Snow-covered Badrinath Temple : మనదేశంలో దేవ భూమిగా పేరుపొందింది ఉత్తరఖాండ్ రాష్ట్రం. ఇక్కడ లెక్కకు మిక్కిలి ఆలయాలు ఉన్నాయి. శివుడు నుంచి మొదలుపెడితే విష్ణువు వరకు ఎన్నో ఆలయాలను ఇక్కడ నిర్మించారు.
ప్రసిద్ధమైన బద్రీనాథ్ ఆలయం.. ఇక్కడే ఉంది. ఇక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. హిమాలయాలకు దగ్గరగా ఈ ప్రాంతం ఉండడంతో నిత్యం శీతలంగానే ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాంతం సరికొత్త రూపంతో కనిపిస్తూ ఉంటుంది. దట్టంగా కురిసే మంచు ఈ ప్రాంతానికి సరికొత్త అందాన్ని తీసుకొస్తూ ఉంటుంది. పర్వత ప్రాంతాలపై మంచు పేరుకుపోవడంతో అవి వెండికొండలుగా కనిపిస్తున్నాయి.
ఉత్తర ఖాండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ప్రస్తుతం మంచు పూర్తిగా కప్పేసింది. విపరీతంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో ఆలయం మొత్తం వెండికొండ లాగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. కేవలం మీ ఆలయం మాత్రమే కాదు, చాలా ప్రాంతాలను మంచు కప్పేయడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరి కొద్ది రోజులపాటు ఈ ప్రాంతంలో ఇలానే చలి ఉంటుందని.. మంచు కూడా ఇదే స్థాయిలో కురుస్తుందని అధికారులు చెబుతున్నారు.
సహజంగా చలికాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుంటాయి. కొన్ని సందర్భాలలో సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుంటాయి. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు వరుసగా పడిపోవడంతో ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. అందువల్లే ఈ ప్రాంతాలు వెండి కొండల మాదిరిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ దృశ్యాలు చూసేందుకు అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఇక్కడి వాతావరణం మాత్రం అత్యంత శీతలంగా ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల తమ రోజు వారీ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఉత్తర ఖాండ్ ప్రజలు చెబుతున్నారు.