Vemuri Radhakrishna:దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చెప్తున్నారు. రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకొచ్చి.. సమ్మిట్ పేరుతో హంగామా చేస్తున్నారు. రేవంత్ చేస్తున్న ప్రయత్నానికి రాధాకృష్ణ సపోర్ట్ ఇస్తున్నారు. వాస్తవానికి ఒకప్పుడు రాజకీయ నాయకులు.. మీడియా అధినేతలు చాటుమాటుగా కలుసుకునేవారు. ఇప్పుడు నేరుగానే కలుస్తున్నారు. మాట్లాడుకుంటున్నారు. పైగా ఆ విశేషాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ లోపాలను బయటపెట్టే మీడియా అధినేతలు.. ప్రభుత్వ పెద్దలతో కలిసిపోతే వ్యవస్థ ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే..
ఆంధ్రజ్యోతి పత్రికలో ఆదివారం కొత్త పలుకు సంపాదకీయంలో వేమూరి రాధాకృష్ణ రాహుల్ గాంధీ ఆశల మీద.. రేవంత్ రెడ్డి అంచనాల మీద నీళ్లు చల్లారు. ఎందుకంటే వచ్చే మారు కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు. దీని వెనుక ఉన్న కారణాలను తనదైన శైలిలో విశ్లేషించారు. కాకపోతే ఆ కారణాలు నమ్మే విధంగా ఉన్నాయి.
నరేంద్ర మోడీ ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన.. జమిలి ఎన్నికలను తీసుకొస్తున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీ మరో రెండు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగే విధంగా నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నారు. జన్ జెడ్ ఉద్యమాలు జోరుగా సాగుతున్నాయి. వామపక్ష భావజాలం ఉన్నవారు క్రియాశీలమయ్యారు. ప్రధానమంత్రి స్థాయి తగ్గిపోతుంది అనే భావన ఏర్పడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. పోటుచూరి ఉద్యమాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. అయితే తన ఆలోచనలో నూతన విధానాన్ని పాటించే నరేంద్ర మోడీ 2034 వరకు అనుసరించాల్సిన ఎత్తుగడల మీద దృష్టిపెట్టినట్టు రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగిపోతోందట. ఏపీ పునర్విభజన చట్టంలో నాడు ప్రస్తావించిన విధంగా అసెంబ్లీ స్థానాలు పెంచుతారా.. పార్లమెంట్ స్థానాల మాదిరిగానే శాసనసభ స్థానాల సంఖ్యను 50% పెంచుతారా అనేది త్వరలో తేలుతుందట. ఒకవేళ నియోజకవర్గాల పెంపు జరగాలంటే పునర్విభజన జరగాలి. దీనికోసం పాలక పార్టీలు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటాయట. 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. నాడు సీఎంగా ఉండు రాశేఖర్ రెడ్డి టిడిపి బలంగా ఉన్న ప్రాంతాలలో ఉన్న భాగాలను ఇతర నియోజకవర్గాలలో కలిపేశారు. 2009 ఎన్నికల్లో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
ఇక జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టం ఆమోదం పొందుతే.. తెలంగాణ రాష్ట్రంలో 2029 లోనే ఎన్నికలు జరిగితే.. వచ్చే ఆరు నెలల కాలానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా.. ఆయన గడుగు పూర్తయితే రాష్ట్రపతి పరిపాలన విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏ కారణం వల్ల అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో 2028 లో ఎన్నికలు జరిగితే.. కేసీఆర్ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తారు. దానికంటే ముందు చంద్రబాబు కూడా తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణలో ఎన్నికలను ఆరు నెలలు ఆలస్యంగా జరిపేలా చేస్తారు.
క్రమంగా గులాబీ పార్టీ బలపడుతోంది. ఎన్నికల నాటికి ఆ పార్టీని బలహీనం చేసేందుకు కమలం పెద్దలు వ్యూహరచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల పాటు ఎన్నికలు ఆలస్యంగా జరిపించి.. రాజకీయంగా ప్రయోజనకరం అని భావిస్తే బిజెపి పెద్దలు ఎందుకు దానికి మొగ్గు చూపకుండా ఉంటారని రాధాకృష్ణ రాసుకొచ్చారు.
ఒకవేళ 2028లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాగలిగితే.. ఒక ఆరు నెలలు ఎన్నికల ఆలస్యమైతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఎలా పోతారు. ఆరు నెలల్లోనే పరిస్థితి మారిపోతుందా.. ప్రజల్లో ఉన్న ఆగ్రహం చల్లారి పోతుందా.. ఇప్పటికే బీజేపీ.. బిఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని గతంలో అనేక పర్యాయాలు ప్రస్తావించిన రాధాకృష్ణ.. ఇప్పుడు కొత్తగా గులాబీ పార్టీని కమలం నేతలు బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడం నిజంగా ఒకింత ఆశ్చర్యకరం. ఈ మొత్తం వ్యాసంలో జగన్ ప్రస్తావన లేదు. కాబట్టి రాధాకృష్ణ సంపాదకీయం సాఫీగా సాగిపోయింది.