Narendra Modi: ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధానులు జెండా ఆవిష్కరించి ప్రసంగం భారత స్వాతంత్య్ర దినోత్సవ సంప్రదాయం. 13 ఏళ్లుగా నరేంద్ర మోదీ ఈ వేదిక మీదుగా ప్రసంగిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ప్రసంగం సాధారణ ఆనవాయితీకి భిన్నంగా ఉంది. 78 నిమిషాలపాటు మాట్లాడినా, గతంలో ఎప్పుడూ వినిపించే కొన్ని కీలక పదాలు, అంశాలు ఈసారి కనిపించలేదు. దాని వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పాకిస్తాన్, చైనా, కశ్మీర్ పేర్లు లేకుండా..
ఈసారి ప్రసంగంలో పాకిస్తాన్ పేరును ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఇక చైనా ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మన సరిహద్దు ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడలేదు. కశ్మీర్ అంశం లేకుండా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం 1998 తర్వాత ఇదే అని చెప్పుకోవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. పొరుగు దేశాలు తమ పరిధిలోనే ఉన్నాయని, దుస్సాహసానికి అవకాశం లేదని పరోక్షంగా ప్రపంచానికి తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌పై ప్రభావం, చైనా వైపు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరిహద్దు ఉగ్రవాదం గణనీయంగా తగ్గిందని, కశ్మీర్ ప్రశాంతంగా ఉందని మోదీ పరోక్షంగా కశ్మీర్, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావిచలేదు.
భారత నామస్మరణ చేస్తున్న పాకిస్తాన్..
ఇక మోదీ ప్రసంగానికి విరుద్ధంగా ఉంది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగం. పాకిస్తాన్ వైపు నుంచి రా, పీవోకే అల్లర్లు, బలూచిస్తాన్ దాడులు, సింధూ జలాలపై నిందలు భారత్‌పై వేస్తున్నారు. భారత నామస్మరణ లేకుండా పాకిస్తాన్ నేతలు మాట్లాడడం లేదు. భారత్ మాత్రం ఆ దేశం పేరు కూడా ఎత్తకుండా ఉండటం మన నమ్మకానికి నిదర్శనం. ఎదురుపక్షం ఎంత మాట్లాడినా, భారత్ ఆ విషయాలను పట్టించుకోవడం లేదనే సందేశం ఇది.
యుద్ధ స్వరూపం మారుతోందని..
ప్రధాని 80వ స్వాతంత్య్ర వేడుకల ప్రసంగంలో ఒక ముఖ్యమైన అంశాన్ని హైలైట్ చేశారు. యుద్ధం కేవలం సైనికుల మధ్య జరిగేది కాదు. దేశం అంతర్గతంగా కూడా యుద్ధ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆర్థిక, ఆర్థిక వ్యవస్థ, ఐటీ కేంద్రాలపై దాడుల ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సివిల్ డిఫెన్స్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రజలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. 1962 చైనా యుద్ధం తర్వాత 1965 వరకు దేశంలో సివిల్ డిఫెన్స్ ఉద్యమం నడిచింది. అప్పటి తర్వాత చాలా కాలం తర్వాత మళ్లీ ఈ అంశం ప్రసంగంలోకి వచ్చింది. గతేడాది డెమోగ్రఫీపై దృష్టి సారించి హైపవర్ కమిషన్ ఏర్పాటు చేసినట్లే, ఈసారి అంతర్గత భద్రతను బలోపేతం చేయడంపై ఆలోచన కనిపిస్తోంది.
అగ్నివీర్‌లు కీలకం…
అగ్నివీర్‌లను ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు. సైన్యంలో శిక్షణ, క్రమశిక్షణ పొంది గ్రామాలకు తిరిగి వచ్చిన వారు సివిల్ డిఫెన్స్‌లో కీలక పాత్ర పోషించగలరు. ఇజ్రాయెల్ తరహాలో సివిలియన్ స్థాయిలో భద్రతా సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు.
అభివృద్ధి, సైన్యం, ఆత్మనిర్భరతకు ప్రాధాన్యం..
రాబోయే ఐదు నుంచి ఏడు ఏళ్లలో గత 50 ఏళ్లలో చేయనంత అభివృద్ధి సాధించాలని ప్రధాని పిలుపునిచ్చారు. సైన్యం, ఆయుధాల తయారీపై కూడా ప్రస్తావన ఉంది. అయితే బాహ్య ముప్పుల కంటే అంతర్గత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది పరిస్థితులు మారాయని, భారత్ తన శక్తిని అంతర్గతంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసుకోవాలని సూచించే వ్యూహాత్మక మార్పు. పొరుగు దేశాలను పట్టించుకోకుండా ఉండటం అంటే వాటిని పూర్తిగా విస్మరించడం కాదు. వాటి ప్రభావం తగ్గిందని, ఇప్పుడు దృష్టి లోపలికి మళ్లించాలని చెప్పే తీరు. అదే సమయంలో కొత్త రకం ముప్పులకు సిద్ధం కావాలని హెచ్చరిక కూడా.
మొత్తంగా చూస్తే, 2026 ఎర్రకోట ప్రసంగం కేవలం వేడుక కాదు. భారత్ ఎదుర్కొంటున్న కొత్త వాస్తవాళ్లను, ప్రాధాన్యాలను ప్రతిబింబించే వ్యూహాత్మక ప్రకటన. మౌనం కూడా ఒక రకమైన భాషే. ఈసారి ఆ భాషే ఎక్కువగా మాట్లాడింది.