Bihar Election Result 2025: “కేంద్రం అక్రమాలకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం దానికి వత్తాసు పలుకుతోంది. అందువల్లే అధికారంలోకి వస్తోంది. ఎన్నికల సంఘం నరేంద్ర మోడీ ఎదుట మోకరిల్లుతోంది. ఆయన చెప్పినట్టు చేస్తోంది. దొంగ ఓటర్లను నమోదు చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. అన్నింటికీ మించి విదేశీయులకు సైతం ఓటు హక్కు కల్పించి.. ఓట్లు వేయించుకొని గెలుస్తున్నారు ” బీహార్ ఎన్నికలకు ముందు ఓటు అధికార్ ర్యాలీలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ మీద.. ఎన్నికల సంఘం మీద చేసిన ఆరోపణలు అవి.
వాస్తవానికి రాహుల్ గాంధీ ఆ స్థాయిలో ఆరోపణలు చేసిన తర్వాత.. అదే స్థాయిలో ఆధారాలు చూపించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇన్ని ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం ఆహ్వానించినట్టుగా అప్పిల్ చేయలేకపోయారు. దీంతో ఆ ఆరోపణలు మొత్తం గాలివాటం అని తేలిపోయాయి. పదేపదే ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పై స్పందించినప్పటికీ.. రాహుల్ గాంధీ ఆస్థాయిలో ఆధారాలు సమర్పించలేకపోయారు.
రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ రాష్ట్రంలో దాదాపు 25 జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు.. 110 నియోజకవర్గాలలో ఆయన విస్తృతంగా ప్రజలను కలిశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి రాలేదు. కనీసం గెలవలేదు. అంతే కాదు రెండో విడతలో ప్రచారం చేసిన ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. రెండు సీట్లలో కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చినప్పటికీ.. ఆ స్థానాలను గెలవలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటర్ అధికార్ ర్యాలీని తన సొంత కార్యక్రమంగా నిర్వహించుకుంది. అందువల్ల ఈ కార్యక్రమానికి ఆర్జెడి సపోర్ట్ లేకుండా పోయింది. చివరి దశలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు సంఘీభావం తెలిపినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాహుల్ గాంధీ.. అదే స్థాయిలో గనుక ఆధారాలు చూపించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ విధానంపై కూడా రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రశ్న పత్రాలు అత్యంత కఠినంగా ఉంటున్నాయని.. అందువల్లే వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలు అందులో ప్రవేశాలు పొందలేకపోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సైన్యంలో కూడా పదోన్నతులు అగ్రవర్ణాలకే దక్కుతున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇలాంటి చవకబారు విమర్శలు చేయడం వల్ల రాహుల్ గాంధీ పరువు పోగొట్టుకున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేశారు. ఇంతటి దారుణమైన ఓటమి తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకుంటుందా.. దేశ ప్రయోజనాలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.