Home Blog Page 8458

ఈ సారి ‘క్రష్’ చేస్తానంటున్న రవిబాబు


సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుపెట్టిన నటుడు రవిబాబు. మొదట్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆయన తర్వాత దర్శకుడిగా మారాడు. వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తొలి చిత్రం ‘అల్లరి’తోనే యూత్ పల్స్‌ పట్టేసిన రవిబాబు.. అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, నచ్చావులే, లడ్డూబాబు, మనసార, నువ్విలా వంటి చిత్రాలతో వినోదాన్ని పంచాడు. ఆపై, అనసూయ, అమరావతి, అవును వంటి హారర్ మూవీస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. వైవిధ్యం, కొత్తదనంతో పాటు ప్రయోగాలు చేయడంలో ముందుండే రవిబాబు.. పంది పిల్ల హీరోగా ‘అదుగో’ తీశాడు.

గతేడాది ఆవిరి అనే మరో హారర్ థ్రిల్లర్ తీసిన ఆయన.. మళ్లీ యూత్‌పై దృష్టి పెట్టినట్టున్నాడు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘క్రష్’ అనే టైటిల్‌తో తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌ లుక్ విడుదల చేశాడు . ఫ్లయింగ్‌ ప్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోంది ఈ సినిమా. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం యూత్ ఎంటర్‌టైనర్‌ అని అర్థమవుతోంది. సినిమా పోస్టర్ల విషయంలోనూ తనకంటూ ప్రత్యేకతనూ ఏర్పరచుకున్న రవిబాబు.. ‘క్రష్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా వెరైటీగా డిజైన్ చేశాడు. బాత్‌రూంలో కాళ్లు షేవ్ చేసుకుంటున్న ఓ యువతిని మాస్కులు ధరించిన ముగ్గురు అబ్బాయిలు తలుపు దగ్గర నుంచి గమనిస్తుండడం ఆసక్తి కలిగిస్తుంది. పోస్టర్ పై అన్‌లాక్‌ 1.0… కింద ఎగ్జిట్‌ విత్‌ కేర్ ( జాగ్రత్తగా బయట పడండి) అని రాసి ఉంది. దాంతో, కరోనా వైరస్, లాక్‌డౌన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రవిబాబు కథ రెడీ చేసినట్టు అనిపిస్తోంది.

https://www.instagram.com/p/CBKQiY0F5bn/

బాలయ్యతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: నాగబాబు


తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సినీ ప్రముఖుల సమావేశానికి, ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసినప్పుడు తనను ఆహ్వానించకపోవడంపై అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అని బాలయ్య తీవ్ర ఆరోపణలు చేయడంతో టాలీవుడ్‌లో అలజడి రేగింది. బాలయ్య విమర్శలను మెగా బ్రదర్ నాగబాబు ఖండించడంతో ఈ వివాదం నందమూరి, మెగా కుటుంబాల మధ్య కోల్డ్‌ వార్ కు దారి తీసింది. ఈ విషయంపై నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

బాలకృష్ణతో తనకెంలాంటి గొడవలు కానీ, విభేదాలు కానీ లేవని స్పష్టం చేశారు. బాలయ్యతో తనకు పెద్దగా పరిచయమే లేదని, కలిసింది కూడా తక్కువే అన్నారు. బాలకృష్ణ ఆవేశంలో అలా మాట్లాడారు తప్పితే, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని అనుకోవడం లేదన్నారు. ఈ ఆరోపణలు తాను ఖండించిన తర్వాత బాలయ్య కూడా సర్థుకున్నారని చెప్పారు. అందుకే దీన్ని పొడిగించలేదని చెప్పారు. సి. కళ్యాణ్, తమ్మారెడ్డి లాంటి వారు సర్థి చెప్పడంతో ఈ గొడవ ముగిసిందని అన్నారు. ఇకపై దీనిపై మాట్లాడి వివాదాన్ని పెద్దది చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఇండస్ట్రీలు గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివి అని అభిప్రాయపడ్డారు. జూన్‌ 15 నుంచి కొన్ని సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని పరిశ్రమ ప్లాన్ చేస్తున్నాయని చెప్పారు. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్‌ మొదలయ్యే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్ తో వివాహం.. మోడీకి ప్రేమలేఖలు


రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆ సీనియర్ నేత మాత్రం ఎప్పుడూ రాజకీయ అధికారానికి దగ్గరగా ఉంటాడు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా దానితోనే అంటకాగుతుంటాడు. అలా తన పార్టీని, పరపతిని ఎల్లకాలం అనుభవిస్తూనే ఉంటాడు. ఆయనే మరాఠా యోధుడు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్.

ప్రతీ ఒక్కరిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అందవేసిన చేయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన కూటమితో జట్టుకట్టి ప్రభుత్వంలో ఉంటూ.. కేంద్రంలో మోడీకి సన్నిహితంగా మెలగడం ఆయనకే చెల్లింది. చాలాసార్లు శరద్ పవర్ ఏ వైపు ఉన్నాడో కూడా తెలియదు.

ప్రస్తుతం శరద్ పవార్ సోనియాగాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ చాలా సార్లు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి సహాయపడే పనులు చేస్తుంటాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేనతో ఒక కూటమిని ఏర్పరుచుకున్నాడు. కానీ తరుచూ బీజేపీకి మేలు చేసేలా శివసేన పార్టీని వ్యతిరేకిస్తూ లేఖలు రాస్తుంటాడు.

