Palla Rajeshwar Reddy: గులాబీ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు.. కెసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.. భారత రాష్ట్ర సమితి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదయింది. ఇది కాస్త రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది..
పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. గతంలో ఈయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కెసిఆర్ కుటుంబంతో ఈయనకు అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాజేశ్వర్ రెడ్డికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో.. కోదాడలో.. ఇంకా అనేక ప్రాంతాలలో విద్యాలయాలు ఉన్నాయి. అనురాగ్ పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్ని ఈయన నిర్వహిస్తున్నారు. రాజేశ్వర్ రెడ్డి మీద ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇది కాస్త తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.
రాజేశ్వర్ రెడ్డి మీద జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ కిషన్ కుమార్ రెడ్డి కుటుంబం ఫిర్యాదు చేసింది. రాజేశ్వర్ రెడ్డికి.. కిషన్ కుమార్ రెడ్డికి కొద్దిరోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కిషన్ కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సెప్టెంబర్ నెల 8వ తేదీన రాజేశ్వర్ రెడ్డి తిట్టారని.. బెదిరించాలని సుజనా రెడ్డి ఫిర్యాదు చేశారు.. అయితే దీని వెనుక ఉన్న వాస్తవాలను రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ఓ విషయం గురించి మాట్లాడేందుకు కిషన్ కుమార్ రెడ్డికి రాజేశ్వర్ రెడ్డి ఫోన్ చేశారు. అప్పుడు ఆయన బాత్రూంలో ఉన్నారు. దీంతో ఆయన ఫోన్ ను వేరే వ్యక్తి ఎత్తారు. ఆ సమయంలో రాజేశ్వర్ రెడ్డి తాను కిషన్ కుమార్ రెడ్డితోనే మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశారు.. ఆ తర్వాత వీసీ కిషన్ కుమార్ రెడ్డి అందుబాటులోకి వచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్లను.. మహిళా ప్రొఫెసర్లను తీవ్ర పదజాలంతో ఎందుకు దూషించారని కిషన్ కుమార్ రెడ్డిని రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు. తనమీద ఏదైనా కోపం ఉంటే నేరుగా ప్రశ్నించాలని.. అలా కాకుండా మహిళా ప్రొఫెసర్ల మీద అలా వ్యవహరించడం తప్పు అని కిషన్ కుమార్ రెడ్డితో రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కిషన్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు ఆ సమయంలో ఆయన తిరుపతిలో ఉన్నారు. ఫోన్లోనే రాజేశ్వర్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత లిఖితపూర్వకంగా లేఖ ఇస్తానని రాజేశ్వర్ రెడ్డితో కిషన్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే కిషన్ కుమార్ రెడ్డి నుంచి మరుసటి రోజు వరకు ఎటువంటి లేఖ రాలేదు. దీంతో బాధితులైన మహిళా ప్రొఫెసర్లు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. కిషోర్ కుమార్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు.
ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు కిషన్ కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో రాజేశ్వర్ రెడ్డి మీద కిషన్ కుమార్ రెడ్డి కుటుంబం చేస్తున్న ఆరోపణలు మరో విధంగా ఉన్నాయి. రాజేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి తమను బెదిరించారని.. తప్పుడు కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. అంతేకాదు, కిషన్ కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు దారి తీసిన నేపథ్యంలో.. ఇరు వర్గాలను విచారించి.. కాల్ రికార్డులను.. పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని పోలీసులు చెబుతున్నారు.