Home Blog Page 8459

ఆ ఎమ్మెల్యేల విషయంలో జగన్ నిర్ణయం ఇదే..!


రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు కొద్దీ రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలలో అసంతృప్తి స్థాయి బాగా పెరిగిందనే చెప్పాలి. ఈ వ్యవహారంలో కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేయించుకోలేక పోవడంతో అసంతృప్తి తో ఉన్నారు. మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుది ఇదే పరిస్థితి. బొల్లా బ్రహ్మనాయుడు మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదని ఇప్పుడే నియోజకవర్గ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురవుతున్న సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ సంబంధాలు ఉన్నాయని బహిరంగంగా ప్రకటించారు. వీరు ఇసుక విధానం, టిటిడి భూముల అమ్మకం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసారు.

సహజంగా జాతీయ పార్టీల్లో నాయకులకు స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా మీడియా ముందు వ్యక్తం చేస్తారు. వైసీపీ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులకు ఏ విషయాన్ని అయినా పార్టీ ముఖ్య నాయకులతో చర్చించాలే తప్ప బహిరంగంగా ప్రస్తావిస్తే చర్యలు తప్పవు. అందులో జగన్ వంటి నాయకుడి వద్ద అటువంటి సాహసన్ని చేయడం మాములు విషయం కాదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో పార్టీలో అసంతృప్తి రాగాలు కొంత భంగ పాటును కలిగించాయి. తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీలో మరికొందరు నాయకులు చెబుతున్నారు.

వీరి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న నాయకులు చర్చలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుండటం తో అంతకు ముందు ఏ సమావేశాన్ని నిర్వహించాలా లేక అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిర్వహించాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

ఆ చర్యలతో మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం: పవన్


కరోనా విపత్తు అన్ని రంగాలపైనా చూపించిన ప్రభావంతో మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులకు ఆర్థికపరమైన ఇబ్బందులు నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొంటున్న ఆర్థిక ఉపశమన చర్యలు మధ్యతరగతికి భరోసా ఇచ్చేలా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తొలి నుంచి మధ్య తరగతికి ఆర్థిక ఊతం ఇచ్చే దిశగానే నిర్ణయాలు తీసుకొంటోందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో కూడా వారి కోసం యోచించిందని, సొంత ఇంటి కోసం రుణాలు తీసుకొనేవారికి వడ్డీ రాయితీని రూ.1.5 లక్షల మేర అధనంగా ఇవ్వడం వల్ల గృహ రుణాలు తీసుకున్న వేతనాల మీద ఆధారపడ్డ ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకొనేవారికి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. స్పెషల్ లిక్విడిటి ఫెసిలిటీలో రూ.50 వేల కోట్లు కేటాయించడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో చిన్నపాటి మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన చిరుద్యోగులు, చిరువ్యాపారులు నష్టపోకుండా ఉంటారని చెప్పారు.

అదే విధంగా క్యాష్ రిజర్వ్ రేషియో విషయంలో తీసుకున్న నిర్ణయం, నాబార్డ్, ఎస్.ఐ.డి.బి.ఐ, ఎన్.హెచ్.బి.లకు స్పెషల్ రీ ఫైనాన్స్ సదుపాయం ఇవ్వడం వల్ల బ్యాంకులు మధ్య తరగతి వారి అవసరాలకు త్వరితగతిన రుణాలు మరింతగా ఇచ్చేందుకు వీలవుతుందని అన్నారు. ఆదాయపన్ను కట్టేవారికి రిఫండ్ చెల్లించడంలో జాప్యాన్ని నివారించే చర్యలు తీసుకోవడం వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగుతుందని తెలిపారు. రెపో రేట్ ను 6 నుంచి 4 శాతానికి తగ్గిస్తూ మే నెలలో తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ రంగంలో కీలకమేనని చెప్పారు. దీనివల్ల బ్యాంక్ రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు.

మోదీ గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మధ్యతరగతి సొంత ఇంటి కలలు నిజం చేసుకొనే వీలుకలుగుతోందని, 2013 నాటికి ఇంటి రుణంపై వడ్డీ 10శాతం వరకూ ఉంటే.. ఇప్పుడు ఆ వడ్డీ రేటు 8 నుంచి 8.5 శాతం మధ్య ఉందన్నారు. మధ్య తరగతికి సంబంధించిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి కోసం రూ.20 వేల కోట్లు నిధులు కేటాయించారని, బోగస్ చిట్ ఫండ్ కంపెనీలను కట్టడి చేయడం వల్ల మధ్య తరగతి ప్రయోజనాలను కాపాడగలుగుతున్నారని తెలిపారు. జనసేన శ్రేణులు కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక ఉపశమన చర్యల ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియచేయాలని కోరారు.