ఇటీవల కరోనా టైంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన పీఎం కేర్స్ ఫండ్ ను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ పథకం పారదర్శకంగా లేదని.. నిధుల గోల్ మాల్ జరుగుతోందని దాడి చేశాయి.

కానీ కాంగ్రెస్, ఎన్సీపీతో సహా 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమై కరోనా నియంత్రణ చర్యలపై చర్చించినప్పుడు చివరకు ఆమోదించిన తీర్మానంలో పీఎం కేర్స్ ఫండ్ గురించి ప్రస్తావించలేదు. ఈ విషయంపై కనీసం నోరు కూడా మెదపలేదు. పీఎం కేర్ ఫండ్ గురించి సూచనలు లేవని శరద్ పవార్ నిర్ధారించారు. చర్చ అస్సలు సమస్యపై దృష్టి పెట్టకుండా చూసుకున్నారు.

ఇక ఇదే శరద్ పవార్ ఆ మధ్య నరేంద్రమోడీ ఇంటికి నవ్వుతూ వెళ్లి ప్రతిపక్షాల దాడికి శక్తిని ఇవ్వలేదు. తన సొంత పార్టీ వెలుపల నరేంద్రమోడీకి శరద్ పవార్ మంచి స్నేహితుడిగా ఉన్నారని చాలా మందికి తెలియదు.. మోడీ చాలాసార్లు పవర్ ను అభినందిస్తారు. పవార్ కూడా మోడీని మెచ్చుకుంటారు. చాలా సార్లు మోడీకి ఫేవర్ గా పవార్ వ్యవహరించారు.

దీంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా శరద్ పవార్ తను అనుకున్నది సాధించుకోవడం కోసం మోడీతో ప్రేమలో ఉంటూ రాజకీయాల్లో బతకనేర్చాడని విశ్లేషకులు చెబుతున్నారు..

-నరేశ్ ఎన్నం

కీలక ప్రకటన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల


తెలంగాణలో వైరస్ బారిన పడిన వారికి ఇకపై ఇళ్లలోనే చికిత్స చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లాక్డౌన్ సడలించడం వల్లనే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రజలు జీవనోపాధి కొల్పోవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని.. వైరస్ బారిన పడొద్దని సూచించారు. ప్రతీఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి తగుచర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరిలో వైరస్ లక్షణాలు కన్పించడం లేదని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు, వయస్సు పైబడిన వారు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. రోడ్లపైకి వచ్చేటప్పుడు ప్రతీఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని వైద్యాశాఖ అధికారులకు సూచించారు. హోమ్ క్వారంటైన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. రోగ లక్షణాలు తక్కువగా ఉండి పాజిటివ్ ఉన్నవారికి మూడురోజులపాటు ఇళ్లలోనే చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో ఇళ్ల పక్కనే ఉండే కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు సహకరించాలని కోరారు. కరోనా జబ్బు బారిన పడిన వారిని బహిష్కరించే వంటి చర్యలకు పాల్పడొద్దంటూ సూచించారు. ప్రజలు అనవసర భయాందోళనలకు లోను కావద్దని మంత్రి సూచించారు.

పాజిటివ్ కేసుల్లో జ్వరం వచ్చిన వారికి మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స చేస్తామని తెలిపారు. మిగతా వారికి ఇళ్లల్లోనే చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కరోనా గాలి ద్వారా సోకదని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో గాంధీ ఆస్పత్రి నిండుకోవడం, కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వైద్యులపై పనిభారం పడుతుందన్నారు. వైద్యులపై ఒత్తిడి తగ్గించేందుకే హోం క్వారంటైన్ చేయనున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సడలింపులు ప్రజల జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకే చేశారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అనవసరంగా రోడ్లపైకి వచ్చి వైరస్ బారిన పడొద్దని సూచించారు.

కీర్తి సురేశ్ పెంగ్విన్ టీజ‌ర్ విడుద‌ల‌


భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటీమణులైన సమంత అక్కినేని, తాప్సీ పన్ను, త్రిష మరియు మంజు వారియర్‌లు సంయుక్తంగా కీర్తి సురేష్ నటించగా అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పెంగ్విన్ చిత్ర టీజర్‌ను నేడు ఆవిష్కరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తొలిసారిగా జూన్ 19వ తేదీన ప్రదర్శించడానికి షెడ్యూల్ చేయబడిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను ఓ తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి చేసే శారీరక, భావోద్వేగ ప్రయాణ నేపథ్యంలో చిత్రీకరించారు. కార్తీక్ సుబ్బరాజ్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ మరియు ప్యాషన్ స్టూడియోస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల నడుమ సంచలనం సృష్టించింది. తన పిల్లల కోసం ఆరాటపడే ఓ తల్లిగా కీర్తి సురేష్ చేస్తున్న భావోద్వేగ ప్రయాణంలో భాగంకండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 19 జూన్ 2020 వ తేదీన తెలుగు, తమిళంతో పాటుగా మళయాళంలో డబ్బింగ్ ప్రసారం చేయబడుతుంది.

