IPL 2026 hype low : ఒకప్పుడు ఐపీఎల్ వస్తోందంటే చాలు.. ఊరూ వాడా పండుగ వాతావరణం ఉండేది. కానీ ఈసారి సీన్ చూస్తుంటే, పండుగ అయిపోయాక వచ్చే నీరసం కనిపిస్తోంది. మార్చి 28 నుంచి మ్యాచ్‌లు మొదలవుతున్నా, రోడ్డు మీద వెళ్లే కుర్రాళ్లు కూడా “ఈరోజు మ్యాచ్ ఉందా?” అని అడిగే పరిస్థితి రావడం నిర్వాహకులకు మింగుడుపడడం లేదు.
ఆ ‘ఫోటో’ ఒక ప్రహసనం!
తాజాగా విడుదలైన 10 మంది కెప్టెన్ల గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లకు ఫుల్ మీల్స్ పెడుతోంది. గతంలో ధోనీ, కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు ట్రోఫీ పక్కన నిలబడితే.. ఆ ఫ్రేమ్‌లోనే ఒక ‘పవర్’ ఉండేది. కానీ ఇప్పుడున్న ఫోటో చూస్తుంటే.. “ఏదో బలవంతంగా కాలేజీ ఫంక్షన్ కి పిలిచి గ్రూప్ ఫోటో దింపినట్టు ఉంది” అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
“వీళ్లలో కెప్టెన్ ఎవరో, ఎక్స్ట్రా ప్లేయర్ ఎవరో కనిపెట్టడం కష్టంగా ఉందే!” “ఆ పాత మొహాల్లో ఉన్న తీక్షణత ఏది? వీళ్లంతా హోమ్ వర్క్ పూర్తి చేయని స్టూడెంట్స్ లా ఉన్నారేంటి?”
వరల్డ్ కప్ హ్యాంగోవర్.. ఇరాన్-అమెరికా గొడవలు!
ఐపీఎల్ హైప్ తగ్గడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారు విశ్లేషకులు. మొన్ననే ముగిసిన టీ20 వరల్డ్ కప్ పుణ్యమా అని, జనం క్రికెట్ చూసి చూసి ‘ఫుల్’ అయిపోయారు. “ఇక చాలు బాబోయ్.. ఈ క్రికెట్ అలసట భరించలేం” అని రిమోట్ పక్కన పెట్టేస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న గొడవలు, చమురు ధరల పెరుగుదల చూస్తుంటే.. “పెట్రోల్ రేటు సెంచరీ దాటి ఎక్కడికో వెళ్తుంటే.. గ్రౌండ్ లో ఎవడు సెంచరీ కొడితే మాకేంటి?” అనే వైరాగ్యంలో సామాన్యుడు ఉన్నట్టున్నాడు.
బ్రాండ్ వాల్యూకి పరీక్షా సమయం?
నిజం చెప్పాలంటే, ఐపీఎల్ కి ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురవుతోంది. స్టార్ ప్లేయర్లు లేక కాదు, ఆ ‘స్టార్ డమ్’ ని మోసే వ్యక్తిత్వాలు ఉన్న నాయకులు లేకపోవడమే లోటుగా కనిపిస్తోంది. మైదానంలో సిక్సర్లు పడితే గానీ.. ఈ నీరసించిన అభిమానులకి మళ్లీ ఊపు రావడం కష్టమే!
టీవీల్లో యాడ్స్ ఎంత గట్టిగా అరిచినా.. గ్రౌండ్ లో ఆ ‘ఫైర్’ లేకపోతే ఈసారి ఐపీఎల్ చప్పగా సాగడం ఖాయమనిపిస్తోంది.