నీటి సమస్యను వారే పరిష్కరిస్తారా?


ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య గత కొద్ది రోజులుగా జల వివాదం తలెత్తిన విషయం తెల్సిందే. ఈ వివాదం పరిష్కారానికి తెలంగాణా ప్రభుత్వం కృష్ణా యాజమాన్య బోర్డును ఆశ్రయిస్తే, ప్రతిగా ఏపీ ప్రభుత్వం గోదావరి యాజమాన్య బోర్డుకు తెలంగాణాపై ఫిర్యాదు చేసింది. దీంతో రెండు బోర్డులు ఏపీ, తెలంగాణా అధికారులను పిలిచి వివరాలు తీసుకుని వాదనలు నమోదు చేసుకున్నాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో సాంకేతిక అనుమతులు పొందకుండా ముందుకు వెళ్లవద్దని సూచించాయి. దీంతో ఈ వివాదం సమసిపోతుందా అంటే కాదనే చెప్పాలి. బోర్డు ఆదేశాలను క్షేత్ర స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పాటించదు. అలా పాటిస్తే దేశంలో జల వివాదాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ఏపీ, తెలంగాణాల మధ్య నీటి వివాదాన్ని కరోనా నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ వివాదం సృష్టించారని ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తేల్చి చెప్పింది. ఈ అంశంపై తమ వైఖరి వెల్లడించకుండా దూరంగానే ఉంది. బీజేపీ, ఇతర పార్టీలు మాత్రం వారి వైఖరిని రెండు రాష్ట్రాల్లో స్పష్టం చేశాయి. మరోవైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఈ సమస్యలను చర్చలతో పరిష్కరించు కోవాలని భావిస్తున్నారని సమాచారం.

తాజాగా అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనున్న నేపథ్యంలో త్వరలోనే సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వివాదాలు లేకుండానే ముందుకు పోతున్నాయి. వ్యక్తిగతంగా జగన్, కేసీఆర్ మధ్య మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే. గతంలో ఇరువురు సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. అలాగే నదీ జలాల విషయంలోనూ కలిసి సాగుదామని నిర్ణయించుకున్నారు. నదీ జలాలు రెండు రాష్ట్రాల రైతులకు దక్కేలా కృషి చేద్దామని అనుకున్నారు. ప్రస్తుతం ఇదే విధానాన్ని అవలంభించాలని భావిస్తున్నారు.

బాలయ్య, ఎన్టీఆర్ కలువబోతున్నారట..


నందమూరి నటసింహం బాలక్రిష్ణ, ఆయన అన్న కొడుకు జూ.ఎన్టీఆర్ లు ఎడమొహం.. పెడమొహంగా ఉంటారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. కలుసుకున్నా వీరిద్దరూ పెద్దగా ఆప్యాయత అనురాగాలు పంచుకున్న సీన్లు స్టేజీపై కనిపించవు. కానీ ఇప్పుడు అబ్బాయి-బాబాయ్ లు కలిసే సీన్ ఒకటి ఆవిష్కృతం కాబోతోందట..

సినిమాల్లో.. రాజకీయాల్లో దూసుకుపోతున్నారు ఎన్టీఆర్ వారసులు.. అయితే కొన్నేళ్లుగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా బాబాయ్ బాలక్రిష్ణ, అబ్బాయి జూ.ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. బాలయ్య, ఎన్టీఆర్ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.

నందమూరి ఇంట ఓ పండుగ ఇప్పుడు బాబాయ్ అబ్బాయిని కలపబోతోందట.. ఈ పండుగకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాబోతున్నాడట.. అదే బాలయ్య షష్టిపూర్తి వేడుక.. నందమూరి ఫ్యామిలీలో దీన్ని ఘనంగా నిర్వహించబోతున్నారట.. మొత్తం నందమూరి హీరోలు , అన్నాదమ్ములంతా హాజరు కాబోతున్నట్టు తెలిసింది.

