Modi Strategy: ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడం సులభం కాదు. ఒక వైపు వెనుకడుగు వేసినట్లు కనిపించి, వ్యతిరేకులు, విపక్షాలు విజయోత్సవాలు జరుపుకునేలా చేస్తారు. కానీ కాలక్రమేణా అది ముందుకు దూకడానికి సిద్ధం చేసిన అడుగుగా బయటపడుతుంది. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ అంశంలో ఇదే జరుగుతున్నట్లు కొందరు విశ్లేషకులు చూస్తున్నారు.
2019–20 వివాదాలు..
సీఐఏ తర్వాత ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. బెంగాల్‌లో అల్లర్లు, రైళ్లు, బస్సులు ధ్వంసం, షాహీన్‌బాగ్ తరహా ఉద్యమాలు, మత కల్లోలాలు వచ్చాయి. కోవిడ్ మహమ్మారి కూడా విజృంభించింది. అప్పుడు ప్రభుత్వం ఈ అంశాలపై మౌనం పాటించింది. చాలా మంది దీన్ని వెనుకడుగుగా భావించి సంబరాలు చేసుకున్నారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను పక్కన పెట్టారని భావించారు. కానీ అధికారికంగా ఎప్పుడూ పూర్తిగా వదులుకున్నట్లు ప్రకటన రాలేదు. కేవలం తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు సెన్సస్ 2027 ప్రక్రియలో ఆ ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి.
కొత్త రూపంలో పాత అంశం
ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ జనాభా లెక్కింపు దశకు 40 ప్రశ్నల షెడ్యూల్‌ను నోటిఫై చేశారు. 2011లో 29 ప్రశ్నలు ఉండగా, ఈసారి పెరిగాయి. జాతీయత, తల్లిదండ్రుల వివరాలు, కులం, విద్య, నైపుణ్యాలు, భాష, ఆధార్, మొబైల్ వంటి వివరాలు ఉన్నాయి. గతంలో ఎన్‌పీఆర్‌లో ఉన్న కొన్ని ప్రశ్నలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. 1955 పౌరసత్వ చట్టం సెక్షన్ 14ఏ ప్రకారం ప్రభుత్వం పౌరుల రిజిస్టర్ నిర్వహించాలని, జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిబంధన ఉంది. సెన్సస్ ద్వారా సేకరించిన డేటా ఎన్‌పీఆర్‌కు పునాది అవుతుందని, ఆ తర్వాత ఎన్‌ఆర్‌సీ దిశగా అడుగులు పడతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో అనుసంధానం
ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని రాబోయే ఐదు నుంచి ఏడు ఏళ్లలో గతంలో చేయని పనులు చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే డిజిటల్ సెన్సస్‌లో యువత కుటుంబాలతో కలిసి స్వయంగా వివరాలు నమోదు చేయాలని, కచ్చితమైన సమాచారం దేశ విధానాలకు ఉపయోగపడుతుందని కోరారు. దీన్ని కొందరు సెన్సస్, జనాభా రిజిస్టర్ ప్రక్రియకు సంబంధించిన సూచనగా చూస్తున్నారు.
వ్యూహాత్మక మౌనం..
మోదీ తరహా పాలనలో ప్రత్యక్ష ప్రకటనల కంటే పరోక్ష అమలు ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యక్షంగా ఎన్‌ఆర్‌సీ అంటూ మాట్లాడకుండా, సెన్సస్ ద్వారా డేటా సేకరణ, డిజిటల్ వ్యవస్థ బలోపేతం చేయడం ఒక రకమైన వ్యూహం కావచ్చు. గత వివాదాల నుంచి నేర్చుకుని, మరింత సున్నితంగా, సాంకేతికంగా ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తోంది. అధికారికంగా ఎన్‌పీఆర్ లేదా దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీకి ఇంకా ఆమోదం లేదు. సెన్సస్ డేటా గోప్యతతో, గణాంకాల కోసమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్తులో ఈ డేటా ఎలా వినియోగమవుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది.
మోదీ వ్యూహాల్లో కనిపించే వెనుకడుగు తరచుగా మరో రూపంలో ముందడుగుకు దారి తీస్తుంది. ఈసారి సెన్సస్ ఆ రూపంగా మారుతుందా అనేది చర్చనీయాంశం. ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వడం, ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం.