
శాసనసభ సభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. మార్చిలోనే సమావేశాలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సమావేశాలు నిర్వహించకుండా ఆర్డినెన్స్ రూపంలో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం పొందింది. ఈ గడువు ఈ నెలతో ముగుస్తుంది. ఈలోగా బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో 14 రోజులపాటు నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు 19వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఇదే సమయంలో శాసనసభ సమావేశాలు నిర్వహించడం మేలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న బడ్జెట్ ను శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టనున్నారు. ఒక రోజు విరామం అనంతరం బడ్జెట్ పై చర్చ జరుగనుంది. ఈ నెల 11న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని శాసనసభ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ హోదాలో తొలిసారి ఈ నెల 16న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టనుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా ఏపీ పర్యావరణ పరిరక్షణ బిల్లును సిద్ధం చేయాలని రెండ్రోజుల కిందటే సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు అసెంబ్లీ, సచివాలయాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సమావేశానికి హాజరు అయ్యేందుకు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. శాసనసభ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలోకి అందరినీ అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని వారి వాదన.