జూన్ 10న 60వ పడిలోకి బాలక్రిష్ణ అడుగుపెట్టబోతున్నారు. దీనిని పురస్కరించుకొని భారీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారట.. దీనికి జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు , పురంధేశ్వరి సహా నందమూరి కుటుంబమంతా హాజరు కాబోతోందట..

సో ఈ వేడుకతో ఇక వివాదాలు, విభేదాలు నందమూరి ఇంట సమసిపోనున్నాయన్న మాట..

అరె.. ఒక్క ప్లాప్ కే తత్త్వం బోధపడిందే !


మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత బాలయ్యతో సినిమా సెట్ చేసుకోవడానికి చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ వాస్తవానికి మరి దూరంగా ఉండటమేనని.. అందుకే బోయపాటి, నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమాలో యాక్షన్ ను కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ గా తీయాలని బోయపాటి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బోయపాటి బాలయ్య సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలని దర్శక నిర్మతలు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

ఇంతకుముందు బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ ఈ సారి హిట్ కొడుతుందేమో చూడాలి. ఈ సినిమా తదుపరి షెడ్యుల్ రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుండి మొదలవ్వనుంది.

రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతల ఎదురుదాడి


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ శివారులోని జన్వాడలో అక్రమంగా ఫాంహౌజ్ నిర్మించారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గతకొన్నిరోజులుగా పోరాడుతున్న సంగతి తెల్సిందే. ఇదే ఇష్యూలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాతో తమపై నిఘా పెట్టాడని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేటీఆర్ తన ఫౌంహౌజ్ నిర్మాణం కోసం చెరువు పూడ్చివేసి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి హరిత ట్రిబ్యూనల్ ను ఆశ్రయించగా కోర్టు కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

ఈవిషయంపై కేటీఆర్ ట్వీటర్లో స్పందిస్తూ తనపై కావాలనే ప్రతిపక్ష నేతలు బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు మద్దతుగా ఎంఐఎం నేత అసరుద్దీన్ ఓవైసీ నిలిచారు. అయితే దీనిపై రెండు రోజులు టీఆర్ఎస్ నేతలు మౌనం వహించడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గ్రహించారు. దీంతో ఆదివారం టీఆర్ఎస్ శాసన సభ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్‌, బాల్క సుమన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు.

రేవంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారన్నారు. అయినప్పటికీ పదేపదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దుష్పచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటంపై కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని.. కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదన్నారు. రేవంత్‌ రెడ్డికి ఎన్నోసార్లు జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డికి ఎదుటివారిపై బురదజల్లడం అలవాటుగా మారిందన్నారు. 111 జీవో పరిధిలో ఎవరెవరికీ భూములున్నాయో తాము బయట పెడతామన్నారు. రేవంత్‌రెడ్డి చెబుతున్న భూములు కేటీఆర్‌వి కాదన్నారు. వట్టినాగులపల్లిలో రేవంత్‌ రెడ్డి బంధువుల పేరుపై అక్రమంగా భూములు ఉన్నాయంటూ ఆరోపించారు. ఓ పెయింటర్ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి కోట్లాది ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశమనని.. రేవంత్ ఐరన్ లెగ్ అంటూ టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకొచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అంతేతప్ప కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

‘ఓ బేబీ’ కాంబినేషన్ రిపీట్.. గెస్ట్‌ రోల్‌లో..


సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ముప్పై దాటితే అవకాశాలు తగ్గిపోతాయి. పెళ్లయితే సినీ కెరీర్ కుపుల్‌స్టాప్‌ పడినట్టే. అలా తెరమరుగైన నటీమణులు ఎంతో మంది ఉంటారు. కానీ, సమంత మాత్రం అందుకు అతీతం అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న సమంత.. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అక్కినేని కోడలుగా మారిన తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. వరుస హిట్లు వచ్చిపడుతున్నాయి. అదే సమయంలో ఎన్నో ఆఫర్లు వస్తున్నా కథల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్న సమంత అందుకు తగ్గ ప్రతిఫలం అందుకుటోంది. ప్రయోగాలకూ వెనుకాడడం లేదు. రంగస్థలం, మజిలీ, యూ టర్న్ ఇలా వేటికవే డిఫరెంట్ మూవీస్ చేసిన సామ్‌… గతేడాది ‘ఓ బేబీ’తో అహో అనిపించింది. బామ్మ నుంచి 24 ఏళ్ల యువతిగా మారిన క్యారెక్టర్లో జీవించిందామె.

