IRCTC Food Complaint: శీర్షిక చదివారు కదా.. ఈగ విలువ లక్ష రూపాయలు అని అర్థమైంది కదా.. అదేంటి ఈగలను పరాన్న జీవి వాహకాలుగా భావిస్తుంటారు కదా.. పైగా ఈగలకు దూరంగా ఉంటారు కదా.. అటువంటి వాటికి లక్ష రూపాయలు ఎలా ఖర్చు పెడతారు.. అసలు అది అలా సాధ్యమవుతుంది.. ఇలా అనేక రకాల ప్రశ్నలు మీలో వ్యక్తమవుతున్నాయి కదా.. ఈ ప్రశ్నలకు సంబంధించి మీకు ఒక క్లారిటీ రావాలంటే ఈ కథనం చదవాల్సిందే..
అహ్మదాబాద్, ముంబై మధ్యలో తేజస్ రాజధాని అనే పేరుతో రైల్వే శాఖ ఎక్స్ ప్రెస్ రైలు నడుపుతూ ఉంటుంది. ఈ రైలు కొన్ని ఎంపిక చేసిన స్టేషన్ల లో మాత్రమే ఆగుతూ ఉంటుంది. ఈ రైలులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐఆర్సిటిసి యాప్ ద్వారా ఆహార ముందుగానే బుక్ చేసుకున్నాడు. అతడు ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఐ ఆర్ సి టి సి నిర్వాహకులు ఫుడ్ డెలివరీ చేశారు.
ఫుడ్ పార్సెల్ ఓపెన్ చేసి అతడు తినడం మొదలుపెట్టాడు. అందులో ఒక ఈగ కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని అతడు ఐఆర్సిటిసి అధికారులకు కంప్లైంట్ చేశాడు. సమాచారం అందుకున్న రైలు కెప్టెన్.. క్యాటరింగ్ మేనేజర్ వెంటనే ప్రయాణికుడిని కలిశారు. క్షమాపణ చెప్పారు. ఆ ఫుడ్ పార్సెల్ స్థానంలో మరొక ప్యాకెట్ అందిస్తామని వారు చెప్పారు. దానికి ఆ ప్రయాణికుడు ఒప్పుకోలేదు. అతడు కోర్టుకు వెళ్తామని హెచ్చరించడంతో.. ఐఆర్సిటిసి అధికారులు రంగంలోకి దిగారు విచారణ మొదలుపెట్టారు. ఆ ప్రయాణికుడికి భోజనాన్ని సరఫరా చేసిన అర్హ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా విధించారు.
ఈ కంపెనీకి సూరత్ నగరంలో ఆహారం తయారు చేసే కేంద్రం ఉంది. కేంద్రానికి సంబంధించిన లైసెన్స్ మొత్తం రద్దు చేయాలని ఐఆర్సిటిసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆహార కేంద్రాన్ని త్వరలో మూసివేస్తారని తెలుస్తోంది. ఒక ప్రయాణికుడు ఎంతో ఆశతో.. ఆహారం బుక్ చేస్తే.. చివరికి అందులో ఈగ పడడం.. అది అతడి కంటపడడం.. ఐఆర్సిటిసికి ఫిర్యాదు చేయడం.. లక్ష రూపాయలు జరిమానా విధించడం… జాతీయస్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, మనదేశంలో హాస్పిటల్ ఎలా వ్యవహరిస్తున్నాయో మరోసారి వెలుగులోకి వచ్చింది.
