర చాణక్యుడు మనుషుల జీవితానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలను ప్రజలకు అందించాడు. వీటిలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే.. మనిషికి ఉన్న కోపంతో తన జీవితం మొత్తం నాశనం అవుతుంది. కోపంతో ఉన్న వారు తీసుకునే నిర్ణయాలు చెడుకుదారి తీస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో రకరకాల ఆహారం తీసుకోవడం వల్ల చిన్న వయసులో ఉన్న వారు సైతం బ్లడ్ ప్రెషర్ కు గురై.. కోపాన్ని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే తమ జీవితం బాగుంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కోపాన్నిఅదుపులో ఉంచుకోవడానికి చాణక్య చెప్పిన 5 సూత్రాలు ఇవే..
ఓర్పు:
కొంత మందికోపం వచ్చిన వెంటనే స్పందిస్తుంటారు. కానీ ఇలాంటి సమయంలో కొన్ని క్షణాలు మౌనంగా ఉండడం, లోతుగా శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. లేదా ఆ పరిస్థితి నుంచి కాసేపు దూరంగా వెళ్లడం మంచిది. ఇలా చేయడం వల్ల భావోద్వేగాలు క్రమంగా తగ్గి, పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. మనసు స్థిమితంగా ఉంటే సమస్యకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
మాటలు:
కోపంలో పలికిన మాటలు బాణంలా ఉంటాయని కొందరు అంటుంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నామో తమకే అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని సంయమనంతో పాటించాలి. కోపం తగ్గిన తరువాత మాట్లాడితే వివాదాలు తగ్గడమే కాకుండా సంబంధాలు కూడా దృఢంగా ఉంటాయి.
సమస్య పరిష్కారం కోసం..
చాలా సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు మనం సమస్యను పక్కనబెట్టి ఎదుటి వ్యక్తినే తప్పుబడతాం. ఇది పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది. వ్యక్తిని విమర్శించడం కంటే అసలు సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఎలా కనుగొనాలి? అనే దానిపై దృష్టి పెట్టాలి. దీంతో అనవసర గొడవలు తగ్గి, సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి.
సానుకూల శక్తిగా మార్చుకోవాలి
ఒక్కోసారి కోపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ దానిని సానుకూల దిశలో ఉపయోగించు కుంటే లక్ష్యాల కోసం మరింత కష్టపడేందుకు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, విజయానికి మెట్టుగా మారుతుంది. ప్రతికూల భావోద్వేగాన్ని ప్రేరణగా మార్చుకోవడం విజయవంతమైన వ్యక్తుల ముఖ్య లక్షణాల్లో ఒకటి.
నిర్ణయాలు:
ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో తప్పుగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు లేదా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను కోపంలో తీసుకోవడం మంచిది కాదు. మనసు ప్రశాంతంగా ఉన్న తర్వాత పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే పొరపాట్లు తగ్గుతాయి.
తరచూ కోప్పడే వ్యక్తుల్లో రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, కోపంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఆర్థికంగా, వృత్తిపరంగా కూడా నష్టాన్ని కలిగించవచ్చు.