Newsprint Funds Diversion: తెలుగు ప్రింట్ మీడియాలో.. ఆ పేపర్ ఏర్పాటు ఒక సంచలనం. అప్పట్లో హై క్వాలిటీతో.. పూర్తిస్థాయి రంగులతో ఆ పేపర్ మార్కెట్ లోకి వచ్చింది. ఏకకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 ఎడిషన్లు.. ముంబై, చెన్నై, ఢిల్లీ ఎడిషన్లను ప్రారంభించింది. ఈ స్థాయిలో పేపర్ ఏర్పాటును దేశంలో ఏ మేనేజ్మెంట్ కూడా చేయలేదు.
ఆ పత్రిక యజమానికి రాజకీయ రంగులు ఎక్కువ. పైగా అప్పట్లో ఈ పత్రిక యజమాని తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. ఆయన కన్ను మూసిన తర్వాత.. ఆయన కుమారుడు రాజకీయాల్లో కీలకంగా మారారు. ఒక రాష్ట్రానికి కీలక నాయకుడిగా అవతరించారు. అక్రమార్గంలో ఆ నాయకుడు లక్షల కోట్లు సంపాదించాడు. చాలావరకు ఆయన తనమీద కేసులు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు. దండిగా డబ్బులు ఉండడంతో.. ఆ నగదును తెలుపుగా మార్చుకోవడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇటీవల కాలంలో న్యూస్ ప్రింట్ కొనుగోలు చేస్తామని హైకోర్టుకు విన్నవించారు.. న్యూస్ ప్రింట్ కొనుగోలు కోసం దుబాయ్ కి నిధులు మళ్లించడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి హైకోర్టు అనుమతి ఎందుకంటే.. ఆయన కంపెనీల మీద కేసులు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన కంపెనీలకు సంబంధించిన ఖాతాలను స్తంభింపజేశాయి. అందులో నుంచి నిధులు తీసుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. అందువల్లే ఆయన తెలంగాణ హైకోర్టుకు విన్నవించారు. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ఆ నాయకుడి ప్రయత్నానికి బ్రేక్ వేసింది.
మనదేశంలో ప్రింట్ సంస్థలు మొత్తం రష్యా, కెనడా, స్వీడన్, దక్షిణ కొరియా దేశాల నుంచి పేపర్ ను దిగుమతి చేసుకొంటాయి. వాటి ద్వారానే ఇక్కడ పేపర్లను రూపొందిస్తాయి. అయితే ఆ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో ప్రింట్ అయ్యే పేపర్ యాజమాన్యం దుబాయ్ ప్రాంతానికి పేపర్ కోసం నిధులు మళ్లించే అవకాశం ఇవ్వాలని కోరింది. వాస్తవానికి దుబాయ్ లో ఎటువంటి పేపర్ తయారు కాదు. అక్కడ మధ్యవర్తులు ఉంటారు. ఆ పేపర్ యాజమాన్యానికి హైదరాబాదులో ఎస్బిఐలో ప్రధాన ఖాతా ఉంది. దానికి అనుబంధంగా ఖాతాలను తెరిచి.. వాటి ద్వారా డబ్బును దుబాయ్ పంపించాలని ఆ పేపర్ యాజమాన్యం భావించింది. తద్వారా ఆ డబ్బును తెలుపుగా మార్చుకోవాలని భావించింది. కానీ అదంతా అక్రమ డబ్బు అని.. ఆ డబ్బులు ఖాతాల ద్వారా దుబాయ్ ప్రాంతానికి పంపిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు కోర్టుకు ఆధారాలతో సహా నిరూపించాయి. దీంతో తెలంగాణ హైకోర్టు ఆ పేపర్ యాజమాన్యానికి బ్రేక్ వేసింది. తద్వారా నిధుల మళ్లింపు ఆగిపోయింది.