తన స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత నటన మరో స్థాయిలో ఉంది అనొచ్చు. ఇండియాతో పాటు యూఎస్‌ మార్కెట్‌లో మంచి వసూళ్లు రాబట్టిందీ ఈ చిత్రం. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్న సామ్‌.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్‌లోనూ నటిస్తోంది. వీటి తర్వాత ఆమె మరోసారి నందిని రెడ్డితో జోడీ కట్టనుంది. ఫిక్షనల్, ఎమోషనల్‌ ఎంటర్టైనర్గా ‘ఓ బేబీ’ని అద్భుతంగా తెరకెక్కించిన నందిని.. ఇప్పుడు సమంత కోసం మరో ప్రయోగాత్మక చిత్రానికి కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం కూడా ఉంది. ఓ బేబీలో గెస్ట్‌ రోల్‌ చేసిన సమంత భర్త నాగచైతన్య.. కొత్త ప్రాజెక్టులోనూ కామియో అపియరెన్స్ ఇవ్వనున్నాడట. మొత్తానికి ‘ఓ బేబీ’ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందన్నమాట.

మద్యంప్రియులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?


మద్యంప్రియులకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సమయంలో మద్యంపై ప్రత్యేకంగా విధించిన కరోనా టాక్స్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవడంతో కేంద్రం మే నెలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలు మద్యం షాపులను తెరిచేందుకే మొగ్గు చూపారు. అయితే మద్యం కోసం జనం బారులు తీరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కరోనా టాక్స్ పేరిట మద్యంపై 70శాతం ధరలను పెంచేసింది. మే 5 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి.

మద్యం ఎమ్మార్పీపై ఏకంగా 70శాతం టాక్స్ విధించడంతో మద్యంప్రియుల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కేంద్రం దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో కేజ్రీవాల్ మద్యంపై విధించిన కరోనా టాక్స్ ను ఎత్తిసేందుకు సిద్ధమయ్యారు. జూన్ 10నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం లభిస్తున్న మద్యం ధరలతో పొలిస్తే మరో రెండు మూడురోజుల్లో చౌకగా మద్యం లభించనుంది. దీంతో మద్యంప్రియులు జూన్ 10 తర్వాత మద్యం కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడాన్ని ఆదర్శంగా తీసుకొని పలు రాష్ట్రాలు మద్యం ధరలను పెంచేశాయి. తెలంగాణలో కేవలం 11నుంచి 15శాతం మాత్రమే మద్యం ధరలను ప్రభుత్వం పెంచేంది. ఈ పెంచిన ధరలు మళ్లీ తగ్గించేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తొలుత 25శాతం ఆ తర్వాత 50శాతం మద్యం ధరలను పెంచేంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యనిషేధ పాలసీలో భాగంగా మద్యం ధరలను రెట్టింపు చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నాయి. ఏపీలో మద్యం ధరలు పెంచడంతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే మద్యంబాబుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మద్యం ధరలను తగ్గింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యంపై కరోనా ట్యాక్స్ ఎత్తివేయడంతో ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డి పెంచిన ధరలను తగ్గించే అవకాశం లేకపోలేదని చర్చ నడుస్తుంది. మద్యంపై ధరలను ఏమేరకు తగ్గిస్తారనేది మద్యంప్రియులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యంప్రియులకు శుభవార్త తెలియజేస్తారా? లేదా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మద్యంబాబులు వేచిచూడాల్సిందే..!

నాకు ఆ సమస్య ఉందని చెప్పేందుకు బాధపడను..


కమల్ హాసన్‌ వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. యాక్టింగ్‌తోనే కాకుండా సింగర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మల్టిపుల్ టాలెండ్‌తో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. పదేళ్ల కిందట ‘లక్‌’ అనే సినిమాతో బాలీవుడ్‌ ద్వారా సినిమాలకు పరిచయం అయినప్పటికీ.. ఆశించిన విజయాలు లేక సౌత్ ఇండస్ట్రీకి మకాం మార్చింది. మొదట్లో వరుస ఫ్లాప్ లు రావడంతో ఐరెన్‌ లెగ్‌గా ముద్రపడినప్పటికీ.. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ కావడంతో ఆమె దశ తిరిగింది. తెలుగుతో పాటు తమిళ్‌లో వరుస సినిమాలతో బిజీగా మారింది శ్రుతి హాసన్.

