Andhra Pradesh tiger scare : రాజమండ్రి( Rajahmundry) పరిసర ప్రాంతాల్లో పెద్దపులి హడలెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో పెద్ద పులి తిరుగుతోంది. ప్రధానంగా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన నెలకొంది. తొలుత ఈ పులి నామవరం అక్కమ్మ తల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకుంటూ పుణ్యక్షేత్రం వైపు వచ్చింది. స్థానికులకు సైతం కనిపించింది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే సమీప పామాయిల్ తోటలోకి వెళ్లిపోవడంతో దాని ఆచూకీ కనిపించలేదు. అయితే ఇప్పటివరకు పెద్దపులి దాడిలో ఒక ఆవుతో పాటు మూడు దూడలు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గట్టి చర్యలు చేపడుతున్నాయి. పులికి మత్తుమందు ఇచ్చేందుకు గన్ లు సిద్ధం చేసుకున్నారు.
* భయం భయం..
సీతానగరం( Sita Nagaram ), తొర్రేడు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం భయాన్ని పెంచింది. పులి ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రెండు రోజుల కిందట ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్లను పరిశీలిస్తుండగా శివారు ప్రాంతాల నుంచి పులి వెళ్లడంతో ఒక్కసారిగా వీరంతా భయంతో పరుగులు తీశారు. పెద్దపులి ఈ ప్రాంతంలోనే తిష్ట వేసినట్లు అటవీ శాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో సీతానగరం మండలంలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది కూడా. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత.. వేకువ జాము వరకు ఈ పులి సంచారం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* పశ్చిమ గోదావరి నుంచి..
పశ్చిమగోదావరి జిల్లా( West Godavari district) నుంచి ఈ పెద్దపులి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. బుట్టాయిగూడెం నుంచి ప్రారంభమైన పెద్దపులి ప్రయాణం తూర్పుగోదావరి కి చేరింది. మార్గమధ్యంలో కనిపించిన ఆవులతో పాటు దూడలను చంపేసింది. సీతానగరం మండలంలో సైతం ఒక మూడు ఆవులను ఇదే విధంగా హతమార్చింది. ఈ ప్రాంతంలో మొక్కజొన్న తోటలు అధికం. పగటిపూట పులి వాటిలోనే విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక వైపు పులి పాదముద్రికలు సేకరిస్తుండగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పులికనిపించినట్లు.. అధికారులు భయంతో పరుగులు తీసినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా సీతానగరం మండలంలోని పులి ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అటవీ శాఖ అధికారులు. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాత్రి సమయాల్లో 15 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పులి సంచారంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు చాటింపు వేస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ పెద్దపులి వయసు సుమారు మూడు సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.