
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య గత కొద్ది రోజులుగా జల వివాదం తలెత్తిన విషయం తెల్సిందే. ఈ వివాదం పరిష్కారానికి తెలంగాణా ప్రభుత్వం కృష్ణా యాజమాన్య బోర్డును ఆశ్రయిస్తే, ప్రతిగా ఏపీ ప్రభుత్వం గోదావరి యాజమాన్య బోర్డుకు తెలంగాణాపై ఫిర్యాదు చేసింది. దీంతో రెండు బోర్డులు ఏపీ, తెలంగాణా అధికారులను పిలిచి వివరాలు తీసుకుని వాదనలు నమోదు చేసుకున్నాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో సాంకేతిక అనుమతులు పొందకుండా ముందుకు వెళ్లవద్దని సూచించాయి. దీంతో ఈ వివాదం సమసిపోతుందా అంటే కాదనే చెప్పాలి. బోర్డు ఆదేశాలను క్షేత్ర స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పాటించదు. అలా పాటిస్తే దేశంలో జల వివాదాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఏపీ, తెలంగాణాల మధ్య నీటి వివాదాన్ని కరోనా నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ వివాదం సృష్టించారని ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తేల్చి చెప్పింది. ఈ అంశంపై తమ వైఖరి వెల్లడించకుండా దూరంగానే ఉంది. బీజేపీ, ఇతర పార్టీలు మాత్రం వారి వైఖరిని రెండు రాష్ట్రాల్లో స్పష్టం చేశాయి. మరోవైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఈ సమస్యలను చర్చలతో పరిష్కరించు కోవాలని భావిస్తున్నారని సమాచారం.
తాజాగా అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనున్న నేపథ్యంలో త్వరలోనే సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వివాదాలు లేకుండానే ముందుకు పోతున్నాయి. వ్యక్తిగతంగా జగన్, కేసీఆర్ మధ్య మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే. గతంలో ఇరువురు సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. అలాగే నదీ జలాల విషయంలోనూ కలిసి సాగుదామని నిర్ణయించుకున్నారు. నదీ జలాలు రెండు రాష్ట్రాల రైతులకు దక్కేలా కృషి చేద్దామని అనుకున్నారు. ప్రస్తుతం ఇదే విధానాన్ని అవలంభించాలని భావిస్తున్నారు.