Telangana MLA Defections Controversy: అనగనగా ఒక రాజు. ఓరోజు దర్బారులో పంచాయితీ నిర్వహిస్తున్నారు. ఓ దొంగతనం కేసులో అందరినీ విచారిస్తున్నారు. ఇంతకీ జరిగిన దొంగతనం ఏంటంటే.. ఓ రైతు మామిడి తోటలో కొందరు అక్రమంగా ప్రవేశించి మామిడి కాయలను దొంగింలించారు. ఆ తర్వాత వాటిని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు.
Also Read: రాజమౌళి ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్నాడా..?
ఈ విషయాన్ని ఆ రైతు రాజుకు విన్నవించాడు. దీంతో పుర్వాపరాలు కనుకున్న రాజు దొంగతనం పంచాయతీని విచారించడం మొదలు పెట్టారు. అనుమానితులను పంచాయతీలో ప్రవేశపెట్టారు. ఒక్కొక్కరిని విచారించారు. అందరూ పొంతనలేని వివరాలు చెప్పారు. అయితే మామిడి కాయలను దొంగిలించామనే విషయాన్ని చెప్పకుండా విక్రయించిన విషయాన్నిఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని పట్టుకున్న రాజు.. పదే పదే వారిని అడగడంతో మామిడికాయలను దొంగిలించామని ఒప్పుకున్నారు.
రాజు విచారిస్తున్న సమయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఎవరూ తాము దొంగతనానికి పాల్పడలేదని చెప్పారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పార్టీ, బాధిత పార్టీ చెబుతున్న మాటలు, వల్లె వేస్తున్న సుభాషితాలు అలాగే ఉన్నాయి మరి.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీశారు. దుగ్యాల శ్రీనివాసరావు నుంచి మొదలు పెడితే సంతోష్ వరకు అందరూ కాంగ్రెస్ లో చేరారు. నాడు కేసీఆర్ ఆ పరిణామం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఎలా తీసుకుంటారు? పార్టీ ఫిరాయింపులకు ఎలా పాల్పడతారు అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిరాయింపులకు గేట్లు తెరిచారు కేసీఆర్. టీడీపీ నుంచి మొదలు పెడితే వైసీపీ వరకు ఏ పార్టీని వదలకుండా అందరినీ వదలకుండా కొనేశారు. శాసనసభలో, శాసనమండలిలో ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకున్నారు.
తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పచ్చజెండా ఊపింది. దీంతో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పల్లవి పాడారు. దీనిని ప్రశ్నిస్తూ గులాబీ పార్టీ సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అనేక దఫాలుగా కేసును విచారించిన సుప్రీం కోర్టు నిర్ణయాధికారాన్ని స్పీకర్ కు వదిలేసింది. స్పీకర్ అనేక రకాలుగా విచారించి.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు అని చెప్పడానికి రుజువులు లేవని తేల్చి పడేశారు.
ఈ పరిణామాన్ని గులాబీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యం సర్వనాశనమైందని విలపిస్తోంది. కానీ, అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీ ఏ చేసింది? గులాబీ దళపతి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? అనే విషయాలను మర్చిపోతే ఎలా? ఎమ్మల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మాట్లాడే నైతికత గులాబీ పార్టీకి లేదు. సమర్థించుకునే స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రంలేదు. ఎందుకంటే అందరూ గురవింద గింజలే.