నటిగా బిజీగా ఉన్నప్పుడే మ్యూజిక్ ఆల్బమ్స్ అంటూ ఆమె విదేశాల్లో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. సినిమాలు కూడా పక్కన పెట్టేసి అతనితో చెట్టాలేసుకొని తిరిగింది. అతన్ని ఇండియా తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడంతో వీళ్లిద్దరి పెళ్లి ఖాయమైందనే వార్తలు వచ్చాయి. కానీ ఉహించని రీతిలో అతనికి బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు బుద్దిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అయితే, ప్రేమ, బ్రేకప్ కారణంగా శ్రుతి వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనట్టున్నాయి. ఈ విషయాన్ని ఆమెనే పరోక్షంగా చెప్పింది.

తాను మూడేళ్లుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నానని తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌ అయిపోయిందని, ఇది ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని అభిప్రాయపడింది. ఇందులో మానసిక సమస్య కూడా ఒకటని చెప్పింది. అన్నింటికంటే ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నానంది. ప్రజలు అన్ని విషయాల్లో అప్రమత్తంగానే ఉంటారు కానీ.. ఇలాంటి సమస్యల గురించి బయటకు చెప్పేందుకు ఇష్టపడరని చెప్పింది. అయితే, ఈ విషయం గురించి బయటకు చెప్పేందుకు తానేమి బాధపడడం లేదని స్పష్టం చేసింది. మూడేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని, అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపింది.దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం వంటివే చికిత్స అన్నది తాను క్రమం తప్పకుండా వీటిని పాటిస్తున్నట్టు చెప్పింది. . అదే విధంగా మ్యూజిక్ వింటూ, బుక్స్ చదువుతూ మానసిక ప్రశాంతత పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది.

నయనతార పెళ్లి ఈ నెలలోనే?


లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. 2015లో వచ్చిన ‘నానుమ్ రౌడీదాన్‌’ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమాలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ మూవీకి విఘ్నేశ్ దర్శకత్వం వహించగా.. నయన్‌ హీరోయిన్‌గా నటించింది. అంతకుముందు శింబుతో కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిపించిన లేడీ సూపర్ స్టార్ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పీకల్లోతు ప్రేమలో విహరించిన వీరిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ప్రభును పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్న నయన్‌.. బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం’ మూవీ పూర్తయ్యాక యూనిట్‌కు వీడ్కోలు కూడా ఇచ్చింది. కానీ, ఏమైందో ఏమో కానీ.. వీరిద్దరి పెళ్లి జరుగలేదు. ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత చాన్నాళ్లు ఒంటరిగా ఉండిపోయిన ఈ ముద్దుగుమ్మ.. విఘ్నేశ్‌కు మనసిచ్చింది. ఐదేళ్ల నుంచి వీరిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

దేశ, విదేశాల్లో అనేక విహార యాత్రలకు వెళ్లారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తమ ప్రేమను బహిర్గతంగానే ఉంచారు. అలాగే వీలుచిక్కిన ప్రతీసారి ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటాన్నారో వ్యక్తపరుస్తున్నారు. మొన్నటి మథర్స్ డే రోజు.. నయన్‌ ఓ చిన్నారితో ఉన్న ఫొటోనూ షేర్ చేసిన విఘ్నేశ్.. భవిష్యత్తులో నాకు పుట్టబోయే పిల్లల తల్లికి శుభాకాంక్షలు అని చెప్పాడు. దాంతో, వీరిద్దరూ పెళ్లికి సిద్ధపడ్డారని అర్థమైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు నయన్, విఘ్నేశ్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. ఈనెలలోనే ఈ ఇద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని తెలుస్తోంది. తమిళనాడులోని ఓ ప్రఖ్యాత దేవాలయంలో పెళ్లి వేడుక ఉంటుందని, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరవుతారట. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే నయన్, విఘ్నేశ్ ఒకరు స్పందించాల్సి ఉంది.

12 గంటల్లో 1.68 లక్షల మంది.. ఇదీ ఆర్జీవీ క్రేజ్


సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మ్యాజిక్‌ మామూలుగా ఉండదు. రిజల్ట్ ఎలా ఉన్నా.. తన సినిమా, వెబ్‌ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్, ఓపెనింగ్స్ రాబట్టడంలో ఆర్జీవీ స్టయిలే లేరు. పైసా ఖర్చు చేయకుండా మూవీని ప్రమోట్ చేయడంలో పీహెచ్‌డీ చేసేశాడు. అలా, తాజా మూవీ ‘క్లైమాక్స్‌’కు సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని భారీ హైప్ క్రియేట్‌ చేశాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో చేసిన మూవీతో లాక్‌డౌన్‌లో ఆర్జీవీ చిన్నపాటి అలజడే సృష్టించాడు. ఎడారిలో మియా అందాలను తనదైన స్టయిల్లో చిత్రీకరించిన ఆర్జీవీ.. సాంగ్, టీజర్, ట్రైలర్ల ద్వారా కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచాడు.

