Tamil Nadu Politics: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాలు సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. ఈ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఏ పార్టీకి కూడా వన్ సైడ్ విక్టరీ ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను.. ప్రతిపక్షం పార్టీ మీద ఉన్న ఆగ్రహాన్ని ఏకకాలంలో ప్రదర్శించారు. అభిమానాన్ని కూడా చూపించారు. ఫలితంగా మూడు పార్టీలలో దేనికి కూడా గొప్పగా చెప్పుకునే మెజారిటీ రాలేదు. దీంతో ఈసారి తమిళనాడులో బంపర్ మెజారిటీ ఏ పార్టీ సాధించలేకపోయింది. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా కూడా రాలేకపోయింది. దీంతో పొత్తులు.. సంకీర్ణాల గురించి చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఇంతవరకు తమిళనాడులో ఏర్పడిన సందిగ్ధం తీరలేదు.
విజయ్ పార్టీకి అత్యధికంగా స్థానాలు వచ్చినప్పటికీ.. ఆయనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదు. ఇతర పార్టీల నేతలను కూడగట్టే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కావడం లేదు. దీంతో తమిళనాడులో రకరకాల రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే డీఎంకే తమిళనాడు రాజకీయాల మీద క్లారిటీ ఇచ్చేసింది. తాము ఎవరికి సపోర్ట్ చేయమని.. ప్రజల ఓటింగ్ ద్వారా లభించిన ప్రతిపక్ష స్థానాన్ని కొనసాగిస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. దీంతో తమిళనాడులో రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. ఇప్పటికే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యే విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బుధవారం గవర్నర్ ను కలిశారు. కాకపోతే గవర్నర్ అడిగిన ప్రశ్నలకు టీవీకే అధినేత వద్ద సమాధానాలు లేకుండా పోయాయి. దీంతో గురువారం జరగాల్సిన ప్రమాణ స్వీకారం రద్దయింది. అంతేకాదు ఇప్పట్లో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపించడం లేదు.
తమిళనాడు రాజకీయాల్లో ఈ సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఒక వ్యక్తి విజయ్ కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. మీడియా కూడా ఆయన గురించి విశేషంగా కథనాలను ప్రసారం చేస్తోంది. ఆ వ్యక్తి రాజకీయాలతో సంబంధం ఉన్నవారు కాదు. పార్టీలతోనూ సంబంధం ఉన్నవారు కాదు. ఆయన మరెవరో కాదు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. ఇటీవల విజయ్ గవర్నర్ కార్యాలయం వద్దకు వెళ్ళినప్పుడు రాజేంద్ర సాదరంగా స్వాగతం పలికారు. మెజారిటీ చూపిస్తేనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తామని అన్నారు. దీంతో రాజేంద్ర మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. కొన్ని పార్టీలు రాజేంద్ర తీరును తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని మండిపడుతున్నాయి. కమలహాసన్ నుంచి మొదలు పెడితే విశాల్ వరకు అందరు గవర్నర్ తీర్పట్ల మండిపడుతున్నారు.
రాజేంద్ర 1989లో బిజెపిలో చేరారు. 2002, 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో స్పీకర్ గా దేశంలోనే మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీ ని రూపొందించారు. రాజ్యాంగ సూత్రాలను ఈయన నూటికి నూరుపాళ్ళు అమలు చేస్తారు. 2025 నుంచి కేరళ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రానికి ఇన్చార్జి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.