Gen Z Protests: జెన్‌జీ.. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దాన్ని తిరుగుబాటు ధోరణి, అమర్యాద, హింసతో ముడిపెడుతున్నారు. మరికొందరు దానిని న్యాయం కోసం పోరాడే శక్తిగా చూస్తున్నారు. భారతదేశంలోనే ఇటీవల రెండు ప్రముఖ జెన్‌జీ ఉద్యమాలు జరిగాయి. ఒకటి సీజేపీ(కాక్రోచ్ జనతా పార్టీ) పేరుతో, మరొకటి జార్ఖండ్‌లో విద్యార్థులు, యువకులు నడిపిన పరీక్షల సంస్కరణ ఉద్యమం. ఈ రెండింటి మధ్య వ్యవహార శైలి, లక్ష్యం, భాష, పద్ధతుల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
జెన్‌జీ అంటే..
జెన్‌జీ అంటే 30 ఏళ్లలోపు యువత. సాధారణంగా అందరూ జెన్‌జీ అంటే ఎవరి మాట వినని, గౌరవం లేని, బూతులు తిట్టే, హింసకు పాల్పడే తరంగా చిత్రీకరిస్తున్నారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లలో జరిగిన ఉద్యమాల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. అయితే అన్ని జెన్‌జీ ఉద్యమాలూ ఒకేలా ఉండవు. లక్ష్యం, నాయకత్వం, పద్ధతులు మారితే ఫలితాలు కూడా మారతాయి. భారత్‌లోని రెండు ఉద్యమాలు దీనికి ఉదాహరణ.
సీజేపీ ఉద్యమం వెనుక రెజీమ్ చేంజ్ లక్ష్యం..
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన ఉద్యమంలో పాశ్చాత్య శైలి టాక్టిక్స్ స్పష్టంగా కనిపించాయి. ఇది కేవలం ఒక సమస్యపై దృష్టి పెట్టకుండా, ప్రభుత్వ మార్పు దిశగా కదిలింది. జంతర్‌మంతర్ వద్ద హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక అంశాలు చర్చకు వచ్చాయి. నీట్ లీకేజీని అడ్డం పెట్టుకుని అనేక ఇతర విషయాలు, శక్తులు తెరపైకి వచ్చాయి. మోదీ, ఆయన కుటుంబం మీద తీవ్రమైన భాష, రీల్స్, టార్గెట్ చేసే విధానం కనిపించింది. పోలీసులపై దాడులు, మీడియాపై దాడులు, పార్లమెంట్‌పై యత్నం వంటి సంఘటనలు జరిగాయి. యాంటీ-హిందూ, యాంటీ-నేషన్ స్లోగన్లు కూడా వినిపించాయి. ఇది ఒక సమస్య పరిష్కారం కంటే విస్తృత రాజకీయ లక్ష్యంతో జరిగింది.
జార్ఖండ్ ఉద్యమం వెనుక స్పష్టమైన లక్ష్యం..
జార్ఖండ్‌లో జరిగిన ఉద్యమం పూర్తిగా భిన్నంగా ఉంది. విద్యావ్యవస్థ, పరీక్షల నిర్వహణలో లోపాలు, రిక్రూట్‌మెంట్‌లో అవినీతి మీదే దృష్టి ఈ ఉద్యమంలో పాల్గొన్న, నడిపిన జెన్‌జీ దృష్టి పెట్టింది. జేపీఎస్‌సీ, సీఎస్‌ఈ, జేఎస్‌ఎస్‌సీ, సీజీఎల్ వంటి ఉద్యోగ పరీక్షలు సమస్యగా మారాయి. టీఎస్‌ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. 2014 నుంచి జరిగిన పరీక్షలపై దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యార్థులు సమ్మె విరమించకుండా సీబీఐ విచారణ కోరుతున్నారు. కానీ ఈ ఉద్యమంలో హింసకు తావు లేదు. పోలీసులపై దాడి జరగలేదు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను బూతులు తిట్టలేదు. ఆయన తండ్రి శిబు సోరెన్ పుట్టినరోజును ఆందోళనకారులే ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ వ్యక్తులు వచ్చి మద్దతు తెలపాలనుకున్నా, వేదికపైకి రానివ్వలేదు. ‘‘మా ఉద్యమం రాజకీయం కాదు. పరీక్షల్లో అవినీతి తొలగించాలి, పారదర్శకత రావాలి, దోషులను శిక్షించాలి’’ అని స్పష్టం చేశారు. చివరకు పరీక్షల్లో మార్పులు వచ్చాయి. ఉద్యమం సఫలమైంది.
రెండు ఉద్యమాల మధ్య కీలక తేడాలు
జార్ఖండ్‌లో జెన్‌జీ ఉద్యమం ఒక సమస్యపైనే ఫోకస్ పెట్టింది. సీజేపీలో సమస్యను దాటి రెజీమ్ చేంజ్, విస్తృత రాజకీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని నడిపింది. జార్ఖండ్‌లో అమర్యాద, బూతులు, వ్యక్తిగత దాడులు లేవు. సీజేపీ ఉద్యమంలో తీవ్ర భాష, కుటుంబాల మీద దాడి జరిగాయి. జార్ఖండ్‌లో హింస లేదు. జంతర్‌మంతర ఉద్యమంలో పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. జార్ఖండ్‌లో జరిగిన ఉద్యమంతో కీలక మార్పులు వచ్చాయి. సీజేపీ ఉద్యమంతో సమస్య పరిష్కారం కన్నా రాజకీయ ఉద్రికత్తత పెరిగింది.
జెన్‌జీ తరం ఒకేలా ఉండదు. లక్ష్యం స్పష్టంగా ఉండి, నాగరికంగా, హింస రహితంగా ఉద్యమించినప్పుడు అది సానుకూల మార్పు తీసుకురాగలదు. జార్ఖండ్ ఉద్యమం దీనికి నిదర్శనం. అదే సమయంలో లక్ష్యం మసకబారి, హింస, అమర్యాద, రాజకీయ టార్గెటింగ్ ముందుకు వచ్చినప్పుడు ఉద్యమం విశ్వసనీయత కోల్పోతుంది. జెన్‌జీ శక్తిని సమస్య పరిష్కారం వైపు మళ్లించడమే సమాజం, ప్రభుత్వాలు, యువత ఇద్దరి బాధ్యత.