Hyderabad Restaurants: అపరిచితుడు సినిమా చూశారా.. అందులో ఒక వ్యక్తికి విక్రం క్రిమి భోజనం అనే శిక్ష వేస్తాడు.. సేమ్ అలాంటిదే ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఎటువంటి తప్పు చేయకపోయినా.. జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా.. హైదరాబాద్ నగర వాసులకు క్రిమి భోజనం లాంటి శిక్ష పడుతోంది.
హైదరాబాద్ నగరంలో ఒకప్పటితో పోల్చి చూస్తే రెస్టారెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తినే వాళ్ల సంఖ్య కూడా అంతకుమించి అనే స్థాయికి పెరిగిపోయింది. కస్టమర్లు దేవుళ్ళతో సమానం అనే సూక్తిని మర్చిపోయిన యాజమాన్యాలు.. ఇష్టానుసారంగా ఆహారాన్ని వండి వారుస్తున్నాయి. కుళ్ళిపోయి.. బూజు పట్టి.. రకరకాల పురుగులు చేరిన ఆహారాన్ని రంగులతో.. మసాలాలతో.. నూనెలతో మాయ చేస్తున్నాయి. అందువల్లే జనాలు లొట్టలు వేసుకొని తింటున్నారు.
వంట గదిలో వీటిని తయారు చేస్తున్న నేపథ్యంలో.. తమ వ్యవహారం బయటికి రాదు అనుకున్నారేమో.. కానీ మూడో కన్ను చూస్తోంది అనే విషయం వారు మర్చిపోయారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్లలో.. అనేక హోటళ్లలో అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రమాణాలకు సరిపడా ఆహార తయారీ లేని వాటికి నోటీసులు ఇస్తున్నారు. పరిమితి దాటిన వాటిని మూసివేస్తున్నారు. అలా హైదరాబాదులో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకంగా ఏడు రెస్టారెంట్ల మీద దాడులు చేశారు. బంజారాహిల్స్.. గచ్చిబౌలి.. జూబ్లీహిల్స్.. టోలిచౌకి లాంటి ఖరీదైన ప్రాంతాలలో పేరుపొందిన హోటల్స్ మీద దాడులు చేశారు. ఈ సందర్భంగా కళ్ళు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.. బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఓరిస్.. స్పైస్ సిక్స్.. చట్నీస్.. జూబ్లీహిల్స్ లోని ది స్పైసి వెన్యూ.. టోలిచౌకి ప్రాంతంలో ఫోర్ సీజన్స్.. షా గౌస్.. గచ్చిబౌలి ప్రాంతంలో పిస్తా హౌస్ హోటల్స్ మీద అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో కూలిపోయిన కూరగాయలు.. గడుగు ముగిసిన ఆహార ఉత్పత్తులు.. కిచెన్లో పురుగులు.. బొద్దింకలు.. అపరిశుభ్రమైన వాతావరణం.. లేబుల్స్ ఏమాత్రం లేని ఆహార పదార్థాలు కనిపించాయి. ఈ దాడులలో 11 ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్కు నాలుగు ఇంప్రూవ్మెంట్ నోటీసులు.. మూడు హోటల్స్కు షోకాజ్ నోటీసులు పంపించారు. ఈ హోటల్స్ లో సాగుతున్న వ్యవహారం చూస్తే కొన్ని సందర్భాలలో బండి దగ్గర తినే ఆహారమే ఉత్తమం అనిపిస్తోంది. పేరు చూసి వెళ్ళిపోతే మన ఆరోగ్యాన్ని మన చేతులారా నాశనం చేసుకున్నట్టే.