ముందుగా చెప్పినట్టుగానే జూన్ 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై విడుదల చేశాడు. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ బుకింగ్స్ చేసుకున్నారు. ఆర్జీవీ టేకింగ్‌ను, మియా అందాలు చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. 12 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 68 వేల 596 మంది ‘క్లైమాక్స్‌’ను వీక్షించినట్టు ఆర్జీవీ ట్వీట్ చేశాడు. స్టార్టింగ్‌లో మాగ్జిమమ్ 50 వేల మంది ఈ మూవీ చూస్తారని అంచనా వేశామని చెప్పాడు. కానీ, ఏకంగా 2.75 లక్షల మంది రావడంతో సర్వర్ క్లాష్ అయిందని తెలిపాడు. అందుకు సంబంధించిన సర్వర్ గ్రాఫ్ లను ఆర్జీవీ ట్విట్టర్లో షేర్ చేశారు.

ఒక్కటైన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్.. జగన్ కు చావోరేవో


ఏపీ సీఎం జగన్ ప్రతిష్టకు ఇప్పుడు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం సవాల్ గా మారింది. జగన్ కు చావో రేవోలాగా మారింది. ఇజ్జత్ కా సవాల్ గా మారిన ఈ ఇష్యూలో సుప్రీం కోర్టు ఏం తీర్పునిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను తొలగించారు. ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో రసకందాయంలో ఈ వివాదం పడింది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు చివరి అంకానికి చేరింది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈనెల 10న ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టబోతోంది. దీంతో ఈ నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ గెలుస్తాడా? నిమ్మగడ్డ విజయం సాధిస్తాడా? మళ్లీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ వస్తే మాత్రం జగన్ కు ఇంతకంటే ఘోరమైన అవమానం ఉండదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈనెల 10న ఈ లీవ్ పిటీషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించబోతోంది. ఏపీ ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తారు.

ఇక ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే నిమ్మగడ్డకు మద్దతుగా బీజేపీ నేత కామినేని శ్రీనివాస్, కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, టీడీపీ నేత వర్ల రామయ్య సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని సుప్రీంకోర్టు ఈనెల 10న విచారించనుంది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై నిమ్మగడ్డకు సపోర్టుగా సుప్రీం కోర్టులో నిలబడడం హాట్ టాపిక్ గా మారింది.ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భవితవ్యం విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుందనేది ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలపై పావులు కదుపుతున్న కేటీఆర్


కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టింది. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు జరిగిన కారు స్పీడు ముందు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చిన పాపానా పోలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ, సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ వన్ సైడ్ విక్టరీని సాధించింది. తెలంగాణలో కారు జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకటి, అర సీట్లతో నామమాత్ర పోటీనిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ మరో ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. 2021 జనవరిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.

టార్గెట్ ఫిక్స్ చేసుకున్న టీఆర్ఎస్..
తెలంగాణకు ఆయువుపట్టు హైదరాబాద్ మహానగరం. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీచేసి మేయర్ సీటును కైవసం చేసుకుంది. 150 కార్పొరేట్ స్థానాలకు గాను టీఆర్ఎస్ 99 సీట్లు కైవసం చేసుకోవడం గమనార్హం. 2016 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ పరిధిలో అంత బలంగా లేదు. ఆంధ్రావాళ్లు ఎక్కవగా నివసించే ప్రాంతాల్లో సైతం టీఆర్ఎస్ సత్తా చాటి ఏకంగా 99చోట్ల గులాబీ జెండాను రెపరెపలాడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ సత్తాచాటడానికి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కృషి కారణం. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్రజలకు కష్టాలను తెలుసుకొని అందుకనుగుణంగా మ్యానిఫెస్టోను రూపొందించి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే.

కేటీఆర్ మరోసారి సత్తా చాటుతారా?
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ అంతా తానై పార్టీని ముందుండి నడిపించారు. నాడు ఆయన ఐటీ మంత్రిగా ఉండగా నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కేటీఆర్ మరోసారి తన సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. ఈమేరకు గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ చెప్పిన మ్యానిఫెస్టో పనులను త్వరితంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నింటిని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.

దీని తర్వాత నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజల మన్నలను పొందేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. వీటితోపాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ బీజీబీజీగా గడపాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించి కేటీఆర్ మరోసారి సత్తా చాటుతారా? లేదా అనేది చూడాల్సి ఉంది. అదేవిధంగా కిందటిసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరువు పొగట్టుకున్న కాంగ్రెస్, బీజీపీ పార్టీలు టీఆర్ఎస్ కు గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే అందరికంటే ముందుగానే టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ముందుకు దూసుకెళుతుంటడం ఆసక్తిని రేపుతోంది.

పాపం పవన్ హీరోయిన్‌.. విలన్‌ భార్యగా నటించే స్థాయికి


అమెరికాలో పుట్టి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి అనూ ఇమాన్యుయేల్. మళయాలంలో తెరంగేట్రం చేసినా 2017లో నాని సరసన ‘మజ్ను’లో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆపై, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా కాలు పెట్టిన అనూ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల పక్కన అవకాశాలు అందుకుంది. గోపీచంద్ సరసన ఆక్సిజన్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. మెగా కాంపౌండ్‌లో కూడా అడుగుపెట్టింది. ఏకంగా పవన్ కళ్యాణ్ తో నటించింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ లో ఓ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ‘నా పేరు సూర్య’లో అల్లు అర్జున్‌తో ఆడిపాడింది. అలాగే, అక్కినేని నాగచైతన్య సరసన ‘శైలాజ రెడ్డి అల్లుడు’లోనూ సోలో హీరోయిన్‌గా చేసిందామె. కానీ, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

వరుస ఫ్లాప్స్ రావడంతో అనుపై ఐరెన్ లెగ్ ముద్ర పడింది. అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. అటు మళయాలం, తమిళ్‌లో కూడా అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు గెస్ట్‌ రోల్స్, చిన్న పాత్రలు చేసే స్థాయికి దిగజారింది. ‘గీత గోవిందం’లో అను చిన్న గెస్ట్‌ రోల్ చేయగా ఆ మూవీ సూపర్ హిట్టయింది. దాంతో, ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. చిన్న పాత్రల కోసం ఆమెను సంప్రదిస్తున్నారట. ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీను హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో విలన్ భార్య పాత్రను అను ఇమాన్యుయేల్ పోషిస్తోందని సమాచారం. ఈ సినిమాలో సోనూ సూద్ ప్రతి నాయకుడు. సో.. సోనూ భార్యగా అను నటిస్తుందన్నమాట. నాని, నాగచైతన్య, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సరసన నటించిన అనూకు..ఇప్పుడు విలన్‌ క్యారెక్టర్ తో  రొమాన్స్‌ చేసే పరిస్థితి రావడం ఆమె దురదృష్టమే అనాలి.

పదో తరగతి పరీక్షల రద్దుకే మొగ్గుచూపుతున్న కేసీఆర్?


పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెల్సిందే. దీంతో పదో తరగతి పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తాజాగా వాయిదా వేసిన పరీక్షలను మళ్లీ నిర్వహించడం కంటే రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో చర్చించనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారని నేటి సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పదో తరగతి పరీక్షల రద్దుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రీ ఫైనల్ మార్కులతో విద్యార్థులకు గ్రేడింగ్..
ప్రతీయేటా విద్యాశాఖ పదోతరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పేరుతో నాలుగు పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఈ పరీక్షలను నిర్వహించింది. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా పాఠశాలల నుంచి అసైన్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కులను తెప్పించుకొని ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఇది కొంచెం కష్టమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం దీనికే మొగ్గుచూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పరీక్షల్లో గైర్హాజరు అయిన విద్యార్థుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

ఒకేసారి నిర్వహించకుంటే మరిన్ని ఇబ్బందులు..
కరోనా విజృంభిస్తున్న జీహెచ్ఎంసీ, రంగారెడ్డి పరిధిలో మినహా రాష్ట్రమంతటా పదో తరగతి పరీక్షలు నిర్వహించుకునేలా హైకోర్టు శనివారం తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. వీరికి సంప్లమెంటరీ నిర్వహించి రెగ్యూలర్ గా పరిగణించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అందరికీ ఒకేసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

పదీ పరీక్షలు ఒకేసారి పూర్తి చేస్తేనే ఇంటర్మీడియట్, ఆర్‌జీయూకేటీ, పాలిటెక్నిక్‌ తదితర ప్రవేశాలకు వీలవుతుంది. అలా కాకుండా కొందరికీ ఆలస్యంగా పరీక్షలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరికీ పరీక్షలు నిర్వహించినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుందని అంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందే అవకాశం ఉంది. వీటన్నింటిపై ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేటి సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పదో తరగతి పరీక్షల రద్దుపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..!


