Dhruv Sharma: మోసపోయేవాడు ఉన్నప్పుడు.. మోసం చేసేవాడు కూడా ఉంటాడు. మోసపోయే వాడికి తెలివి ఉండదు. మోసం చేసేవాడికి తన పర బేధం ఉండదు. ఆ సమయానికి నాలుగు మాయమాటలు చెబుతాడు. మోసం చేసి వెళ్ళిపోతుంటాడు. అయితే మోసం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందులో ఇతడు పిహెచ్డి చేశాడు అనుకుంటా. ఏకంగా 500 కోట్లు మాయం చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది హర్యానా. ఈ రాష్ట్రం మీదుగా అనేక జాతీయ రహదారులు వెళుతూ ఉంటాయి. పైగా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉండడంతో చాలామంది హర్యానాలో ప్రాపర్టీలుకొని నివాసాలు నిర్మించుకుంటున్నారు. అక్కడే నివాసం ఉంటున్నారు. అందువల్లే కొంతకాలంగా హర్యానాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతంగా పెరుగుతోంది.
హర్యానా రాష్ట్రంలో గురు గ్రామ్ చాలా ఫేమస్. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో 32nd Avenue పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు అయింది. ఆ కంపెనీకి సీఈవోగా ధృవ్ దత్ శర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమందికి మాయమాటలు చెప్పాడు. విలువైన వెంచర్ వేస్తున్నామని అన్నాడు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల రెట్టింపు లాభం వస్తుందని చెప్పాడు. మొత్తంగా గొలుసు కట్టు స్కీమును అమలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో కొంతమందికి సరిగానే వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత చాలామందికి నమ్మకం ఏర్పడడంతో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భారీగా పెట్టుబడి లభించింద.. అప్పుడే శర్మ వేరే దారి ఎంచుకున్నాడు. మొత్తంగా 500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. గురు గ్రామ్ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అతడు చేసిన మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా చాలా మంది దగ్గర అతడు ఈ స్థాయిలో డబ్బులు వసూలు చేశాడని తెలుస్తోంది. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడి గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఇతడికి రాజకీయంగా అండదండలు ఉన్నాయని… అందువల్లే ఈ స్థాయిలో దోపిడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. వాస్తవానికి ఇతడి కంపెనీకి ఎటువంటి ఆస్తులు లేవని.. వాటికి భారీగా విలువ ఉందని చెప్పడం కూడా మోసమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
