Jammu Kashmir Terrorism: సరిగ్గా 35 సంవత్సరాల క్రితం.. ఓ రైల్వే స్టేషన్ పై ఉగ్రవాదులు బాంబుదాడి చేశారు. నాడు జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఇద్దరు పారా మిలటరీ సిబ్బంది ఉన్నారు. 18 మంది గాయపడ్డారు. 1991 ఏప్రిల్ రెండవ తేదీన జమ్మూ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫారం నెంబర్ 1 మీద ఈ దాడి జరిగింది.
ఈ ఘటన తర్వాత పోలీసుల రంగంలోకి దిగారు. వేగవంతంగా విచారణ జరిపారు. ఆ సమయంలో ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఆ సమయంలో వారిని అరెస్ట్ చేయడం సాధ్యం కాలేదు. అనేక పర్యాయాలు పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కోర్టు సదరు వ్యక్తులను పరారీలో ఉన్న నిందితులు అని ప్రకటించింది. అయితే ఇటీవల కాలంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రదాడులకు సంబంధించి పూర్తిగా పరిష్కారం కానీ కేసులను.. చేదించే పని మొదలుపెట్టారు. గడిచిన రెండు సంవత్సరాలుగా పోలీసులు అత్యంత వేగవంతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని గుర్తింపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ బాంబు పేల్చివేత ఘటనలో ఒక వ్యక్తి ప్రధాన నిందితుడు అని పోలీసులు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి మారువేషంలో జీవిస్తున్నట్టు సమాచారం. బిజ్ బెహరా ప్రాంతంలో అతడు వ్యాపారవేత్తగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతని పేరు అల్తాఫ్ హుస్సేన్ షేక్. ఇతడు దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని అనంత్ నాగ్ జిల్లాలోని బిజ్ బెహరా మర్హమా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు ఆ ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రహస్య గుర్తింపుతో జీవించడం మొదలుపెట్టాడు. స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారవేత్తగా జనాలను పూర్తిగా నమ్మించాడు. అయితే చివరికి 35 సంవత్సరాల తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కేసు మొత్తానికి పరిష్కారమైంది. అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆగస్టు 13న టాడా కోర్టు ఎదుట హాజరు పరిచారు.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రదాడులకు సంబంధించిన కేసులలో పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పని చేపట్టారు పోలీసులు. జమ్ము కాశ్మీర్లో ఉగ్ర కదలికలు లేకుండా చేయాలని వారు గట్టి సంకల్పంతో ఉన్నారు. అందువల్లే పాత కేసులను తోడుతున్నారు. అందులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటిదే ఈ కేసు. ఏకంగా 35 సంవత్సరాల తర్వాత కూడా దాడులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారంటే.. వారి చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.