Indian Independence Day: 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందింది. దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. అయితే ఢిల్లీలో జరిగిన అధికారిక వేడుకల్లో జాతిపిత మహాత్మా గాంధీ పాల్గొనలేదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. స్వాతంత్య్రం సాధించిన వ్యక్తిగా క్రెడిట్ గాంధీకి ఇచ్చారు. అయినా ఆయన వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు ఆయన కోల్‌కతాలోని నోఆఖలీ వెళ్లారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే దేశ విభజన జరిగి, అఖండ భారత్ ఇండియా, పాకిస్తాన్‌గా చీలిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో హిందూ–ముస్లిం అల్లర్లు మొదలయ్యాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆ అల్లర్లను ఆపేందుకు నోఆఖలీ వెళ్లారు. ఇది స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలోని లోతైన అంశాలను గుర్తు చేస్తుంది.
గాంధీ లేకపోవడానికి కారణాలు..
గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన ఎలాంటి పదవీ ఆశించలేదు. ప్రధాని, రాష్ట్రపతి కావాలని కోరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే దేశం విభజనతో రక్తపాతం మొదలైంది. ఆ సమయంలో వేడుకల్లో పాల్గొనడం కంటే ప్రజల ప్రాణాలు కాపాడటం ఆయనకు ముఖ్యమైంది. అందుకే ఢిల్లీ వేడుకలకు దూరంగా ఉండి, అల్లర్ల ప్రాంతాలకు వెళ్లారు. ఇది ఆయన వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉంది. కానీ ఇదే సమయంలో స్వాతంత్య్ర పోరాట చరిత్రలోని ఇతర అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది.
గాంధీ పోరాటంతోనే స్వాతంత్య్రం రాలేదు..
స్వాతంత్య్రం గాంధీ నడిపిన శాంతియుత ఉద్యమంతోనే సాధ్యమైందని చాలామంది నమ్ముతారు. వాస్తవం అంత సరళం కాదు. వేలాది మంది ప్రాణాలు అర్పించారు. భగత్ సింగ్, లాలా లజపతిరాయ్ వంటి విప్లవకారులు రక్తం చిందించారు. చెమట, త్యాగం, జైళ్లు, ఉరులు అనేకం జరిగాయి. శాంతియుత మార్గం ఒకటి, విప్లవ మార్గం మరొకటి. రెండూ కలిసి స్వాతంత్య్రానికి దోహదం చేశాయి. అయితే స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమగ్ర క్రెడిట్‌ను గాంధీ ఖాతాలోనే ఉంచింది. ఇతర యోధుల పాత్రను తగ్గించి చూపించారు. ఇది చరిత్రను అసంపూర్ణంగా చేసింది.
స్వతంత్ర భారతదేశంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర..
స్వాతంత్య్రం రావడం ఒక ఎత్తు. దాన్ని నిలపడం మరో ఎత్తు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇక్కడ కీలకంగా నిలిచారు. వందలాది సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడంలో ఆయన నయా, భయం రెండింటినీ ఉపయోగించారు. రాజుల తిరుగుబాట్లు, విభజన ప్రమాదాలు ఉన్నాయి. పటేల్ లేకపోతే భారత్ పాకిస్తాన్‌లో కలిసిపోయి ఉండేదేమో అనే అనుమానం కూడా ఉంది. ఆయన కృషి లేకుండా ఏకీకృత భారత్ ఆకారం దాల్చేది కాదు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీకి ఎంత క్రెడిట్ ఉందో, దేశ నిర్మాణంలో పటేల్‌కు అంతే ప్రాధాన్యం ఉంది. అయితే ఈ వాస్తవం చాలాకాలం వరకు తగినంతగా చర్చకు రాలేదు.
స్వాతంత్య్ర ఉద్యమం ఒకే వ్యక్తి కథ కాదు. అది వేలాది మంది త్యాగాల సమాహారం. గాంధీ శాంతి మార్గం ఒకటి. విప్లవకారుల రక్తం మరొకటి. పటేల్ నిర్మాణ శక్తి మరోటి. ఒకరిని మాత్రమే హైలైట్ చేసి ఇతరులను వెనుకకు నెట్టడం చరిత్రకు అన్యాయం. స్వాతంత్య్రం వచ్చిన రోజు గాంధీ వేడుకల్లో లేకపోవడం ఆయన ప్రాధాన్యాలను చూపిస్తుంది. అదే సమయంలో ఇతర యోధుల పాత్రను కూడా సమానంగా గుర్తించాలి. అప్పుడే స్వాతంత్య్ర చరిత్ర నిజమైన, పూర్తి రూపం తీసుకుంటుంది.