T20 World cup india vs pakistan 2026: టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. బంగ్లాదేశ్ విజ్ఞప్తులను ఐసీసీ తిరస్కరించడం.. ఫలితంగా ఆ దేశానికి పాకిస్తాన్ అండగా నిలవడం.. ఆ తర్వాత బంగ్లాదేశ్ టూర్ నుంచి నిష్క్రమించడం.. దీంతో పాకిస్తాన్ భారత్ తో ఈనెల 15న శ్రీలంకలో జరిగే మ్యాచ్ ను రద్దు చేసుకోవడం వంటి పరిణామాలు ఇటీవల చోటుచేసుకున్నాయి.
కొద్దిరోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు సంబంధించి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో తలపడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు శ్రీలంక క్రికెట్ బోర్డు లెటర్ కూడా రాసింది. దీనిపై ఇంతవరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇది ఇలా ఉండగానే జాతీయ మీడియాలో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగే మ్యాచ్ కు సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని.. వాస్తవానికి పాకిస్తాన్ భారత్ తో ఆడక పోవడానికి గల కారణాలను అంతగా చూపించలేదని.. ఒకవేళ భారత జట్టుతో జరిగే మ్యాచ్ ఆడకపోతే ఆ నష్టం తీవ్రత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అధికంగా ఉంటుందనేది క్రికెట్ నిపుణుల అంచనా.
పాకిస్తాన్ కూడా ఆదాయాన్ని ఐసిసి ద్వారా 50% పొందుతోంది. ఐసీసీకి దాదాపు 90 శాతం ఆదాయం బిసిసిఐ ద్వారా వస్తోంది. అలాంటప్పుడు పాకిస్తాన్ భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను రద్దు చేసుకుంటే నష్టపోతుంది. ఒకవేళ బీసీసీఐ గనుక ఐసీసీ మీద ఒత్తిడి తీసుకొస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. ఆర్థికంగా నష్టాలు మాత్రమే కాకుండా.. ఆ దేశంలో క్రికెట్ మనుగడ కూడా ప్రమాదంలో పడుతుంది.
అప్పట్లో పాకిస్తాన్ కేంద్రంగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు.. ఆ ప్రాంతంలో మైదానాలను ఆధునికరించింది. దీనికోసం భారీగా డబ్బు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టింది. అవి పూడ్చాలి అంటే పాకిస్తాన్ జట్టు కచ్చితంగా టీమ్ ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడాలి. ఒకవేళ పాకిస్తాన్ అదే తీరుగా బెట్టు కొనసాగిస్తే ఐసీసీ విధించే కఠిన చర్యలకు తల వంచాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. తమ ప్రత్యర్థి నిర్ణయంతో సంబంధం లేదని.. తాము ఆ రోజున కొలంబోలోనే ఉంటామని.. మ్యాచ్లో తలపడేందుకు సాధన చేస్తూ ఉండే ఉంటామని పేర్కొన్నాడు. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై అన్ని విధాలుగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.