Tirumala: తిరుమల శ్రీవారి చరిత్రలో తొలిసారిగా 121 కిలోల బంగారు ఆభరణాలు స్వామివారికి అందబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఓ ప్రవాస భారతీయుడు స్వామివారికి ఈ తరహలో బంగారు నగలు అందించబోతున్నారు. స్వామివారి శిరస్సు నుంచి మొదలు పెడితే పాదాల వరకు అలంకరించే ఆభరణాలు కిరీటం.. శంకు చక్రాలు.. కటి వరద హస్తాలు.. వడ్డానం.. పాదుకలు ఇలా దాదాపు 45 రకాల ఆభరణాలను ఒక జువెలరీ సంస్థ ద్వారా ఆ భక్తుడు తయారు చేయించారు. ఇప్పటికే ఈ ఆభరణాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్నాయి.
121 కిలోల బంగారు ఆభరణాలు అందించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే తొలిసారి. ఇప్పటికే తిరుమల శ్రీవారికి 650 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 6000 కోట్లకు పై మాట. ఇందులో పొదిగిన వజ్రాలు.. రత్నాలు.. కెంపులు ఉన్నాయి. వాటిని కూడా కలిపితే దాదాపు పదివేల కోట్ల వరకు ఉంటుంది.
ఆభరణాలను ఇప్పటికే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వద్దకు చేర్చారు. ఈ ఆభరణాలను సీఎం చంద్రబాబు ఉదయం 10:40 నిమిషాలకు గాయత్రి అది గృహానికి చేరుకున్న తర్వాత.. సంప్రదాయ వస్త్రధారణంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు వెళ్తారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్తారు. ముఖ్యమంత్రి సమక్షంలో స్వర్ణ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేస్తారు. శ్రీవారి దర్శన అనంతరం చంద్రబాబు తిరిగి మళ్లీ గాయత్రి అతిథిగృహానికి చేరుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనాలు.. చేపట్టాల్సిన ఏర్పాట్లు.. టికెట్ల కేటాయింపు వంటి వాటి మీద అధికారులతో సమీక్ష చేస్తారు. అనంతరం ఆభరణాల విరాళానికి సంబంధించిన వివరాలతో పాటు.. వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్లను మీడియాకు చంద్రబాబు వెల్లడిస్తారు.
తిరుమల శ్రీవారికి రత్న ఖచితమైన, వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు ప్రతివారం అభిషేకం తర్వాత అలంకరిస్తూ ఉంటారు. ఇందులో శంకు చక్రాలు.. రత్నాల శంకు చక్రాలు.. రత్నాల కర్ణ పత్రాలు. రత్నాల మకర కంటి. రత్నాల కటిహస్తం.. రత్నాల వైకుంఠ హస్తం.. స్వర్ణ పద్మ పీఠం.. స్వర్ణ పాదాలు.. అష్టోత్తర శతనామహరం. సహస్రనామం. సూర్య కటారి. కడియాలు.. కరభూషణాలు.. భుజదండ భూషణాలు.. నాగాభరణాలు.. భుజకీర్తులు.. సాలిగ్రామహారం.. తిరుకాలం.. ఆకాశరాజు కిరీటం.. వజ్ర అశ్వత్థ పత్రహారం.. ఒక పట్టి.. 5 పేటల కంటి. చంద్రవంక కంటి. పాగడాలు.. కాంచి గుణం.. అంకెలు.. వడ్డాణాలు.. గోపు హారం.. స్వర్ణ యజ్ఞోపవీతం.. తులసీ పత్రహారం.. పులిగోరు హారం ఇలా అనేక రకాల ఆభరణాలు స్వామి వారికి ఉన్నాయి. వీటిలో సహస్రనామ మాల.. లక్ష్మీ హారం.. పచ్చలు పొదిగిన కంటాభరణం.. వక్షస్థల లక్ష్మి.. లక్ష్మీ హారాలు.. సాలగ్రామహారం శ్రీవారి మీద నిత్యం ఉంటాయి. మిగిలిన ఆభరణాలు మూడు జతలకి పైగా ఉండడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని అవసరాలు తగ్గట్టుగా స్వామి వారికి అలంకరణ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా వస్తున్న విరాళంతో శ్రీవారి అలంకరణకు మరో జత ఆభరణాలు తోడు కాబోతున్నాయి.