Raksha Bandhan 2026 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ గురించి ప్రతి ఏడాది సందేహం ఉంటూనే ఉంది. అలాగే ఈ ఏడాది కూడా రెండు రోజుల్లో తిథి గడియలు ఉండడంతో రక్షా కట్టే సమయం ఎప్పుడు అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రక్షా పండుగలో భద్రకాలం లేని సమయం చూసుకొని నిర్వహించుకుంటారు. ఈ ఏడాది 27, 28 తేదీల్లో తిథి గడియలు ఉండడంతో ఏ రోజున పండుగ నిర్వహించుకోవాలి? అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే కొందరు పండితులు తెలుపుతున్న ప్రకారం.. ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలంటే!
తెలుగు పంచాంగం ప్రకారం 2026 ఆగస్టు 27వ తేదీన ఉదయం 9.08 గంటలకు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 28 ఉదయం 9.48 గంటలకు ముగుస్తుంది. ఇలా రెండు రోజుల్లో తిథులు ఉండడంతో గందరగోళం ఏర్పడింది. అయితే పౌర్ణమితిథి 28వ తేదీన ఉదయమే ఉండడంతో ఈ రోజునే రక్షాబంధన్ పండుగ నిర్వహించుకోవడం శుభప్రదం అని అంటున్నారు.
ఆగస్టు 28వ తేదీన సూర్యోదయానికి ముందే భద్రకాలం ముగుస్తుంది. దీంతో ఈరోజున ఉదయం 6.23 గంటల నుంచి 9.48 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చని పండితులు తెలుపుతున్నారు. అలాగే మధ్యాహ్నం 12.14 గంటల నుంచి 1.05 గంటల వరకు కూడా రక్షాబంధన్ నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి సోదరీమణులు తమ సోదరుల ఇళ్లల్లోకి వచ్చి రాఖీ కడతారు. ఎంతో ప్రేమతో రాఖీ కట్టగా తన సోదరుడు బహుమతులు ఇస్తారు. రాఖీ కట్టే ముందు సోదరి నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. అని అనడంతో వారు ఇద్దరు జీవితాంతం కలిసి ఉంటారని.. ఒకరికొకరు సహాయం చేసుకుంటారని పురాణాల్లో చెబుతుంటారు. అలాగే ఈ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరుతారు. వారి మధ్య ఆప్యాయత, ప్రేమ కనిపిస్తుందని చెబుతారు.
అయితే రక్షాబంధన్ సందర్భంగా భద్రకాలం అనే మాట వినిపిస్తుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు అని కొందరు పండితులు చెబుతుంటారు. భద్రకాలంలో రాఖీ కట్టడం వల్ల సోదరి, సోదరుల మధ్య విభేదాలు ఏర్పడతాయని.. వారు దూరమవుతారని చెప్పబడుతోంది. అందువల్ల ఈ సమయం చూసి రక్షాబంధన్ నిర్వహించుకుంటారు. ఈ ఏడాది 28వ తేదీనే రక్షాబంధన్ నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.