మెగాఫోన్ పట్టిన బాలకృష్ణ హీరోయిన్


వైవిధ్యమైన నటనతో హిందీతో పాటు అనేక ప్రాంతీయ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాధికా అప్టే. కథ, సన్నివేశం డిమాండ్ చేస్తే డీగ్లామర్ గానే కాకుండా బోల్డ్‌గా నటించేందుకూ వెనుకాడకుండా పాత్రకు ప్రాణం పోస్తుందామె. రక్త చరిత్ర మూవీతో తెలుగు తెరకుపరిచమైన ఆమె బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్‌ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైన రాధిక.. హిందీలో బిజీగా మారింది. వెబ్‌ సిరీస్‌లతో పాటు పలు ఇంగ్లీష్ మూవీల్లో కూడా నటిస్తోందామె.

హీరోయిన్‌గా ఇంత బిజీగా ఉన్న సమయంలో ఆమె సాహసోపేత నిర్ణయం తీసుకుంది. తన ప్రతిభను నటనతోనే ఆపేయకుండా మెగాఫోన్ పట్టింది. ఓ షార్ట్‌ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించింది. ‘ది స్లీప్ వాకర్స్’ అనే టైటిల్ తో రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ టీజర్ను రిలీజ్‌ చేసింది. నిమిషం నిడివిగల ఈ టీజర్ చాలా ఆసక్తిరకంగా ఉంది. గర్భవతి అయిన తన భార్యతో భర్త మధ్య జరిగే సంభాషణతో ఈ టీజర్ మొదలవుతుంది. నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందని తెలుసా అని భర్త ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదు అని భార్య చెబుతుంది. కానీ, ప్రతి రోజూ రాత్రి ఓ చిన్నారితో కలిసి ఆమె బీచ్‌కు వెళ్తుంది. ఆపై, భార్య ముఖానికి ప్లాస్టిక్‌ కవర్చుట్టిన భర్త ‘ఐయామ్ సారీ’ అని చెబుతాడు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వైవిధ్యంగా ఉన్న ఈ టీజర్తో రాధిక తన దర్శకత్వ ప్రతిభను చాటుకుంది. అంతేకాదు ‘పాల్మ్ స్ర్పింగ్‌ ఇంటర్నేషనల్ షార్ట్‌ ఫిల్మ్ ఫెస్ట్‌’కు కూడా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఎంపిక కావడం విశేషం.

https://www.instagram.com/p/CBFoptaHhUI/

 

ఆంధ్ర బిజెపి కి కొత్త నేత కావాలి

దేశంలో బిజెపి హవా వీస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో దాని వూసేలేదు. దీనికి రెండు కారణాలు. ఒకటి అధికారం లో బలమైన నాయకులు వుండటం. రెండు, బిజెపి స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ లేకపోవటం, ముఖ్యంగా ఆంధ్రా లో. తెలంగాణాలో డాక్టర్ లక్ష్మణ్ కొంతమేర తీవ్రంగానే ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ కుమార్ కి నాయకత్వ బాధ్యతను అప్పగించారు. ఇది వ్యూహాత్మకంగా సరయిన నిర్ణయమే. కెసిఆర్ ముందు తట్టుకొని నిలబడాలంటే ఆ మాత్రం దూకుడులేకపోతే ప్రజలు ఆదరించరు. రేవంత్ రెడ్డి ఓటు కి నోటు కేసు లో ఇరుక్కున్నా క్రేజ్ పెంచుకోగలిగాడంటే ఆ దూకుడే కారణం. అదేసమయం లో సామాజిక అంశాన్ని విస్మరించలేదు. తెలంగాణాలో సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గమయిన మున్నూరు కాపుల్ని దూరంచేసుకోకుండా తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కుమార్ కి పదవిని అప్పగించారు. కరీంనగర్, నిజామాబాదు లో బిజెపి ఎంపి లు గెలవటానికి ఈ వ్యూహమే పనిచేసింది. కాబట్టి అదే వ్యూహంతో దూకుడుగా ముందు కెళ్లాలని నిర్ణయించటం సరయినదే. ఫలితం ఎలావుంటుందో చూడాలి.

ఆంధ్రలో పరిస్థితులు క్లిష్టంగా వున్నాయి 

తెలంగాణ లో లాగా ఆంధ్రలో పరిస్థితులు లేవు. బిజెపి కి ఇంతకుముందు అధ్యక్షుడుగా వున్న డాక్టర్ లక్ష్మణ్ మొదట్నుంచీ బిజెపి , ఆర్ఎస్ ఎస్ వ్యక్తి. ఆంధ్రలో అలా కాదు. కన్నా లక్ష్మీనారాయణ ఫక్తూ కాంగ్రెస్ వ్యక్తి. కాంగ్రెస్ కి భవిష్యత్తు లేకపోవటంతో బిజెపి లోకి వచ్చాడు. అదీ పదవిపై ఆశతోనే. అధ్యక్ష పదవి రాదని  తెలిసి వైఎస్ఆర్సిపి లో చేరబోవటం , ఫ్లెక్సి లు కట్టటం కూడా చక చకా జరిగిపోయింది. చివరి నిముషం లో బిజెపి హడావిడిగా కన్నా పేరును ప్రకటించటంతో బిజెపి లో కుదురుకు పోవలసి వచ్చింది. ఇది ప్రజలకు తెలియందికాదు. ఓ విధంగా చెప్పాలంటే బిజెపి ఈ మొత్తం వ్యవహారం లో అప్రతిష్టపాలయ్యింది. వాళ్ళ వ్యూహానికి ప్రధానకారణం సామాజిక సమీకరణ లే. తెలంగాణ లో లాగా ఆంధ్రలో కూడా కాపు వర్గం సంఖ్యాపరంగా అధికంగా ఉండటంతో ఈ సామాజిక వర్గం వ్యక్తి అధ్యక్షుడయితే రాజకీయలబ్ది వస్తుందని ఊహించారు. అంతవరకూ వాళ్ళ వ్యూహాన్ని రాజకీయకోణం లో అర్ధంచేసుకోగలం కానీ అది అన్ని సందర్భాల్లో మక్కికి మక్కి వర్తించదని అర్ధంచేసుకోలేకపోయారు.

