Gold Prices:అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్ళీ కోలుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్లో నష్టాలను ఎదుర్కొన్న విలువైన లోహాలు.. అమెరికాలో స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో తిరిగి లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా అమెరికాలో థాంక్స్ గివింగ్ సెలవులకు ముందు వాల్ స్ట్రీట్ లో కనిపించిన సానుకూల సంకేతాలు బంగారం, వెండి మార్కెట్ల మీద ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పెట్టుబడిదారులు పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అమెరికా ఆర్థిక పరిణామాలు.. డాలర్ కదలికలు.. వడ్డీ రేట్ల మీద అంచనాలు బంగారం.. వెండి ధరల దిశను ప్రభావితం చేస్తున్నాయి.
భారీ పతనం నుంచి ఒక్కసారిగా రికవరీ
బుధవారం (నవంబర్ 25) అమెరికా ట్రేడింగ్లో బంగారం ధర ఒక దశలో ఔన్స్ కు 3,426,40 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే ఆ తర్వాత కొనుగోలు పెరగడంతో తిరిగి 3,570 డాలర్ల స్థాయిని దాటేసింది. అదేవిధంగా వెండి ధర కూడా భారీగా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒక దశలో ఔన్స్ కు 38.09 డాలర్లకు పడిపోయిన వెండి.. ఆ తర్వాత కోలుకొని 41 డాలర్ల స్థాయిని అధిగమించింది. కిట్కో నివేదిక ప్రకారం అమెరికా ట్రేడింగ్ ముగింపు సమయానికి స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు 3,576.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 0.60 శాతం లాభపడింది. వెండి ధర 41.12 డాలర్ల వద్ద ఉండగా.. 0.78 శాతం పెరిగింది..బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి..ఈ రికవరికి ప్రధానంగా మూడు అంశాలు కారణంగా ఉన్నాయి..
అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గుదల..
అమెరికా పదేళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ తగ్గడంతో బంగారం, వెండి వంటి పెట్టుబడి సాధనాలకు కొంత సపోర్ట్ లభించింది.
వాల్ స్ట్రీట్ కోలుకోవడం
టెక్నాలజీ షేర్ లలో అమ్మకాల ఒత్తిడి తగ్గడంతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రారంభ నష్టాల నుంచి గణనీయంగా కోలుకున్నాయి.
తక్కువ ధరల వద్ద కొనుగోలు
ఉదయం భారీగా పడిపోయిన ధరలను అవకాశంగా భావించిన కొందరు పెట్టుబడుదారులు మళ్ళీ కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.
అమెరికాలో ధరల స్థాయి.. ఫెడ్ నిర్ణయం పై ఆసక్తి
అమెరికాలో అక్టోబర్ నెల వ్యక్తిగత వినియోగ వ్యయాల ధరల స్థాయి వార్షిక ప్రాతిపదికన 3.8 శాతానికి చేరింది. కోర్ పిసిఈ ధరల స్థాయి 3.3 శాతంగా నమోదయింది. అలాగే 2026 మూడవ త్రైమాసికంలో అమెరికా జీడిపి వృద్ధిరేటు వార్షిక ప్రాతిపదికన 4.3 శాతం గా నమోదయింది. ఈ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయంపై అంచనాలను ప్రభావితం చేస్తున్నాయి. వడ్డీరెట్లు పెరిగిపోతే వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం.. వెండి వంటి లోహాల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందువల్లే పెట్టుబడిదారులు ఫెడ్ తదుపరి నిర్ణయం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అమెరికాలో థాంక్స్ గివింగ్ సెలవుల నేపథ్యంలో మార్కెట్లలో ట్రేడింగ్ పరిమితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ట్రేడింగ్ పరిమాణం తగ్గితే ధరల్లో హెచ్చు తగ్గులు ఎక్కువగా కనిపించవచ్చు. బంగారం విషయంలో 3600 డాలర్ల స్థాయి కీలకంగా మారే అవకాశం ఉంది. వెండి విషయంలో 41 నుంచి 43 డాలర్ల స్థాయిలను మార్కెట్ పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇవి కిట్కో నివేదికలో పేర్కొన్న సాంకేతికపరమైన అంశాలు మాత్రమే. ఒకవేళ మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా ధరలు మారే అవకాశం ఉంది.
ఇప్పటి మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు పతనమైనప్పటికీ.. అదే స్థాయిలో కొనుగోలు పెరిగింది కాబట్టి తిరిగి కోలుకున్నాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు.. డాలర్ విలువ. బాండ్ ఈల్డ్స్, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వచ్చే రోజుల్లో ఈ విలువైన లోహాల ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.