spot_img
Homeటాప్ స్టోరీస్Rohit Reddy Farmhouse Case: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు.. రేవంత్ చేతికి 162...

Rohit Reddy Farmhouse Case: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు.. రేవంత్ చేతికి 162 ఎకరాలు.. 3,240 కోట్లు.. ఏం చేస్తారనేది ఆసక్తికరం..

Rohit Reddy Farmhouse Case: తీగ లాగితే డొంకంతా కదులుతుంది అనే సామెత మీకు గుర్తుంది కదా.. ఇప్పుడు తెలంగాణలో ఈ సామెత ఒక భారీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఆ వ్యవహారాన్ని తవ్వుతుంటే అధికారులకు సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 162 ఎకరాల భూమి.. 3,240 కోట్ల వ్యవహారం తెరపైకి రావడం సంచలనం కలిగిస్తోంది.

ఇటీవల మొయినాబాద్ ప్రాంతంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మాదక ద్రవ్యాల పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు.. ఇంకా కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యవహారంలో విచారణ సాగిస్తున్న అధికారులకు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

మొయినాబాద్ వ్యవహారంలో అజీజ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన కీలకమైన విషయం ప్రభుత్వానికి చేరింది. అజీజ్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం అభివృద్ధి చెందడంతో అజీజ్ నగర్ లో భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరాస్తి వ్యాపారం అంత జోరుగా లేకపోయినప్పటికీ.. అజీజ్ నగర్ ప్రాంతంలో ఎకరం విలువ కోట్లల్లో ఉందంటే.. అక్కడ డిమాండ్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

అజీజ్ నగర్ ప్రాంతంలో దాదాపు 162 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రజా ప్రతినిధులు.. ఉన్నతాధికారులు భూములను కొనుగోలు చేసినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసులో విచారణ సాగిస్తున్న అధికారులకు ఈ విషయాలు తెలిశాయి. ప్రస్తుతం ఈ భూముల ధర బహిరంగ మార్కెట్లో 3,240 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఈ భూములను కొనుగోలు చేసిన వారిలో ప్రజాప్రతినిధులు.. ఉన్నతాధికారులు.. వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే వీరందరికీ చట్టాల మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా నిబంధనలు మొత్తం అతిక్రమించారు. అసైన్డ్ భూములు అని తెలిసినప్పటికీ కూడా కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకున్నారు. కొందరైతే పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇంకొందరైతే విద్యాసంస్థలు నిర్మించారు.

అజీజ్ నగర్ ప్రాంతంలోని సర్వేనెంబర్ 177 లో 1954 నుంచి 1955 వరకు ఖాస్రా పహాణి అందుబాటులో ఉంది. దాని ప్రకారం 162.08 ఎకరాల భూమి ఎక్కడ ఉంది. రెవిన్యూ శాఖ అధికారులు వర్గీకరించిన ప్రకారం అది ప్రభుత్వ భూమిగా తేరింది. వర్గీకరణలో మాత్రం కొంతమంది పేరు మీద పట్టాగా నమోదయింది.

1965లో కొంతమంది పేదలకు ఈ భూములను పంచారు. వారు సాగు చేసుకోవడానికి అవకాశం. అయితే ఈ భూములు మావని కొంతమంది తెరపైకి వచ్చారు. 1998లో ఈ వ్యవహారం జరిగింది. నాడు రంగంలోకి దిగిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. ఆ భూములు మొత్తం ప్రభుత్వానివని స్పష్టం చేశారు. 2002లో అసైన్డ్ దారులకు నాటి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆ పట్టాలను రద్దుచేసి.. ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకు ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. కనీసం ఆ భూములను రక్షించే చర్యలు కూడా తీసుకోలేదు.

హైదరాబాద్ నగరంలో పేరుపొందిన ఓ ప్రజా ప్రతినిధి ఇక్కడ ఏకంగా 12.20 ఎకరాల అసైన్డ్ భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నారు. చెన్నై నగరం చెందిన ఒక పారిశ్రామికవేత్త 15.3 ఎకరాలలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. జీవో 111 పరిధిలో ఈ భూమి ఉన్నప్పటికీ ఆయన పరిశ్రమ ఏర్పాటు చేయడం విశేషం. ఇక పేరుపొందిన ఓ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఇక్కడ 11.4 ఎకరాలలో పెద్ద యూనివర్సిటీ నిర్మించారు. మరో వ్యక్తి కూడా అతిపెద్ద పాఠశాల నిర్మించారు.

ఇక ఇక్కడి 162 ఎకరాల అసైన్డ్ భూములలో.. నాడు ప్రభుత్వం కేటాయించిన వారు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో లేరు. వారి చేతిలో నుంచి ఇతరులు భూములు కొనుగోలు చేసి దర్జా అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెవెన్యూ శాఖ అధికారులు కీలక నివేదిక అందించారు మరి దీనిపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular