
కరోనా విపత్తు అన్ని రంగాలపైనా చూపించిన ప్రభావంతో మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులకు ఆర్థికపరమైన ఇబ్బందులు నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొంటున్న ఆర్థిక ఉపశమన చర్యలు మధ్యతరగతికి భరోసా ఇచ్చేలా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తొలి నుంచి మధ్య తరగతికి ఆర్థిక ఊతం ఇచ్చే దిశగానే నిర్ణయాలు తీసుకొంటోందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో కూడా వారి కోసం యోచించిందని, సొంత ఇంటి కోసం రుణాలు తీసుకొనేవారికి వడ్డీ రాయితీని రూ.1.5 లక్షల మేర అధనంగా ఇవ్వడం వల్ల గృహ రుణాలు తీసుకున్న వేతనాల మీద ఆధారపడ్డ ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకొనేవారికి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. స్పెషల్ లిక్విడిటి ఫెసిలిటీలో రూ.50 వేల కోట్లు కేటాయించడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో చిన్నపాటి మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన చిరుద్యోగులు, చిరువ్యాపారులు నష్టపోకుండా ఉంటారని చెప్పారు.
అదే విధంగా క్యాష్ రిజర్వ్ రేషియో విషయంలో తీసుకున్న నిర్ణయం, నాబార్డ్, ఎస్.ఐ.డి.బి.ఐ, ఎన్.హెచ్.బి.లకు స్పెషల్ రీ ఫైనాన్స్ సదుపాయం ఇవ్వడం వల్ల బ్యాంకులు మధ్య తరగతి వారి అవసరాలకు త్వరితగతిన రుణాలు మరింతగా ఇచ్చేందుకు వీలవుతుందని అన్నారు. ఆదాయపన్ను కట్టేవారికి రిఫండ్ చెల్లించడంలో జాప్యాన్ని నివారించే చర్యలు తీసుకోవడం వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగుతుందని తెలిపారు. రెపో రేట్ ను 6 నుంచి 4 శాతానికి తగ్గిస్తూ మే నెలలో తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ రంగంలో కీలకమేనని చెప్పారు. దీనివల్ల బ్యాంక్ రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు.
మోదీ గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మధ్యతరగతి సొంత ఇంటి కలలు నిజం చేసుకొనే వీలుకలుగుతోందని, 2013 నాటికి ఇంటి రుణంపై వడ్డీ 10శాతం వరకూ ఉంటే.. ఇప్పుడు ఆ వడ్డీ రేటు 8 నుంచి 8.5 శాతం మధ్య ఉందన్నారు. మధ్య తరగతికి సంబంధించిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి కోసం రూ.20 వేల కోట్లు నిధులు కేటాయించారని, బోగస్ చిట్ ఫండ్ కంపెనీలను కట్టడి చేయడం వల్ల మధ్య తరగతి ప్రయోజనాలను కాపాడగలుగుతున్నారని తెలిపారు. జనసేన శ్రేణులు కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక ఉపశమన చర్యల ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియచేయాలని కోరారు.