Hyderabad Moinabad Raid: మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో డ్ర*గ్స్ వ్యవహారం సాగింది. తనిఖీలకు వెళ్లిన పోలీసులకు మత్తు వదలరా సినిమా లైవ్ లో కనిపించింది. అంతేకాదు ఈ ఘటనలో ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో తూటాల మోత మోగింది. ఈ ఘటన కాస్త తెలుగు రాష్ట్రాలలో తీవ్రమైన చర్చకు దారి తీసింది.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
తెలంగాణ పోలీసులకు హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున డ్ర*గ్స్ వ్యవహారం సాగుతోందని సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేస్తుండగా పోలీసుల మీదకు కొంతమంది కాల్పులకు పాల్పడ్డారు. దీంతో తూటాల శబ్దంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే ఈ ఘటనలో రాజకీయ ప్రముఖులు ఉండడం సంచలనం కలిగిస్తోంది. విదేశాల నుంచి డ్ర*గ్స్ సరఫరా చేసే వ్యక్తులకు ఈ సంఘటనతో లింకు ఉందని పోలీసులు చెబుతున్నారు.
గులాబీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో డ్ర*గ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న ఈగల్ టీం పోలీసులు మెరుపు దాడి చేశారు. పోలీసులు వస్తున్న క్రమంలోనే ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నమిత్ మిశ్రా (ఇతడు ఢిల్లీ వ్యక్తి) తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. అతడు వాడిన తుపాకి రితేష్ రెడ్డి అనే వ్యక్తికి చెందినదని తెలుస్తోంది. ఆ తుపాకి కి లైసెన్స్ ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనతో పోలీసులు వెంటనే ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అక్కడి పరిస్థితిని అంచనా వేసి వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం చుట్టుముట్టారు. అందులో మత్తు పదార్థాలు స్వీకరించి.. మైకంలో జరుగుతున్న 9 మంది పురుషులను.. ఒక మహిళను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రెండు గ్రాముల నిషేధిత మత పదార్థం.. తుపాకీ.. తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు. అయితే అతడికి పోలీసులు వైద్యుల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి.. మిగతా నలుగురికి పాజిటివ్ వచ్చింది. అర్జున్ రెడ్డి, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, నమిత్ మిశ్రా అనే వ్యక్తులు డ్ర*గ్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వారందరిని కూడా ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ కేసులో అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు.
అయితే ఆ మాజీ ఎమ్మెల్యేకు ఈ డ్ర*గ్స్ ఎవరు సరఫరా చేశారు? వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రోహిత్ రెడ్డి మాత్రమే ఈ పార్టీని నిర్వహించారా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉన్న నేపథ్యంలో.. వారి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. చూడబోతే ఈ కేసు అత్యంత జటిలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
