China hardship camps : ఒకప్పుడు పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. కానీ వారు సమాజ పరిస్థితులను అర్థం చేసుకొని అన్ని రకాల విషయాలు తెలుసుకొని యాక్టివ్ గా ఉండేవారు. కొందరు కింది స్థానం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. అయితే ప్రస్తుత కాలంలో పిల్లల్ని చాలా గాబరాగా పెంచుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆరాటపడుతూ.. వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇలాంటివారు సమాజ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో వారు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే చైనాలో మాత్రం అందుకు భిన్నంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే కష్టం విలువ తెలియజేస్తున్నారు. అందుకోసం వారు ఏం చేస్తున్నారు తెలుసా?
మన భారతదేశంలో నివసిస్తున్న కొంతమంది పిల్లలకు వ్యవసాయం గురించి పూర్తిగా తెలియదు. ఆహారం ఎలా వస్తుందో అవగాహన ఉండదు. దీంతో వారు ఆహార విలువ తెలుసుకోలేకపోతున్నారు. కానీ చైనాలో మాత్రం చిన్నప్పటి నుంచే వ్యవసాయం గురించి తెలుపుతున్నారు. గ్రామాల్లో పదేళ్ల లోపు చిన్నారులను కఠినమైన పనులను చేయిస్తూ వారికి ఆహారం విలువ తెలియచెప్పుతున్నారు.
చైనాలోని సిచ్వాన్, ఉన్నాన్, గుయిజా వంటి ప్రాంతాల్లో చిన్నారులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తూ వారితో వ్యవసాయం చేస్తున్నట్లు కొన్ని మీడియాల ద్వారా తెలుస్తోంది. వీరు ఆయా ప్రాంతాల్లోని రైతుల ఇళ్లల్లో ఉంచుతారు. మొబైల్ కు దూరంగా ఉంచుతూ.. ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా చేసి పనులు చేయిస్తారు. ఉదయం 5 గంటల నుంచి వీరి పనులు మొదలవుతాయి. క్యాంపులో భాగంగా ఉదయం పిల్లలు రైతులతో పాటు వ్యవసాయం చేస్తూ వారికి సేవ చేస్తారు.
ఈ పనుల్లో కట్టెలు కొట్టడం, పశువులకు మేతవేయడం, చెట్ల బెరడు తొలగించడం, కొన్ని వస్తువులను లేదా కూరగాయలను మోసుకెళ్ళడం వంటి కఠినమైన పనులను చెబుతారు. అయితే ఈ పనులు చేసినందుకు వారికి ప్రత్యేక వర్క్ పాయింట్లు కేటాయిస్తారు. ఈ పని చేస్తే నీకు ఇన్ని
పాయింట్లు అని చెబుతారు. దీంతో పిల్లల మధ్య పోటీ పెరిగి పనులు చేయడానికి ఉత్సాహం పెరుగుతుంది.
ఒకవేళ ఎవరైనా విద్యార్థి పని చేయలేకపోతే వారికి బంగాళదుంపలతో భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వారికి శ్రమ చేస్తేనే ఆహారం వస్తుంది అన్నట్లుగా పరోక్షంగా తెలుపుతున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ప్రత్యేకంగా తమ పిల్లలను ఇలా వ్యవసాయ పనులకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం డబ్బులు కూడా చెల్లిస్తున్నట్లు సమాచారం. కొందరు పేరెంట్స్ తమ పిల్లలను పది రోజులపాటు వ్యవసాయ పనులు చేయిస్తే 57 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.
ఏది ఏమైనా తమ పిల్లలకు చదువుతోపాటు ఇలాంటి విషయాలు కూడా రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం సమంజసమే అని కొందరు అంటున్నారు. అయితే మనదేశంలో కూడా చిన్న పిల్లలకు ఇలాంటి పనులు నేర్పించాలని కొందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.