Dmitry Medvedev: అప్పట్లో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు.. బాగా ఫేమస్ అయిన పేరు వేణు స్వామి. ఇతడు జ్యోతిష్కుడు, సంఖ్య శాస్త్రం కూడా తెలిసినవాడు అని చెప్పుకుంటాడు. అప్పట్లో చై, సామ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు విడిపోతారని ఏదో నెత్తి మాసిన యూట్యూబ్ ఛానల్ లో వాగాడు. వారిద్దరి వేవ్ లెంగ్త్ కుదరక విడిపోయారు. వారిదారులు వారు చూసుకున్నారు. ఆ దెబ్బకు వేణు స్వామి సెలబ్రిటీ అయ్యాడు. ” చూసారా నేను చెప్పింది నిజమైంది అని” జబ్బలు చరుచుకున్నాడు. కొన్నాళ్ల పాటు టీవీల్లో, యూ ట్యూబ్ చానెల్లో మొత్తం అతగాడే నిండి పోయాడు. పిచ్చి ముదిరింది నెత్తికి రోకలి చుట్టండి అన్న తీరుగా అప్పట్లో ఒక్కటయిన నయన్, విఘ్నేష్ శివన్ కూడా విడిపోతారని చెప్పాడు.. అంతేకాదు కొంతమంది సినీ తారల కెరియర్ కూడా ఎలా ఉంటుందో వెల్లడించాడు. కానీ ఇవేవీ నిజాలు కాలేదు. ఒకవేళ నిజం అయితే అతడి క్రెడిట్, లేకుంటే సైలెంట్..ఇక ఆ చానెళ్ళు, యూ ట్యూబ్ చానెళ్ళు రేటింగ్స్,వ్యూయర్ షిప్ గోల లో పడి పనికి మాలిన విషయాల పై డిబెట్లు పెట్టడం మరింత దారుణం. సరే ఈ వేణు స్వామి గోలను పక్కన పెడితే రష్యాలో ఓ కాలజ్ఞానినని చెప్పుకుని తిరిగే ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పేరు దిమిత్రి మెద్వదేవ్. ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకంటే… అతడు చేసిన వ్యాఖ్యలు అటువంటివి కనక. ఇతడు నోస్ట్రా డామస్ కు తాత. ఈయన వృత్తి రష్యన్ ఫెడరేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, ప్రెసిడెంట్ కూడా. జోస్యాలు చెప్పడం ప్రవృత్తి.. 2023లో జరగబోయే సంచలన సంగతులను చెప్పేస్తున్నాడు.

అమెరికా అధ్యక్షుడిగా మస్క్
ట్విట్టర్ విలువ పడిపోతూ, నెత్తి నోరు కొట్టుకుంటున్న ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడట. అంతేకాదు, అమెరికాలో అంతర్యుద్ధం జరిగి కాలిఫోర్నియా, టెక్సాస్ విడిపోయి స్వతంత్ర దేశాలుగా మారిపోతాయట. టెక్సాస్, మెక్సికో విలీనమైపోతాయట. ఈ అంతర్యుద్ధం అంతమయ్యాకే ఎలన్ మస్క్ మహర్జాతకం పని చేయడం ఆరంభించి, ఎకాఎకి అధ్యక్షుడు అయిపోతాడట. ఈ విలీనాలు, విడిపోవడాలకు మరో అగ్ర రాజ్యం బ్రిటన్ కూడా అతీతం ఏమీ కాదట! అది మళ్ళీ యూరోపియన్ యూనియన్ లో చేరుతుంది..కానీ ఐర్లాండ్ విడిపోయి స్వతంత్ర దేశంగా నిలబడుతుంది. తర్వాత ఈయూ కుప్ప కూలిపోతుందట. యూరో ను దేకే వాడు ఉండడట.
పెట్రో ధరలు పైపైకి
చమురు ధరలు కూడా దారుణం గా పెరుగుతాయట. లీటర్ ధర 150 కి చేరుకుంటుందట. పోలండ్, హంగరీ లు ఉక్రెయిన్ పశ్చిమ భాగాలను స్వాధీనం చేసుకుంటాయి. మరీ రష్యా ఏం చేస్తుందో చెప్పలేదు. అసలే రోజులు బాగోలేవు. పుతిన్ విమర్శకులు ఇద్దరు ఇండియాలో శవాలుగా తేలారు. ఎందుకొచ్చిన రిస్క్.. ఇప్పటికైతే మెద్వ దేవ్ పుతిన్ కు నమ్మకస్తుడే. పోలండ్, బాల్టిక్ దేశాలు, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, కీప్ రిపబ్లిక్ ఇతర పరిసర దేశాలన్నీ కలుపుకుని జర్మనీ ఫోర్త్ రీచ్ ఏర్పాటు చేస్తాయట. ఈ నాలుగో జర్మనీ రాజ్యానికి, ఫ్రాన్స్ కు మధ్య యుద్ధం జరుగుతుంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ పతనమవుతాయట. చెప్పుకుంటూ పోవాలే గానీ ఇంకా చాలా ఉన్నాయి.

ఏ కోణం లో చూసినా..
వీటిల్లో ఏ కోణంలో నుంచి చూసినా ఏవీ నిజమయ్యే దాఖలాలు లేవు. అప్పుడప్పుడూ పాశ్చాత్య మీడియాలో కుట్ర సిద్దాంతాలు కొన్ని ప్రచురితమవుతుంటాయి. ఫలానా నెలలో ప్రపంచం కాలిపోతుంది. ఫలానా ఏడాది లో ప్రళయం వచ్చేస్తుంది. ఇలాంటి జోస్యాలు చెబుతుంటాయి. అచ్చం ఆ బ్లేడ్ బండ్ల గణేష్, కేఏ పాల్, బ్లడ్ బ్రీడ్ నటుడు మాట్లాడుతున్నట్టే ఉంటాయి. కేఏ పాల్ ఎప్పుడూ నెగిటివ్ థాట్ లో ఉండడు. కానీ మెద్వదేవ్ మాత్రం కుట్ర సిద్దాంతులను మించిన సిద్ధాంతి గా కనిపిస్తున్నాడు. ఇంకా నయం పాకిస్తాన్ ప్రపంచ ఆర్థిక శక్తి అవుతుందని, ఆప్ఘనిస్తాన్ మరో వాటికన్ సిటీ అవుతుందని చెప్పలేదు. ఎక్కడి నుంచి వస్తార్రా భాయ్ మీ లాంటి వాళ్ళు.