కన్నా పై అప్పటికే ప్రజల్లో మంచి అభిప్రాయం లేకపోవటం ఒక కారణం కాగా , జగన్ పార్టీలో చేరటానికి ఫ్లెక్సీ లు కట్టిన వ్యక్తిని ఏకంగా అధ్యక్ష స్థానం లో కూర్చోపెట్టటం ప్రజలు హర్షించలేదు. అదే మొదట్నుంచీ బిజెపి లోనూ, ఆర్  ఎస్ ఎస్ లోనూ వున్న వ్యక్తి కి ఇచ్చివుంటే దీర్ఘకాలం లో   కొంత ప్రయోజనం వుండేది. ఉదాహరణకు సోము వీర్రాజు చాలా దూకుడుగా చంద్రబాబుపై ఉండేవాడు. అదీగాక కాపులు అధికంగా వుండే గోదావరి జిల్లాకు సంబంధించినవాడు. ఎటూ తక్షణం బిజెపి అధికారం లోకి వచ్చే అవకాశం లేనప్పుడు ఆ ప్రయోగమే దీర్ఘకాలం లో ఉపయోగపడేది. పాత బిజెపి క్యాడరు లో నూతనోత్సాహం వచ్చివుండేది. కన్నాను చేయటంతో పాత బిజెపి వర్గాల్లో ఉత్సాహం కొరవడింది. అటు ప్రజల్లో ఆదరణ లేకుండా, ఇటు క్యాడర్ లో ఉత్సాహం లేకుండా రెండింటికి చెడ్డ రేవడిలాగా బిజెపి పరిస్థితి మారింది.

ఇంకో ముఖ్యవిషయం , తెలంగాణాలో లేని ప్రత్యేక పరిస్థితి ఆంధ్రాలో తలెత్తింది. అది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం. అప్పటికే రెండు ప్రధాన పార్టీలు రెండు సామాజిక వర్గాల నాయకత్వాన ఉండటంతో ఇకమిగిలింది కాపులే. ఆ విధంగా బిజెపి వ్యూహం కరేక్టయినా పవన్ కళ్యాణ్ పాత్రని విస్మరించింది. కాపులు పవన్ కళ్యాణ్ వైపు సహజంగానే ( తను కుల సమీకరణలకు వ్యతిరేకమని చెప్పినా ) కొంత మొగ్గుచూపిస్తారనేది వాస్తవం. అటువంటప్పుడు అంతకన్నా బలమైన కాపు నాయకుడినైనా బరిలోకి దించగలగాలి లేకపోతే ఆ తర్వాత బలంగా వున్న బిసి వర్గం నుంచి ( దళితులు అప్పటికే జగన్ వైపు సమీకరించ బడ్డారు కాబట్టి) ఎన్నుకోవాలి. కాబట్టి ఎంతో రాజకీయ అనుభవముందని చెప్పుకొనే బిజెపి ఆంధ్ర రాజకీయాల్లో తప్పటడుగులు వేసింది. అటు క్యాడర్లో పూర్తి నైరాశ్యం అలుముకుంది. దానితోపాటు ప్రస్తుత రాష్ట్ర సమీకరణలతో రాష్ట్ర బిజెపి కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. కాకపోతే ఒకే ఆశాజనక అంశమేమిటంటే పవన్ కళ్యాణ్ తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవటం. దానితో అసలేమీ లేనిచోట ముందు ముందు అవకాశాలు మెరుగు పడతాయనే ఆశల కలలు వున్నాయి.

