telugu newspaper : ఆ పత్రిక యాజమాన్యం వేట మొదలుపెట్టింది.. అదే సర్కులేషన్.. ఇటీవల జిల్లాలలో మీటింగ్లు మొదలు పెట్టడంతో.. పేపర్ కాపీల సంఖ్యను పెంచుకునే ప్రక్రియ మళ్లీ మొదలైంది. సర్కులేషన్ పెంట షురూ అయింది.. అసలే ఇప్పుడు సోషల్ మీడియా కాలం. పేపర్ చదివే వాడు లేడు. ఇంగ్లీష్ చదువుల కాలం నడుస్తున్న వేళ తెలుగు పేపర్ ఎవరు చూస్తారు.. ఎవరు అంతగా చదువుతారు.. ఒకవేళ పాఠకులకు ఇష్టం ఉండి పేపర్ కొనుగోలు చేసినప్పటికీ.. సకాలంలో ఇంటికి తీసుకువచ్చి పేపర్ వేసేవాడు ఎవడు..
జిల్లాలలో మీటింగ్లు.. రిపోర్టర్లకు టార్గెట్లు.. ప్రతి ఒక్కరు 50 కాపీలు చేయాలి. ఒక కాపీ చేస్తే 50 రూపాయలు.. మేనేజ్మెంట్ ఇస్తుంది. కాకపోతే కాపీలు బుక్ చేసినందుకు.. ముందుగానే అమౌంట్ ఇవ్వాలి. రీడర్ ఇచ్చినా సరే.. ఇవ్వకపోయినా సరే కచ్చితంగా రిపోర్టర్ కట్టాలి. ఒక్కో జిల్లా నుంచి 500 నుంచి 1000 కాపీలు పెరగాలని మేనేజ్మెంట్ నుంచి ఆర్డర్. ఇటీవల నెట్వర్క్ ఇన్చార్జి నుంచి మెసేజ్ రావడమే ఆలస్యం.. జిల్లాలలో బ్రాంచ్ మేనేజర్లు మీటింగ్లు పెట్టారు. వచ్చిన రిపోర్టర్లకు టీ, బిస్కెట్లు ఇచ్చారు.. సర్కులేషన్ విషయం చల్లగా చెప్పారు.
వాస్తవానికి ఒక పత్రికలో మీటింగ్ పెడితే వార్తల గురించి లేదా నెట్వర్క్ బలోపేతం గురించి చర్చిస్తారు. కానీ ఆ పత్రికలో కేవలం సర్కులేషన్, యాడ్స్ గురించి మాత్రమే మీటింగ్ పెడుతుంటారు. పోనీ ఈ స్థాయిలో కష్టపడిన రిపోర్టర్లకు ఏమైనా లైన్ ఎకౌంట్ ఇస్తారా అంటే.. ఏదీ ఉండదు. ఉత్తి పుణ్యానికి చాకిరీ చేయాలి. మేనేజ్మెంట్ టాస్కులు పూర్తి చేయాలి. యానివర్సరీ యాడ్స్.. సర్కులేషన్ చేయాలి.
గత కొంతకాలంగా ఆ పత్రికలో ఈ వ్యవహారం దర్జాగా సాగుతోంది. గతంలో అంటే ఆ పేపర్ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఆ పత్రికకు సొంతంగా ఛానల్ కూడా ఉంది. డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆ పత్రిక యాజమాన్యం డబ్బుల కోసం ఈ స్థాయికి దిగజారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ పత్రికలో చెప్పుకునే స్థాయిలో వేతనాలు ఉండవు. శ్రమదోపిడికి నిలువుటద్దం లాగా ఆ పత్రిక కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ పత్రిక యజమాని ఉదయం లేస్తే నీతులు చెబుతుంటారు. కొత్త కొత్త పలుకులతో సమాజానికి హిత బోధనలు చేస్తుంటారు. పత్రిక రాసే వార్తల్లో దమ్ముంటే.. ఆ వార్తలలో నిజాయితీ ఉంటే పత్రికను జనం ఎగబడి కొంటారు. దానికోసం ప్రత్యేకంగా రిపోర్టర్లు సర్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. కనిపించిన ప్రతి ఒక్కడిని పేపర్ కొనుగోలు చెయ్యి అంటూ బతిమిలాడాల్సిన అవసరం లేదు..