శాసనసభ సభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. మార్చిలోనే సమావేశాలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సమావేశాలు నిర్వహించకుండా ఆర్డినెన్స్ రూపంలో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం పొందింది. ఈ గడువు ఈ నెలతో ముగుస్తుంది. ఈలోగా బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో 14 రోజులపాటు నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు 19వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఇదే సమయంలో శాసనసభ సమావేశాలు నిర్వహించడం మేలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న బడ్జెట్‌ ను శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టనున్నారు. ఒక రోజు విరామం అనంతరం బడ్జెట్ పై చర్చ జరుగనుంది. ఈ నెల 11న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని శాసనసభ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు బిశ్వభూషణ్‌ హరిచందన్ గవర్నర్ హోదాలో తొలిసారి ఈ నెల 16న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టనుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా ఏపీ పర్యావరణ పరిరక్షణ బిల్లును సిద్ధం చేయాలని రెండ్రోజుల కిందటే సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మరోవైపు అసెంబ్లీ, సచివాలయాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సమావేశానికి హాజరు అయ్యేందుకు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. శాసనసభ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలోకి అందరినీ అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని వారి వాదన.

కరోనా పేషంట్లతో నిండుకున్న గాంధీ..


తెలంగాణలో కరోనా మహమ్మరి రోజురోజుకు పంజా విసురుతోంది. కొద్దిరోజలు క్రితం వరకు కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ పరిమితమయ్యేవి. దీంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందని అందరూ భావించారు. అయితే ఇందుకు విరుద్ధంగా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ నుంచి క్రమంగా పేరుతో వందల్లో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గతవారంరోజులుగా కరోనా కేసులు మూడంకెల డిజిట్ కు తక్కువగా నమోదు కావడం లేదు. దీంతో గాంధీ ఆస్ప్రతి వైద్య సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. దీంతో వైద్యులు, సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.

శనవారం ఒక్కరోజే కరోనా కేసులు 200లకు పైబడి రావడంతో గాంధీ ఆస్పత్రి నిండుకుంది. మే 26వరకు గాంధీలో 650మంది కరోనా పేషంట్లు ఉన్నారు. కేవలం పది రోజుల్లోనే ఈ సంఖ్య 805 పెరిగింది. ప్రస్తుతం 1,455రోగులు ఉండగా ఆస్పత్రి పడకల సామర్థ్యం దాదాపు నిండిపోయినట్లు సమాచారం. ఆస్పత్రిలో సుమారుగా 1,160 పడకలుండగా కరోనా తీవ్రత దృష్ట్యా 350మందిని వైద్య కళాశాలలో అదనంగా సర్దినట్లు తెలుస్తోంది. మే నెల నుంచి కరోనా కేసుల పెరుగుతుండటంతో కొన్నినెలలుగా నిరంతరం సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి తలకు మించిన భారం మారుతుండటంతో ఒత్తిడికి లోనవుతున్నారు.

ఇదిలా ఉంటే నిమ్స్ లో 20మందికి వైద్య కరోనా సోకినట్లు యాజమాన్యం ప్రకటించింది. దీంతో నిమ్స్ లో ఓపీ, రోగుల అడ్మిట్ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో సేవలు నిలిచిపోయినట్లు రోగులు వాపోతున్నారు. నిమ్స్‌లో కార్డియాలజీ విభాగంలో ఓ రోగికి కరోనా సోకిందని సమాచారం. అతడి నుంచి ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తించడంతో ఆస్పత్రిలో నియంత్రణ చర్యలు ప్రారంభించారు. ఆస్పత్రిలో వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు శానిటైజేషన్ వంటి ప్రకియ చేపట్టారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి ఎక్కడి తరలించాలో తెలియక ఆస్పత్రి యాజమాన్యం తలలు పట్టుకుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!