కొత్త అధ్యక్షుడ్ని తక్షణమే నియమించాలి 

ఈ ఆశల కలలు నిజం కావాలంటే రాష్ట్ర బిజెపి నిర్మాణాన్ని చక్కదిద్దుకోవాలి. అందుకు ఇప్పుడున్న యధాతధ స్థితి మారాలి. కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాలి. అది తక్షణావసరం. ఆ పనిచేయకుండా పవన్ కళ్యాణ్ తో జతకట్టినా వచ్చే ప్రయోజనేమేమీ వుండదు. బిజెపి క్యాడర్ లో నూతనోత్సాహాన్ని నింప గలిగే నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలి. అది కాపు సామాజిక వర్గం నుంచా లేక పవన్ కళ్యాణ్ తో పొత్తు నేపధ్యంలో బిసి వర్గం నుంచా అనేది వ్యూహాత్మక నిర్ణయం జరగాలి. ఆంధ్ర లో రాజకీయాల్లో సామాజిక సమీకరణలు కీలకంగా పనిచేస్తాయి. ఇప్పటికే బిజెపి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించాడు. తెలంగాణలో కూడా ఆ వరసలోనే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర వంతు వచ్చింది. ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రక్రియ చేపడితేనే పవన్ కళ్యాణ్ తో పొత్తు వలన ప్రయోజనం వుంటుంది. ఇంతకన్నా మంచి తరుణం కూడా వుండదు. తెలుగుదేశం మొత్తం చరిత్రలోనే అత్యంత బలహీనంగా వుంది ఇప్పుడే. బిజెపి కిది బంగారు అవకాశం. సరయిన సమయం లో నిర్ణయం తీసుకోకపోతే తిరిగి పోటీ జగన్-టిడిపి మధ్యనే ఉండిపోతుంది. బిజెపి నాన్పుడు ధోరణితో వుంటే బిజెపి తో పాటు పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకి కూడా నష్టం జరిగే అవకాశముంది. ఇప్పటికైనా బిజెపి నిద్రలేచి ప్రజలకు మూడో ప్రత్యామ్నాయాన్ని కూడా ముందుంచుతారని ఆశిద్దాం.

ఫామ్ హౌస్ నుంచి ప్రగతిభవన్ కు కేసీఆర్.. కారణమిదే..?

రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ నేడు బీజీబీజీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కొన్నిరోజులుగా ఫౌమ్ హౌజ్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్ కు రానున్నారు. నేడు మధ్యాహ్నం 2గంటల నుంచి బ్యాక్ టూ బ్యాక్ అధికారులతో కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలా? నిర్వహించాలనే అనే దానిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడిలోకి వచ్చిందనుకున్న సమయంలో లాక్డౌన్ సడలింపు చేయడంతో ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వైద్యశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించనున్నారు. గడిచిన వారంరోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. పేషంట్లతో గాంధీ ఆస్పత్రి నిండుకొంది. అదేవిధంగా నిమ్స్ లో వైద్య సిబ్బంది కరోనా సోకడంతో అక్కడ తాత్కాలికంగా వైద్య సేవలు నిలిపివేశారు. వీటన్నింటిపై సమీక్షలో చర్చించున్నారు. కేసులను ఏవిధంగా కట్టడి చేయాలో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకోబోతున్నారు.

అదేవిధంగా పదో తరగతి పరీక్షలపై రాష్ట్రమంతటా సస్పెన్స్ నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తారా? లేదా రద్దు చేస్తారా? అనే ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రమంతా పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పడంతో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే విద్యార్థులందరికీ ఒకేసారీ పరీక్ష నిర్వహించాలా? లేదా దశల వారీగా నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను చర్చించనున్నారు. ఇదిలా ఉంటే పరీక్షలను రద్దుచేసి ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన ఇంటర్నల్ మార్కులతో గ్రేడింగ్ ఇస్తే ఎలా ఉంటుందని అధికారులు చర్చించనున్నారు. ప్రభుత్వం పరీక్షల రద్దుకే మొగ్గుచూపుతుండటంతో విద్యార్థులకు గ్రేడింగ్ ఎలా ఇస్తారనేది ఆసక్తి మారింది. ఈ పరీక్షలకు హాజరుకాని విద్యార్థుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో చర్చించనున్నారు. ఈ బేటిలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.

మహేష్ సరసన బాలీవుడ్ కొత్త భామ!


‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. మహర్షి అనంతరం యువ దర్శకుడు అనిల్ రావిపుడికి అవకాశం ఇచ్చాడు. అప్పటికే వరుసగా నాలుగు హిట్ మూవీలతో సూపర్ సక్సెస్‌లో ఉన్న అనిల్‌.. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు మెసేజ్‌ను జోడించిన కథతో మహేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించాడు. ఇదే జోరులో మరో యువ దర్శకుడు పరశురామ్‌తో ఇంకో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు మహేష్. ‘సర్కారు వారి పాట’ అనే వెరైటీ టైటిల్ పెట్టిన ఈ సినిమాలో మహేష్ ఫస్ట్‌లుక్‌ను కృష్ణ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. మెడపై రూపాయి బొమ్మ టాటూ, చెవి పోగుతో ఉన్న మహేశ్ లుక్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతి లభించిన వెంటనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేందుకు యూనిట్ కసరత్తలు చేస్తోంది. అయితే, ఈ మూవీలో మహేష్ సరసన నాయిక ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై రోజుకో వార్త వినిపిస్తోంది. తొలుత పూజా హెగ్గే నటిస్తుందని అన్నారు. ఆపై, కియారా అడ్వానీ పేరు వినిపించింది. ఇప్పటికే వీరిద్దరూ మహేశ్ తో నటించారు. మహర్షిలో పూజ యాక్ట్ చేయగా.. భరత్ అనే నేను చిత్రంలో కియారా హీరోయిన్‌ చేసి ఆకట్టుకుంది. దాంతో, మహేశ్ తో సెకండ్‌ టైమ్‌ రొమాన్స్‌ చేసే అవకాశం ఈ ఇద్దరిలో ఎవరికి వస్తుందో అని అంతా భావించారు. కానీ, ఈ ఇద్దరికీ ఆ చాన్స్ లేదట. ఎందుకంటే ‘సర్కారు వారి పాట’లో సయీ ముఖర్జీ అనే బాలీవుడ్‌ కొత్త హీరోయిన్ నటించనుందట. మహేష్ సరసన ఇప్పటికే నటించిన వారికంటే కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. దాంతో, సయీని సంప్రదించినట్టు సమాచారం. ఈ యువ నటి బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. సల్మాన్‌ ఖాన్‌ సరసన దబాంగ్‌ 3లో నటించి ఈ మధ్యే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే, కొత్త కాంబినేషన్ ఉంటేమహేశ్ కు  కలిసొస్తుందని కూడా టాలీవుడ్‌ టాక్‌లో ఉంది. మరి, మరో బాలీవుడ్ నాయికను మహేష్ టాలీవుడ్‌కు పరిచయం చేస్తాడా? చూడాలి.

