
లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. 2015లో వచ్చిన ‘నానుమ్ రౌడీదాన్’ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమాలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ మూవీకి విఘ్నేశ్ దర్శకత్వం వహించగా.. నయన్ హీరోయిన్‌గా నటించింది. అంతకుముందు శింబుతో కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిపించిన లేడీ సూపర్ స్టార్ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పీకల్లోతు ప్రేమలో విహరించిన వీరిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ప్రభును పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్న నయన్.. బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం’ మూవీ పూర్తయ్యాక యూనిట్‌కు వీడ్కోలు కూడా ఇచ్చింది. కానీ, ఏమైందో ఏమో కానీ.. వీరిద్దరి పెళ్లి జరుగలేదు. ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత చాన్నాళ్లు ఒంటరిగా ఉండిపోయిన ఈ ముద్దుగుమ్మ.. విఘ్నేశ్‌కు మనసిచ్చింది. ఐదేళ్ల నుంచి వీరిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు.
దేశ, విదేశాల్లో అనేక విహార యాత్రలకు వెళ్లారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తమ ప్రేమను బహిర్గతంగానే ఉంచారు. అలాగే వీలుచిక్కిన ప్రతీసారి ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటాన్నారో వ్యక్తపరుస్తున్నారు. మొన్నటి మథర్స్ డే రోజు.. నయన్ ఓ చిన్నారితో ఉన్న ఫొటోనూ షేర్ చేసిన విఘ్నేశ్.. భవిష్యత్తులో నాకు పుట్టబోయే పిల్లల తల్లికి శుభాకాంక్షలు అని చెప్పాడు. దాంతో, వీరిద్దరూ పెళ్లికి సిద్ధపడ్డారని అర్థమైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు నయన్, విఘ్నేశ్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. ఈనెలలోనే ఈ ఇద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని తెలుస్తోంది. తమిళనాడులోని ఓ ప్రఖ్యాత దేవాలయంలో పెళ్లి వేడుక ఉంటుందని, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరవుతారట. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే నయన్, విఘ్నేశ్ ఒకరు స్పందించాల్సి ఉంది.