Nepal Floods: నేపాల్‌లో రెండు రోజుల క్రితం ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టించాయి. ఈ విలయానికి వేల మంది గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆకస్మిక విపత్తుకు కారణం నేపాల్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఒక హిమనది (గ్లేసియర్) భాగం అకస్మాత్తుగా కూలిపోవడమే కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత చైనా హెలికాప్టర్ ప్రభావిత ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నది. ఈ దృశ్యం కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు.. హిమాలయాల్లో మోగుతున్న డేంజర్ బెల్స్‌ను మళ్లీ గుర్తు చేస్తోంది. దీన్నే గ్లేసియల్ లేక్ అవుట్‌బరస్ట్‌గా పిలుస్తారు.
గ్లోఫ్ అంటే ఏమిటి?
హిమనీ నదులు కరిగి ఏర్పడే సరస్సులు సాధారణంగా మంచు లేదా రాతి ఆనకట్టలతో నిలిచి ఉంటాయి. ఈ ఆనకట్ట అకస్మాత్తుగా విరిగిపోతే లేదా హిమనది భాగం కూలి నీటిని విడుదల చేస్తే భారీ వరద ప్రవాహం ఏర్పడుతుంది. ఇది సాధారణ వర్షపు వరదల కంటే చాలా వేగంగా, శక్తివంతంగా ఉంటుంది. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి ‘‘లిక్విడ్ కాంక్రీట్’’ లాంటి ప్రవాహంగా మారి దిగువ ప్రాంతాలను కొట్టుకుపోతుంది. ప్రస్తుత సంఘటనలో హిమనది కూలిపోవడం వల్ల ఏర్పడిన మంచు–రాతి ప్రవాహం నదిని తాత్కాలికంగా అడ్డుకుని, తర్వాత విరిగి భారీ వరదగా మారింది. ఇది సంప్రదాయ గ్లోఫ్‌కి దగ్గరగా ఉన్నప్పటికీ, హిమనది పతనం ప్రధాన కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హెలిక్యాప్టర్ ద్వారా దృశ్యాలు..
ప్రమాదం జరిగిన తర్వాత చైనా వైపు నుంచి హెలికాప్టర్లు ప్రభావిత ప్రాంతానికి చేరుకున్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయిన పరిస్థితుల్లో వాయు మార్గం ద్వారా సహాయం అందించడం అనివార్యమైంది. సరిహద్దు ప్రాంతాల్లో సమాచార మార్పిడి, ఉమ్మడి అంచనాలు ఎంత ముఖ్యమో కూడా చూపిస్తోంది. హిమాలయాల్లో ఒక దేశంలో జరిగే ఘటన మరో దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి సహకారం అవసరం.
హిమాలయాల్లో పెరుగుతున్న ప్రమాదాలు..
వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరుగుతున్నాయి. దీంతో హిమనీ నదులు వేగంగా కరుగుతున్నాయి. కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి, ఇప్పటికే ఉన్నవి అస్థిరంగా మారుతున్నాయి. హిమనది పతనాలు, ఐస్–రాక్ అవలాంచ్‌లు ఇప్పుడు తరచుగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత విపత్తు ఇంకా పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది.
ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకనే..
గ్లోష్‌లు చాలా వేగంగా జరుగుతాయి. సాధారణ వరద హెచ్చరిక వ్యవస్థలు వీటిని సకాలంలో గుర్తించలేకపోవచ్చు. హిమనది పతనం వంటి ఘటనలు సీస్మిక్ సిగ్నల్స్ ఇచ్చినా, వాటిని సకాలంలో విశ్లేషించి దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు అందించడం సవాల్‌గా ఉంది. హిమనదులు, సరస్సుల స్థితిని ఉపగ్రహాలు, డ్రోన్లు ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి. సరిహద్దు దేశాల మధ్య సమాచార మార్పిడి వ్యవస్థలు బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
చైనా హెలికాప్టర్ చేరుకోవడం రక్షణ చర్యల్లో ఒక ముఖ్యమైన అడుగు. కానీ అసలు సమస్య హిమాలయాల్లో పెరుగుతున్న హిమనది అస్థిరత. గ్లోఫ్‌లు ఇకపై అరుదైన ఘటనలుగా కాకుండా, తరచుగా ఎదురయ్యే ప్రమాదాలుగా మారుతున్నాయి. వాతావరణ మార్పులను అదుపు చేయడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, సరిహద్దు సహకారం పెంచడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల నుంచి ప్రాణాలను, ఆస్తులను రక్షించవచ్చు.
A Chinese helicopter reached the site where a glacier had collapsed, releasing water that caused heavy flooding in Nepal. This phenomenon is known as a GLOF.
A Glacial Lake Outburst Flood (#GLOF) can occur when the dam of a lake impounded by a glacier suddenly fails.… pic.twitter.com/WNth2H5PFP
— greatandhra (@greatandhranews) August 27, 2026