హైకోర్టును ఆశ్రయించిన వైద్యురాలు..!


వైద్యుడు సుధాకర్ ఘటన ఓ కొలిక్కి రాక ముందే అధికార పార్టీ, ప్రభుత్వం ఇటువంటిదే మరో ఘటనలో ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై, అధికార పార్టీ నాయకులపై ఓ వైద్యురాలు హైకోర్టును ఆశ్రయించారు. తనను అధికార పార్టీ నాయకులు నిర్బంధించి వేధింపులకు గురి చేశారని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ అనితారాణి తనకు జరిగిన అవమానాన్ని ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నా తనను వేధింపులకు గురిచేశారని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో దిగువ స్థాయి సిబ్బంది చేస్తున్న అవినీతిని ప్రశ్నించి కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే స్థానిక వైసీపీ నాయకులు తనను ఈ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ పెట్టిన మార్చి 22వ తేదీన గ్రామంలోని హాస్టల్ గదిలో ఆసుపత్రి సిబ్బంది తనను నిర్బంధించి స్థానిక వైసీపీ నాయకులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని తనను దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెట్టారని, వాష్ రూమ్ కు వెళుతుంటే విడియో తీసి వేధించారని, అవమానకరమైన దూషణలకు పాల్పడ్డారని వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళిత మహిళ కావడంతో మరింత వివక్షకు గురి చేశారన్నారు. సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు వల్ల మానసికంగా ధైర్యం వచ్చి తాను హైకోర్టులో వారం రోజుల కిందట పిటీషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

సంఘటన జరిగిన మరుసటి రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పోలీసు కేసు పెట్ట వద్దని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తనపై వత్తిడి తెచ్చారని తెలిపారు. దీంతో తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేక ఇన్నాళ్లు మిన్నకుండిపోయానని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వైద్యులు ప్రాణాలను సైతం లెక్కేచేయకుండా సేవాలందిస్తుంటే ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఇలా వేధింపులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహమ్మరి గుప్పిట్లో మహానగరం


చైనా మహ్మమరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 కొనసాగుతోంది. జూన్ 30వరకు ఇది కొనసాగనుంది. అయితే లాక్డౌన్ 3, 4లలో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. దాదాపు అన్నిరంగాలకు షరతులతో కూడిన అన్నిరంగాలకు అనుమతి ఇవ్వడంతో తిరిగి మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కేసులు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో కంట్రోల్లోనే ఉంటుంది. సింగిల్ డిజిట్ కే పరిమితమైన కేసులు ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగజేస్తోంది. కరోనా కేసులు లేని జిల్లాల్లో కూడా ప్రస్తుతం కొత్త కేసులు నమోదవుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్లో డేంజర్ బేల్స్..
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కంట్రోల్ తప్పుతోంది. తొలినాళ్లలో పాతబస్తీ లాంటి ప్రాంతాలకే పరిమిత కేసులు ప్రస్తుతం అన్ని ఏరియాల్లో నమోదవుతున్నాయి. లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం వల్లనే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు అన్నిరంగాలకు అనుమతి లభించడం, రాకపోకలు సాగిస్తుండటంతో వైరస్ క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నట్లు కన్పిస్తుంది. దీంతో గాంధీ ఆస్పత్రి కరోనా పేషంట్లతో నిండుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైద్యులపై అదనపు భారం పెరగడంతో వైద్య సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు. నిమ్స్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది సైతం కరోనా బారిన పడటం చూస్తుంటే వైరస్ ఎంత స్పీడుగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మూడురోజుల్లోనే 500 కొత్త కేసులు..
హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది. జనవరి 30న రాష్ట్రంలో తొలి కరోనా కేసును గుర్తించారు. తొలి 500 కేసులు నమోదవడానికి 39రోజులు సమయం పట్టింది. అనంతరం 500నుంచి వెయ్యికి చేరడానికి 15రోజులు సమయం పట్టింది. 1500చేరడానికి 20రోజుల సమయం పట్టింది. 2వేల మార్క్ చేరడానికి మరో పది రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత క్రమంగా రోజుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2వేల తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే మరో 500కేసులు పెరిగాయి. ఆ సంఖ్య ప్రస్తుతం ఐదు రోజుల నుంచి మూడురోజులకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రోజుల్లోనే 500కేసులు నమోదవుతుండటం వైరస్ విజృంభణకు అద్దంపడుతుంది. ఏప్రిల్ నెలలో హైదరాబాద్లో 376, మేలో 876, జూన్ తొలి వారంలోనే 638కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య పరిశీలిస్తే మహానగరంలో కరోనా కంట్రోల్ తప్పినట్లు కనిపిస్తున్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

