Appalaraju: ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయి. నాయకుల ప్రకటనలు కూడా సమాజాన్ని విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి. రోడ్డు ప్రమాదం సాధారణ వ్యక్తి చేస్తే తప్పు.. రాజకీయ నేతలు చేస్తే ఒప్పు అన్నట్టు ఉంది. సాధారణ యువకులు, మైనర్లు చేస్తే ఆ తల్లిదండ్రుల పెంపకం తప్పు.. రాజకీయ నాయకుల పిల్లలు చేస్తే ఒప్పు అన్నట్టు ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్మోహన్ రెడ్డి సైతం ఇలానే మాట్లాడుతుండడం.. వాటిని ఆ పార్టీ నేతలు అనుసరిస్తుండడం.. ఆ పార్టీ సోషల్ మీడియా అడ్డంగా సమర్ధిస్తుండడం ఏపీలో వెలుగు చూస్తుండడం నిజంగా బాధాకరం. తాజాగా మాజీ మంత్రి అప్పలరాజు జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో తనది గానీ.. తన కుటుంబానిది కానీ తప్పు లేదని తేల్చేశారు. పైగా చాలా గర్వపడుతున్నట్లు ప్రకటన చేశారు. ఒక మనిషి చనిపోతే దానిని సాధారణ ప్రమాదంగా తేల్చేశారు. పైగా తన గురించి సమాజమంతా బాధపడుతోందని పెద్దపెద్ద మాటలు చెప్పారు. అది కూడా సుదీర్ఘ రాజకీయాలు చేసిన ధర్మాన ప్రసాదరావును పక్కన పెట్టుకొని మరి చేసిన ప్రకటనలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి.
* అరెస్టు అలా అయ్యారు..
తన కుమారుడు ఒక బైక్ ప్రమాదంలో ఒక మనిషి చావుకు కారణమయ్యాడు. ఆ కేసును తారుమారు చేసి రోడ్డుపై మృతి చెందిన వ్యక్తిని అలానే వదిలేసి.. తన కుమారుడిని బదులు వేరొకరికి ఆ కేసులో బాధ్యుడిని చేసి.. తన కుమారుడిని మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లిన గొప్ప పనిచేశారు మాజీమంత్రి అప్పలరాజు. అందులో రాజకీయం లేదు. రాజకీయ కోణం అంతకంటే లేదు. పాత కేసుల్లో అప్పలరాజును అరెస్టు చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే క్రమంలో ఆయనను అరెస్టు చేయలేదు. కూటమినేతల ఫిర్యాదుతో అరెస్టు చేయలేదు. కేవలం తన వ్యక్తిగత వ్యవహార శైలి, చట్టపరమైన పరిమితులను దాటి.. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. కేసును తారుమారు చేసినందుకు మాత్రమే ఆయనపై కేసు నమోదయింది. అరెస్టు కూడా అయ్యారు. ఒక మనిషి చనిపోతే.. దానికి బాధ్యుడైన వారిని తప్పిస్తే దానిని హత్యాకోణంలోనే పేర్కొంటారు. ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. మొత్తం చట్టాన్ని అవపోషణ పట్టేసినట్టు మాట్లాడే అప్పలరాజుకు ఇది తెలియంది కాదు. కానీ పైగా బెయిల్ పై బయటకు వచ్చి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తే బాగుండేది. కానీ గర్వపడుతున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చి.. తన తప్పిదాన్ని మరింత రెట్టింపు చేసుకున్నారు అప్పలరాజు.
* అంతా బాధల్లో మునిగిపోయారట..
పైగా అప్పలరాజు అరెస్టు అయితే సమాజం మొత్తం బాధపడిందట. మేధావులంతా పెద్ద ఎత్తున ఆలోచన చేశారట. తటస్తులు తల్లడిల్లిపోయారట. మత్స్యకార సామాజిక వర్గం భగ్గుమందట. ములాఖత్ కు వచ్చిన వారు అదే విషయంపై తెగ బాధ పడిపోయారట. తన కుటుంబం నెల రోజులుగా నలిగి పోయిందట. లక్షలాదిమంది కుటుంబ సభ్యులను ఈ ఘటన ఆయనకు ఇచ్చిందట. ఇలా అప్పలరాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నంతసేపు ప్రేక్షక పాత్రలో ఉండిపోయారు ధర్మాన సోదరులు. ధర్మాన కృష్ణ దాస్ ను పక్కన పెడితే ప్రసాదరావు రాజకీయం ఇప్పటిది కాదు కదా. ఇలాంటివి ఎన్నో ఎత్తి చూశారు కదా. కనీసం ఆయన ఆయన వారించి ఉండాలి. వెళ్ళింది ప్రజా సమస్యలపై కాదు. వ్యక్తిగత వ్యవహార శైలి తోనే అప్పలరాజు జైలు జీవితాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఏదో స్వాతంత్ర పోరాటానికి వెళ్లి వచ్చినట్టు గర్వపడుతున్నాను అని ప్రకటన చేశారు.
* అధినేత అలా మాట్లాడితే..
అయితే మాజీ మంత్రి అప్పలరాజు అలా మాట్లాడడంలో తప్పులేదు. ఎందుకంటే ఆ పార్టీ అధినేత జగన్ అలా మాట్లాడారు. ఏదో చిన్నపిల్లాడు రోడ్డు ప్రమాదం చేస్తే తప్పు కాదు అన్నట్టు మాట్లాడారు. అంతటితో ఆగకుండా కర్నూలు వెళ్లి బైక్ ప్రమాదమే కదా.. కారు ప్రమాదం కాదు కదా అంటూ ఓ మనిషి ప్రాణాన్ని చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడారు. మరి అధినేత ఆ స్థాయిలో మాట్లాడి.. దొరికిపోయిన వారిని పరామర్శించి.. ఆయనే అలా మాట్లాడితే.. మాజీ మంత్రి అప్పలరాజు అలా మాట్లాడడంలో తప్పే లేదు. కానీ అప్పలరాజు చేసిన పనిని వెనుకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి.. ఆయన పార్టీ మాత్రం ఏపీ సమాజంలో మూల్యం చెల్లించుకోక తప్పదు.
View this post on Instagram