Konda Susmita Patel: ఇటీవల పరకాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పరకాల టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇస్తామని ప్రకటించారు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించాలని పరకాల ప్రజలకు సూచించారు. ఈ ప్రకటన ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కాక రేపింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గంలో పోటీ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ భావిస్తున్నారు. ఇటీవల ఆమె తండ్రి మురళి కూడా సుస్మిత ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన గతంలో బిజెపిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగానే.. ఈయన కూడా హస్తం కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డికి.. రేవూరి ప్రకాష్ రెడ్డికి బలమైన సాన్నిహిత్యం ఉంది.
పరకాల నియోజకవర్గం మీద ఎప్పటినుంచో కొండా ఫ్యామిలీకి కన్ను ఉంది. అందువల్లే తన కుమార్తెను ఇక్కడ నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మురళి భావిస్తున్నారు. సురేఖ లక్ష్యం కూడా అదే విధంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో సురేఖ కుమార్తె వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుంది. ఆ మధ్య కొండ సురేఖ వ్యక్తిగత కార్యదర్శి వ్యవహారంలో సుస్మిత లైన్ దాటి వ్యవహరించారు. ఏకంగా తెలంగాణ పోలీసుల తీరును తప్ప పట్టారు. ఇద్దరు మంత్రుల గురించి అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది అనుకుంటున్న క్రమంలోనే.. మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు కొండ సుస్మిత.
ఇటీవల పరకాల నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఈ నియోజకవర్గంలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ ప్రకటన కొండ సుస్మితలో ఆగ్రహాన్ని కలిగించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పరకాలకు కాబోయే ఎమ్మెల్యే అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ జోడించింది. దానిని మర్చిపోకముందే బుధవారం ఒక సమావేశంలో రేవంత్ మీద తీవ్రస్థాయిలో మండిపడింది. ముఖ్యమంత్రి అవ్వగానే రేవంత్ కు కళ్ళు నెత్తికి ఎక్కాయని వ్యాఖ్యానించింది. పరకాల లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీని రేవంత్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించింది. డైపర్లు వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డికి ఒకవైపు పొంగు ఉందని.. ఆ పొంగు ఎక్కువసేపు పొంగలేదని ఒక మంత్రిని ఉద్దేశించి సుస్మిత వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ గనుక ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని హెచ్చరించింది.
ఒక మంత్రి కూతురు.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు స్పందించలేదు. సుస్మిత మంట పుట్టించే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ప్రకాష్ రెడ్డి అనుచరులు తెర మీదకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సుస్మిత వర్గం నాయకులు పరకాల నియోజకవర్గం లో హడావిడి చేస్తున్నారు. ఆమె కూడా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.