ఆచార్య.. సోషల్ మెసేజ్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్


కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి మెగాస్టార్, కొరటాల బలబలాలను బట్టి వీరి సినిమాలో ఉండబోయే అంశాలు పరిశీలిస్తే.. ముందుగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ విషయానికొస్తే కొరటాల వాటికి ఏ మాత్రం వెనుకాడరు. కాబట్టి సినిమాలో బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. అలాగే మెగాస్టార్ డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చిరు చూస్తారు. కాబట్టి చిరు నుండి ‘ఖైదీ నెం 150’ లెవల్లో స్టెప్స్ ఈ సినిమాలో కూడా ఆశించవచ్చు.

ఇక మెగాస్టార్ కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. కానీ కొరటాల సినిమాల్లో కామెడీ పెద్దగా ఉండదు. ఆయన సినిమాల్లోని హీరోలంతా ఎప్పుడూ సీరియస్ మోడ్ ఆన్ చేసినట్టే ఉంటారు. పైగా కామెడీ లాంటి ట్రాక్స్ కొరటాల ఎప్పుడూ రాసింది లేదు. కాబట్టి ఈ చిత్రంలో కామెడీకి స్కోప్ ఉండకపోవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రావడం ఖాయం. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’లో బెస్ట్ సన్నివేశాలు అవే !

rrr shooting

rrr shooting
ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఇప్పటికే 80% షూట్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో తారక్ – చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశాలు
‘ఆర్ఆర్ఆర్’లోనే బెస్ట్ సన్నివేశాలు అని తెలుస్తోంది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఓ వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తోన్న సందర్భంలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూస్తాడట. అలా భీంని చూసి రాజు అతని పట్ల అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడని, అయితే దాన్ని వ్యక్తపర్చకుండా భీంతో పోటీ పడతాడని సమాచారం.

ఇక ఈ సినిమాలోనే ఈ సీక్వెన్స్ ఇంట్రస్టింగ్ సీక్వెన్స్ అట. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా విదేశీ భామ ‘ఒలివియా మోరిస్’ నటించనుంది. అలాగే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ రెండు నిముషాల పాటు కనిపిస్తోందట. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకా కొత్త కాలం ఎదురుచూడాల్సిందే.

కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2021 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కరోనా ఎపెక్ట్.. బోనాలకు బ్రేక్..


హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుచ్చేది బోనాల పండుగే. లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది ప్రజలు హాజరవుతుంటారు. ఈ ఉత్సవాల్లో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతోన్నాయి. ఈసారి భక్తులు లేకుండానే అధికారులు, పూజారులు బృందం అమ్మవారికి బోనాల సమర్పించనున్నారని దేవదాయశాఖ మంత్రి అల్లలో ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

బోసిపోనున్న బోనాల పండుగ.
ప్రతీయేటా భాగ్యనగరం రంజాన్, బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ సంబరాలతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఈసారి కరోనా కారణంగా రంజాన్ పండుగ నిరాడబరంగా సాగింది. మసీదుల్లో అలాయ్.. బలాయ్ చేసుకోవాల్సిన ముస్లింలంతా ఈసారి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని రంజాన్ పండుగు చేసుకున్నారు. తాజాగా కరోనా ఎఫెక్ట్ బోనాల పండుగపై పడనుంది. వందల యేళ్లుగా నగరంలో శోభాయానంగా జరుపుకుంటున్న బోనాల పండుగ ఈసారి కళ తప్పేలా కన్పిస్తుంది.

భక్తులు లేకుండానే బోనాలు..
ఈనెల8 నుంచి ఆలయాలు, ప్రార్థన మందిరాలు తెరుచుకోనున్నాయి. దీంతో ఈసారి బోనాల పండుగకు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈసారి బోనాల పండుగ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో కరోనా కట్టడిలో లేనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా భౌతికదూరం పాటించడం ముఖ్యమని తేల్చిచెప్పారు. అమ్మవార్లకు అధికారులు, 11మంది పూజారులతో కూడిన బృందం బోనాలు సమర్పిస్తారని దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు.

ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..
జూన్ 23న ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తారు. 25న గోల్కొండ జగదాంబిక, జులై 12న ఉజ్జయిని మహంకాళి, 19న లాల్‌ దర్వాజ సింహవాహినికి బోనాలు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 8నుంచి ఆలయాలు తెరుచుకోనుండటంతో అధికారులు తగు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు భౌతికదూరం విధిగా పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ఆలయ ప్రాంగణాలను శానిటైజేషన్ చేస్తున్నారు. భక్తులు గుడిలోకి ప్రవేశించే ముందు థర్మల్ స్కీనింగ్ చేస్తారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే వేడుకలు కావడంతో ప్రభుత్వం కూడా ముందుగానే ఏర్పాట్లు చేస్తుంది. 65ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులను ఆలయానికి రావొద్దని ప్రభుత్వం కోరుతుంది.

