Homeఆంధ్రప్రదేశ్‌RK Kothapaluku: ఆర్కే కొత్త పలుకు; అర్జెంటుగా బాబు బయటికి రావాలి.. మోడీ, షా, కేసీఆర్...

RK Kothapaluku: ఆర్కే కొత్త పలుకు; అర్జెంటుగా బాబు బయటికి రావాలి.. మోడీ, షా, కేసీఆర్ సారీ చెప్పాలి

RK Kothapaluku: “చంద్రబాబు ప్రస్తుత దుస్థితికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే కారణం కాదని, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమూ కారణమన్న అభిప్రాయం ఇక్కడి సెటిలర్లలో బలపడింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అభిప్రాయానికి సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ వర్గం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టకపోయినా, ఏపీ లో జగన్ కు మద్దతు ఇవ్వడంతో గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడానికి కెసిఆర్ సహాయ సహకారాలు ఉన్నందునే అటు రాష్ట్రానికి, ఇటు చంద్రబాబుకు ప్రస్తుత దుస్థితి అన్న కోపం సెటిలర్లలో ఉండింది. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే గత ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా బాబును ఇబ్బంది పెడతారన్న అభిప్రాయంతో సెటిలర్లు ఉన్నారు” ఇవీ ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన పత్రికలో కొత్త పలుకు పేరుతో రాసిన వ్యాసంలో మచ్చుకు కొన్ని వ్యాక్యాలు. చదువుతుంటే ఒకింత ఆశ్చర్యంగానూ, ఒకింత సంబ్రమాశ్చర్యంగానూ ఉన్నాయి కదా! అలా లేకుంటే అది కొత్త పలుకు ఎలా అవుతుంది? అతడు వేమూరి రాధాకృష్ణ ఎలా అవుతాడు?

సాధారణంగా రాధాకృష్ణ జర్నలిజం లో డ్యూటీ ఏంటంటే అతడు ఏ విషయాన్నీ కూడా కడుపులో దాచుకోడు. కుండబద్దలు కొట్టేస్తాడు. తన పచ్చ అభిమానాన్ని, తన కమ్మ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటాడు. చంద్రబాబు అరెస్టు కేవలం జగన్ ఒక్కరి వల్లే కాలేదట! దీనికి తెర వెనుక బిజెపి నాయకులు కృషి చేశారట! బిజెపి నాయకులు ఒకవేళ చంద్రబాబు అరెస్టుకు కృషి చేస్తే.. దాని ప్రభావం తెలంగాణ మీద పడితే.. ఎందుకు చంద్రబాబు అరెస్టుకు తెర వెనుక సహాయం చేస్తారు? ఆ తర్వాత ఉన్నఫలంగా లోకేష్ కు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు? ఈ స్థాయిలో కలం ఎత్తుతున్న రాధాకృష్ణ.. నాడు చంద్రబాబు బిజెపికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎలాంటి కూటమి కట్టాడు? ఎవరెవరికి డబ్బు సర్దుబాటు చేశాడు? అనేవి ఎందుకు రాయలేకపోతున్నాడు.

సెటిలర్ ఓటర్లు అని తెగ గింజుకుంటున్న రాధాకృష్ణ.. కేవలం తన సొంత సామాజిక వర్గం వారిని మాత్రమే ఆ జాబితాలోకి చేర్చడం అత్యంత దురదృష్టకరం. ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్ ఓటర్లలో కేవలం కమ్మవారు మాత్రమే కాదు అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అలాంటప్పుడు వారంతా చంద్రబాబుకు జై కొడితే గత ఎన్నికల్లో ఓడిపోయేవాడు కాదు కదా! ఆ స్థాయిలో మెరుగైన పాలన అందిస్తే అక్కడి ప్రజలు కచ్చితంగా గెలిపించేవారు కదా! 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు వల్ల టిడిపి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో గెలిచింది. అదే టిడిపి నుంచి గెలిచిన అభ్యర్థులు తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇదే టిడిపికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలో టిడిపి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. రాధాకృష్ణ చెబుతున్న మండవ వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో టిడిపికి లేదా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అక్కడిదాకా ఎందుకు రాధాకృష్ణకు అత్యంత ఇష్టమైన తుమ్మల నాగేశ్వరరావు తన సొంత జిల్లాలోనే ఓడిపోయారు. క్షేత్రస్థాయిలో లెక్కలు ఈ విధంగా ఉంటాయి. తన పచ్చ భక్తిని, కమ్మభక్తిని రాధాకృష్ణ ప్రదర్శించడం నిజంగా హాస్యాస్పదం.

చంద్రబాబుకు న్యాయం ఎండమావి అని చెబుతున్న రాధాకృష్ణ.. గతంలో జగన్ అరెస్ట్ అయినప్పుడు ఎలాంటి రాతలు రాశాడో అందరికీ గుర్తు ఉంది. ఇప్పుడు న్యాయం ఎండమావి అని చెబుతున్న రాధాకృష్ణ.. అప్పుడు న్యాయం గెలిచిందని రాశాడు. అంటే తన రాజకీయ అవసరాలకు అనుగుణంగానే రాతలు రాశాడు అని అనుకోవాల్సి ఉంటుంది.. చివరిగా.. చంద్రబాబు ఒకవేళ జైలు నుంచి విడుదల కాకపోతే బిజెపికి నష్టం అని రాసుకొచ్చాడు.. గతంలో ఇదే చంద్రబాబు పిలుపునిస్తే ఆంధ్ర సెటిలర్లు ఏ స్థాయిలో ఓట్లు వేశారు? స్థాయిలో టిడిపి అభ్యర్థులను గెలిపించారు? చంద్రబాబు ఒకవేళ జైలు నుంచి విడుదలైనా జగన్ ఊరుకోడు అని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ గెలుస్తాడని చెబుతున్నాడా? జస్ట్ అయినప్పటికీ చంద్రబాబు మీద సింపతి పెరగలేదు అని వ్యాఖ్యానిస్తున్నాడా? అంటే ఆ లెక్కన జగన్ చేసింది కరెక్ట్ అనే కదా అర్థం?!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular