India 5th Generation Fighter Jets: ఆధునిక కాలంలో యుద్ధాలు మారిపోతున్నాయి. ఆ యుద్ధాలు ఎలా వస్తాయో.. ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు. పైగా యుద్ధాలు చేసే స్థాయి కూడా మారిపోయింది. అత్యాధునిక ఆయుధాలను వాడటం పెరిగిపోయింది. వాటి వల్ల వినాశనం అనేది తీవ్రస్థాయిలో ఉంటుంది. అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఇదే జరిగింది. అంతకుముందు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇదే జరిగింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ రంగానికి భారత్ కేటాయింపులు పెంచింది. దీంతోపాటు అత్యాధునిక ఆయుధాలను సొంతంగా సమకూర్చుకునే విధానంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే స్వదేశీ ఫైటర్ జెట్ల తయారీకి ఎల్ అండ్ టి, బిఇఎల్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్ సంస్థలను షార్ట్ లిస్టు చేశారు. తాజాగా ఆ కంపెనీ నుంచి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించారు.
వచ్చే ఐదు నెలల కాలంలో ఈ కంపెనీలలో ఒకదానిని ఫైనల్ చేస్తారు. ఫైనల్ అయిన సంస్థ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ తో కలిసి పనిచేస్తుంది. అంతేకాదు ఆధునిక కాలంలో యుద్ధ అవసరాలకు తగ్గట్టుగా ఫైటర్ జెట్ల విమానాలను తయారు చేస్తూ ఉంటుంది. విమానాల తయారీని ఏఎంసీఏ ప్రోగ్రాం కింద రూపొందించారు. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 15 వేల కోట్ల రూపాయలు. వీటి ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ విమానాలను తయారు చేస్తారు. ఇటీవల కాలంలో అమెరికా ఇరాన్ చేతిలో అనేక రకాల యుద్ధ విమానాలను నష్టపోయింది.. ఆ లోపాలను గుర్తించి.. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనే స్థాయిలో యుద్ధ విమానాలను తయారు చేస్తారని తెలుస్తోంది.
మన దేశం ఇతర దేశాల మీద యుద్ధాలకు వెళ్ళకపోయినప్పటికీ.. ఎటువంటి ఆక్రమణలకు పాల్పడకపోయినప్పటికీ.. స్వదేశీ రక్షణ కోసం యుద్ధ విమానాలు అత్యాధునిక స్థాయిలో ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లే యుద్ధ విమానాల తయారీలో కీలకమైన ముందడుగు వేసింది. ఏకంగా ఐదవ తరం యుద్ధ విమానాలను భారత్ తయారు చేస్తున్న నేపథ్యంలో.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా మన వైపే చూస్తోంది. కేవలం సొంత అవసరాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉంటాయని సమాచారం. ఇప్పటికే కొన్ని దేశాలకు భారత్ ఆయుధాలను విక్రయిస్తోంది. గతంతో పోల్చి చూస్తే కొన్ని వందల రెట్ల వ్యాపారాన్ని రక్షణ రంగంలో భారత్ నమోదు చేయడం విశేషం.