ఈ ఏడాది కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులతోనే బోనాల పండుగ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆలయ కమిటీలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఈసారి మాత్రం హైదరాబాద్ మహానగరం పండుగలు జరుపుకోలేక కళావిహీనంగా కన్పించనుండటం శోచనీయంగా మారింది.

కాంగ్రెస్ ను వీడుతున్న కీలక నేతలు.. కారణమేంటి?


100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.. వరుసగా జాతీయ కాంగ్రెస్ పార్టీని అధికార ప్రతినిధులు వీడుతుండడం.. అసంతృప్తితో వైదొలుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. వైదొలిగే వారందరూ తమ అసంతృప్తిని దాచడం లేదు. కాంగ్రెస్ లోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్ తప్పులకు అగ్రనాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నేతలు వీడుతున్నారు. తాజాగా మొదట కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి స్వాతి చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే శివసేనలో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా మారిపోయారు. ఈయన బాటలోనే కాంగ్రెస్ అధికార ప్రతినిధులంతా ఇప్పుడు బీజేపీ బాటపడ్డారు.

ఇక ఇవన్నీ కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. టీవీ చానెళ్లలో కాంగ్రెస్ తరుఫున వాగ్దాటిగా వాదించే ఎంతో పాపులర్ అయిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వి పార్టీలో కొనసాగుతున్న విషయాలపై అసమ్మతి నోట్ పార్టీకి పంపి కలకలం రేపారు.

ఇక మరో పాపులర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ జా కూడా టీవీ చానెల్ డిబేట్లలో అదరగొడుతుంటారు. తాజాగా పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. సానుకూల విమర్శలకు పార్టీ దయతో వ్యవహరించడం లేదని. తన తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించడం లేదన్నారు. హైకమాండ్ కు సుధీర్ఘ లేఖ రాయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈయన కూడా బీజేపీ బాటపట్టడం ఖాయమంటున్నారు.

ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీని ఒక్కరొక్కరుగా ఆ పార్టీ అధికార ప్రతినిధులంతా వీడుతుండడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండడం కాంగ్రెస్ కు షాకింగ్ గా మారింది. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు బీజేపీలో చేతిలో ఓడిపోవడం.. వచ్చేసారి కూడా గెలుపు కష్టమనే భావనతోనే నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు.

-నరేశ్ ఎన్నం

తెలుగు బ్యూటీ నుండి రొమాంటిక్ థ్రిల్లర్ !


టాలీవుడ్ లో తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా జర్నీ ఒక అడుగు ముందుకు పడితే, నాలుగడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ పరంగా తాను ఆశించినది ఒకటి.. పాపం ఆమెకు తక్కుతుంది ఇంకొకటి అట. అమ్మడు కూడా ఇదే ఫీలింగ్ లో ఉందట. ఆమె నటించిన గత సినిమాలు అరవింద సమేత, ‘రాగల 24 గంటల్లో’ సినిమాలతో హిట్ అందుకున్న ఆ స్థాయిలో తనకు గుర్తింపు రావడంలేదని అమ్మడు తెగ ఇదయపోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి మొదటి నుంచీ ఈషాకి చెపుకోదగ్గ అవకాశాలొచ్చినా ఆశించిన విజయాలు అయితే దక్కలేదు.

దాంతో చివరికీ అమ్మడు రూట్ మార్చి బోల్డ్ క్యారెక్టర్స్ కూడా సై అని స్టేట్ మెంట్స్ ఇచ్చి మరీ చెప్పుకొచ్చింది. పైగా హాట్ స్టిల్స్ బాగా వదులుతుంది. ఈ మధ్య ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా. అయితే ఈ తెలుగు బ్యూటీ తన గ్లామర్ తోనే కాకుండా తన లేటెస్ట్ సినిమా అప్ డేట్ తో కూడా తాజాగా వార్తల్లో నిలిచింది. ఓ రొమాంటిక్ థ్రిల్లర్ లో ఈషా నటించనుంది. ఈ సినిమాలో సుశాంత్ హీరోగా నటించనున్నట్లు.. ఈ సినిమాకి రమేష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

కాగా ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’, అరవింద సమేత లాంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో ఓ హర్రర్ థ్రిల్లర్ తో రాబోతుంది. అన్ని కుదిరితే అక్టోబర్ నుండి ఈ చిత్రం షూట్ కి వెళ్లనుంది.

వెంకీ ‘నారప్ప’లో కామెడీ యాంగిల్ కూడా !


‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో ‘నారప్ప’ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ అసురన్ సినిమాని తెలుగులో కొన్ని మార్పులు చేసి తీస్తున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో స్క్రిప్ట్ వర్క్ చేశారట. ముఖ్యంగా వెంకటేష్ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త సీన్స్ ను రాశారట. వెంకటేష్ క్యారెక్టర్ సీరియస్ గా సాగిన.. ఆ సీరియస్ నెస్ లో వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా చేయాలని శ్రీకాంత్ అడ్డాల మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

ఇక వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోంది. ఇక వెంకీ మరో రీమేక్ లో కూడా నటించబోతున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ లో నటించడానికి వెంకీ – రానా ఇంట్రస్ట్ గా ఉన్నారట. ఒరిజినల్ వర్షన్‌ లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో వెంకీ చేయబోతున్నాడట. అలాగే మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో ఈ రీమేక్ చేయబోతోంది.