YSR Congress Party: డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. జెన్ జీ పేరుతో తెగ హడావిడి చేస్తోంది. అయితే ఆందోళనల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే తప్ప.. ఎక్కడ డీఎస్సీ అభ్యర్థులు హాజరు కావడం లేదు. ఇది ఒక వైపు సాగుతుండగా వైసిపి హయాంలో గ్రూప్ 1 అక్రమాలు ఇప్పుడు ఆ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. మెగా డీఎస్సీ 2025 అక్రమాల విషయంలో వైసిపి ఆధారాలు చూపలేకపోతోంది.. కానీ వైసీపీ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో మాత్రం భారీ అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా చూపించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ. ఏకంగా కోర్టులోనే అనేక అంశాలను చార్జ్ సీట్ రూపంలో బయట పెట్టింది. మరోవైపు నేషనల్ మీడియాలో సైతం ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. దీంతో వైసిపి పై అసలైన జెన్ జీ ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* మూల్యాంకనంలో అక్రమాలు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో భారీగా అక్రమాలు జరిగాయి అన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే తన విచారణకు సంబంధించి కోర్టుకు తుది నివేదికను సమర్పించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించింది. ఒకే జవాబు పత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేశారని వెల్లడించింది. డిజిటల్, హైలాండ్, విజయవాడలో మూడు దశల్లో మూల్యాంకనం జరిగిందని పేర్కొంది. ఎంపికైన 165 మందిలో 160 మంది పత్రాల్లో మార్కులకు సంబంధించి మార్పులు చోటు చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ.. రిట్ పిటిషనర్లలో 405 మంది జవాబు పత్రాల్లో మార్పులు జరిగినట్లు నివేదికలో సమర్పించింది.
* ల్యాబ్ నివేదికలతో సైతం..
చీఫ్ ఎగ్జామినర్లు మార్కులను సవరించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. 61 స్లిప్పుల్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ గుర్తించామని.. హైలాండ్ రిసార్ట్ లో 84 రోజులపాటు జవాబు పత్రాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. 4502 మంది నిపుణుల ప్యానెల్ను పక్కనపెట్టి.. 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది. అయితే హైకోర్టుకు ఏకంగా సిట్ చార్జ్ షీట్ దాఖలు చేయడంతో నేషనల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు సీట్ గుర్తించడాన్ని నేషనల్ మీడియా హైలెట్ చేస్తోంది.జెన్ జి ఉద్యమం నేపథ్యంలో యువతలోను ఇది చర్చ జరుగుతోంది. డీఎస్సీ 2025లో అక్రమాలపై వైసీపీ పోరాటం చేస్తోంది కానీ.. ఆధారాలు చూపించలేకపోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునేలా ఉంది.