
పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెల్సిందే. దీంతో పదో తరగతి పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తాజాగా వాయిదా వేసిన పరీక్షలను మళ్లీ నిర్వహించడం కంటే రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో చర్చించనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారని నేటి సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పదో తరగతి పరీక్షల రద్దుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రీ ఫైనల్ మార్కులతో విద్యార్థులకు గ్రేడింగ్..
ప్రతీయేటా విద్యాశాఖ పదోతరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పేరుతో నాలుగు పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఈ పరీక్షలను నిర్వహించింది. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా పాఠశాలల నుంచి అసైన్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కులను తెప్పించుకొని ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఇది కొంచెం కష్టమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం దీనికే మొగ్గుచూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పరీక్షల్లో గైర్హాజరు అయిన విద్యార్థుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
ఒకేసారి నిర్వహించకుంటే మరిన్ని ఇబ్బందులు..
కరోనా విజృంభిస్తున్న జీహెచ్ఎంసీ, రంగారెడ్డి పరిధిలో మినహా రాష్ట్రమంతటా పదో తరగతి పరీక్షలు నిర్వహించుకునేలా హైకోర్టు శనివారం తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. వీరికి సంప్లమెంటరీ నిర్వహించి రెగ్యూలర్ గా పరిగణించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అందరికీ ఒకేసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
పదీ పరీక్షలు ఒకేసారి పూర్తి చేస్తేనే ఇంటర్మీడియట్, ఆర్‌జీయూకేటీ, పాలిటెక్నిక్ తదితర ప్రవేశాలకు వీలవుతుంది. అలా కాకుండా కొందరికీ ఆలస్యంగా పరీక్షలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరికీ పరీక్షలు నిర్వహించినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుందని అంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందే అవకాశం ఉంది. వీటన్నింటిపై ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేటి సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పదో తరగతి పరీక్షల రద్దుపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.