అనీష్ సుందర్, దివ్య సుగూర్, సుందర్ గోపినాథ్ ఆర్థిక సహకారం – గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్య సేవలు
TANA Foundation : దుబ్బాక: క్యాన్సర్ పేరు వినగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కానీ వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం చికిత్స మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య పరీక్షలు అందుబాటులో లేక చాలామంది వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు చేరువగా వైద్య సేవలను తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా దుబ్బాకలో ప్రత్యేక ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.

తానా ఫౌండేషన్ ప్రధాన సమన్వయంతో జరిగిన ఈ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి దుబ్బాక పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామీణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

గ్రామాలకే వైద్య సేవలు
సాధారణంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పట్టణాలు, పెద్ద ఆసుపత్రులను ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రయాణ ఖర్చులు, పరీక్షల వ్యయం, సమయం వంటి కారణాలతో చాలామంది పరీక్షలకు దూరంగా ఉంటుంటారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మొబైల్ వైద్య శిబిరాన్ని దుబ్బాకకు తీసుకువచ్చారు. శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, వైద్య సిబ్బంది క్యాన్సర్‌కు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స అవసరంపై సూచనలు అందించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స అవకాశాలు మెరుగుపడతాయని ప్రజలకు అవగాహన కల్పించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.

ముగ్గురి ఆర్థిక సహకారం.. గ్రేస్ ఫౌండేషన్ వైద్య సేవలు
ఈ సేవా కార్యక్రమానికి అనీష్ సుందర్, దివ్య సుగూర్, సుందర్ గోపినాథ్ ఆర్థిక సహకారం అందించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్య సేవలను అందించగా, గాడిపల్లి ఫౌండేషన్ స్థానికంగా అవసరమైన సహకారం అందించింది. వివిధ సంస్థలు, వైద్య బృందాలు, స్థానిక ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో తానా ప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. తానా న్యూజెర్సీ కోఆర్డినేటర్ సుధీర్ నరేపలుపు, తానా కోశాధికారి రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. వాలంటీర్ కోఆర్డినేటర్ వర్ష నరేపలుపు స్వచ్ఛంద సేవకులను సమన్వయం చేశారు.

‘ప్రారంభ దశలో గుర్తిస్తే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’
ఈ సందర్భంగా గాడిపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ పేద ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గాడిపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు ఆరోగ్యపరంగా లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని, సాధ్యమైనంత సహాయం అందించేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు.

గ్రామీణ ఆరోగ్యంపై తానా ఫోకస్
తానా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ నల్లూరి, తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు తానా ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. వైద్య పరీక్షలు మాత్రమే కాకుండా ఆరోగ్యంపై అవగాహన పెంచడం కూడా ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రామీణ సమాజాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే మరిన్ని వైద్య, ఆరోగ్య అవగాహన, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.

ప్రజల నుంచి మంచి స్పందన
దుబ్బాకలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య పరీక్షలకు హాజరు కావడం నిర్వాహకుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన అనీష్ సుందర్, దివ్య సుగూర్, సుందర్ గోపినాథ్‌తో పాటు వైద్య సేవలు అందించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, స్థానికంగా సహకరించిన గాడిపల్లి ఫౌండేషన్, వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలకు తానా నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. వైద్యం ఖరీదైనదిగా మారుతున్న సమయంలో.. వ్యాధి నిర్ధారణ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో నిర్వహించిన ఇలాంటి శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణకు కీలకంగా మారుతున్నాయి.

