India Independence Day: ఇటీవల పార్లమెంట్ సభ్యురాలు సుప్రియ సూలే కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే.. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక హాజరయ్యారు. వారంతా కూడా ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. ఈ సమయంలో మల్లికార్జున కార్గే ను ప్రధానమంత్రి పలకరించారు. అదే సమయంలో మీరు మారిపోయారంటూ మల్లికార్జున నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో నరేంద్ర మోడీ నవ్వుతూ మల్లికార్జున భుజం తట్టి వెళ్లిపోయారు.
ఈ సన్నివేశం పొలిటికల్ వర్గాలలో చర్చకు దారి తీసింది. నిజంగానే నరేంద్ర మోడీ మారిపోయారా.. కాంగ్రెస్ అంటే చాలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండే ఆయన ఎందుకు ఇలా తనను తాను మార్చుకున్నారు.. అని చాలామందిలో ఒక అనుమానం వచ్చింది. అది అనుమానం కాదని.. నిజంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారిపోయారని శనివారం నాటి స్వాతంత్ర వేడుకలలో ప్రస్ఫుటమైంది. శనివారం ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగరవేసి.. జాతి మొత్తాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తంగా స్వాతంత్ర వేడుకల ఉద్దేశాన్ని వివరించారు. దేశం సాధించాల్సిన ప్రగతిని.. సాధించిన ప్రగతిని వివరించారు.
నరేంద్ర మోడీ తన ప్రసంగంలో స్వాతంత్ర్య సమరవీరుల గురించి ప్రస్తావించారు. అయితే తొలిసారి నెహ్రూ పేరును నరేంద్ర మోడీ ప్రస్తావించడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. 2014 నుంచి ఇప్పటివరకు దేశానికి ప్రధాన మంత్రి దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ ఏనాడు కూడా నెహ్రూ గురించి సానుకూలంగా మాట్లాడలేదు.. కనీసం ఆయన గురించి ప్రస్తావించలేదు. పైగా నెహ్రూ ఆధ్వర్యంలో భారతదేశం ఎదుర్కొన్న కష్టాల గురించి మాత్రమే ఆయన పదేపదే ప్రస్తావించేవారు. నెహ్రూ చేసిన తప్పిదాల గురించి మాత్రమే వివరించేవారు. కానీ తొలిసారి స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో నెహ్రూ కూడా ఆయన చోటు కల్పించడం.. ఎర్రకోట వేదికగా నెహ్రూ పేరు ప్రస్తావించడం విశేషం..
ఇటీవల కాలంలో నీట్ ఉద్యమం జరగడం.. కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదం తొక్కడం.. వంటి పరిణామాలు నరేంద్ర మోడీ ఆలోచన సరళిని పూర్తిగా మార్చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే ఆయన జనరేషన్ జెడ్ ను ఆకట్టుకునే విధంగా వీడియోలను రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. నెహ్రూ పేరును ప్రస్తావించి.. ఆ పార్టీ నేతల నోర్లు మూయించారని విశ్లేషకులు అంటున్నారు. తద్వారా తనమీద ఇప్పటివరకు ఉన్న అపప్రదను నరేంద్ర మోడీ తొలగించుకున్నారని.. దేశ రాజకీయాలలో సరికొత్త శకానికి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.