Sun Pictures shock to Chennai Super Kings: ఒకప్పుడు ఫేమస్ అయిన పాటలను వివిధ సందర్భాలలో వాడుకోవడానికి అవకాశం ఉండేది. తద్వారా ఆ పాటకు మరింత పాపులారిటీ వచ్చేది. అంతేకాదు ఆ సందర్భం మరింత బలంగా ప్రజలలోకి వెళ్ళేది. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. కాపీ రైట్, అనుమతి వంటి వ్యవహారాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఒరిజినల్ కంటెంట్ సృష్టికర్తలు కోర్టు దాక కూడా వెళ్తున్నారు. పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఉదాహరణకు ఇళయరాజాను తీసుకుంటే.. ఆయన తన సినిమాలోని పాటలను ఇతర వేదికల వద్ద లేదా ఇతర కార్యక్రమాల వద్ద వాడుకుంటే పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు దాకా వెళ్లి నోటీసులు కూడా పంపిస్తున్నారు. అంతటి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కూడా ఇళయరాజా నోటీసులు పంపించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల డెకాయిట్ సినిమా టీజర్ విడుదలైంది. అందులో హలో బ్రదర్ సినిమాలోని ఓ పాటను వాడుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలను కోటి కంపోజ్ చేశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా పాటలను ఎలా వాడుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ విలేకరులతో మాట్లాడారు. ఆ పాటను వాడుకునే విషయంలో ఆదిత్య సంస్థను సంప్రదించామని.. ఈ విషయానికి సంబంధించిన సమాచారం సంగీత దర్శకుడు కోటికి చేరడంలో ఆలస్యం జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. ఒరిజినల్ పాటల వాడకం.. ఇతర కాపీరైట్ వ్యవహారాల కు సంబంధించిన సంఘటనలు ఇటీవల కాలంలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి.
Also Read: కావ్య మారన్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దమ్మా.. పునాదులు కదిలిపోతాయి
ఇక ఇప్పుడు రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన పాటల వ్యవహారం సన్ పిక్చర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తీవ్రమైన వివాదాన్ని రేకెత్తించింది. ఐపీఎల్ నేపథ్యంలో చెన్నై జట్టు జైలర్, కూలి సినిమాలలోని పాటలను వాడుకుంటున్నది. ఆ పాటలలో ఉన్న గూస్ బంప్స్ బిట్ లను చెన్నై జట్టు వాడుకుంటున్నది. దీనిపై సన్ పిక్చర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు ఏకంగా చెన్నై కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నోటీసులు కూడా పంపించింది. సన్ పిక్చర్స్ పిటిషన్ నేపథ్యంలో అనేక వివరాలను పరిశీలించిన కోర్టు.. ఇకపై రజనీకాంత్ నటించిన కూలీ, జైలర్ సినిమాల పాటలను ప్రమోషన్ కోసం వాడుకోకూడదని చెన్నై జట్టుకు సూచించింది.
