Netherlands: రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా యూరప్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అనిశ్చితి పెరుగుతున్న సమయంలో అమెరికాపై విశ్వాసం కూడా సన్నగిల్లుతోంది. నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంకు (డీఎన్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని గణనీయమైన పరిమాణంలో బంగార నిల్వలను సురక్షిత ప్రదేశానికి మార్చింది. అమెరికా, కెనడా నుంచి సుమారు 86 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చి లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్‌లో ఉంచింది. సంక్షోభ సమయంలో తక్షణ లావాదేవీలకు అనుకూలంగా ఉండేలా చేసిన వ్యూహంగా భావిస్తున్నారు.
దశలవారీగా తరలింపు..
ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో తరలింపు ఆపరేషన్ జరిగింది. మొదటి దశలో సుమారు 27 టన్నులను అమెరికా, కెనడా బ్యాంకుల నుంచి నేరుగా తీసుకొచ్చి నెదర్లాండ్స్ మీదుగా లండన్‌కు చేర్చారు. మిగిలిన భాగాన్ని న్యూయార్క్‌లో విక్రయించి, లండన్‌లో తిరిగి కొనుగోలు చేసే పద్ధతిని అవలంబించారు. రవాణా సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని వివిధ దశల్లో, వేర్వేరు రూపాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశామని డచ్ కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల ఏకమొత్తంలో తరలించే రిస్క్ తగ్గిందని తెలిపింది.
అంతర్జాతీయ అస్థిరతే ప్రధాన కారణం
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులే బంగారం తరలింపునకు ప్రధాన కారణం.. అమెరికా, కెనడా మధ్య పరస్పర సుంకాలు విధించుకుంటున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్‌తో సంబంధించిన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా అశాంతి వంటివి ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇటువంటి అనిశ్చిత వాతావరణంలో బంగారం వంటి ఆస్తిని సులభంగా యాక్సెస్ చేసుకునే, వ్యాపారం చేసే ప్రదేశంలో ఉంచాలనే ఆలోచనతోనే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
లండన్‌లో సురక్షితమేనా?
లండన్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగార మార్కెట్‌గా నిలుస్తోంది. అక్కడ కొనుగోలు, విక్రయం, తాకట్టు వంటి లావాదేవీలు చాలా సులభం, వేగవంతం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్‌లు అత్యంత ఉన్నత స్థాయి భద్రతా వ్యవస్థతో కూడి ఉన్నాయి. బాంబు దాడులను కూడా తట్టుకునేలా నిర్మించబడ్డాయి, అనధికార ప్రవేశం దాదాపు అసాధ్యం. ప్రపంచంలోని మొత్తం బంగార నిల్వల్లో సుమారు ఐదో వంతు ఇక్కడ ఉంది. వీటిలో 90 శాతానికి పైగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్ద సంస్థలకు చెందినవి. కేవలం చిన్న భాగమే స్థానికం. అంతేకాకుండా, వాల్ట్ లోపలే ఒక దేశం నిల్వ నుంచి మరొక దేశం నిల్వకు మార్చడం ద్వారా తరలింపు పూర్తవుతుంది. భౌతిక రవాణా అవసరం లేకుండానే దేశాల మధ్య బదిలీ సాధ్యమవుతుంది. ఇది సంక్షోభ కాలంలో కీలక ప్రయోజనం.
అనేక దేశాలు తమ బంగార నిల్వలను ఎక్కువ భద్రతా, లిక్విడిటీ ఉన్న ప్రాంతాలకు మార్చుకుంటున్న ధోరణిని కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భౌగోళిక రాజకీయ రిస్కులు పెరిగే కొద్దీ, బంగారం వంటి సంప్రదాయ ఆస్తులపై ఆధారపడటం పెరుగుతుంది. అయితే, ఇటువంటి తరలింపులు ఖర్చు, సమయం, సమన్వయం అవసరమైన క్లిష్టమైన ప్రక్రియలు. భవిష్యత్తులో మరిన్ని కేంద్ర బ్యాంకులు ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది.