Sudden Awakening : ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి చాలామందికి కలిగే ఉంటుంది. అయితే కొందరు పీడకలలు రావడం వల్ల ఇలా చేస్తారని అంటుంటారు. మరికొందరు ఏదో ఆలోచిస్తూ నిద్రించడం వల్ల ఇలా అయిందని అంటుంటారు. కానీ వాస్తవానికి శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారా ఇలా ఉలిక్కిపడుతూ ఉంటారు. అందులో ఇవి కారణాలుగా ఉండే అవకాశం ఉంది. అవేంటంటే?
ప్రస్తుత కాలంలో చాలామంది ఒత్తిడితో పనిని చేస్తున్నారు. రోజంతా ఏదో ఒక ఆలోచనతో ఉండిపోతూ.. ఒకే సంఘటనపై మాట్లాడుతూ ఉండడంవల్ల విశ్రాంతి తీసుకోకుండా ఉండవచ్చు. ఈ ప్రభావం మెదడుపై తీవ్రంగా పడుతుంది. అయితే అలసిపోయి నిద్రపోయిన తర్వాత రాత్రి మధ్యలో అకస్మాత్తుగా మెలకువ రావడం జరగవచ్చు. ఇలా వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం.. భయపడినట్లు లక్షణాలు కనిపిస్తాయి. ఇలా అనిపించడాన్ని స్లీప్ అప్నియా అని అంటారు. నిద్రపోతున్న సమయంలో శ్వాసనాళాలు మూసుకుపోవడం లేదా శరీరానికి సరైన విధంగా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు శరీరాన్ని అలెర్ట్ చేస్తుంది. దీంతో శరీరానికి షాక్ ఇచ్చినట్లయితే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు.
అయితే ఈ పరిస్థితి రావడానికి కేవలం ఆందోళన, ఒత్తిడి మాత్రమే కాకుండా శరీరంలో జరిగే మార్పులు కూడా ఉన్నాయని అంటున్నారు. రక్తంలో గ్లూకోస్ స్థాయి తక్కువగా మారినప్పుడు లేదా మధుమేహం కోసం ఇన్సులిన్, మెడిసిన్ తీసుకున్నప్పుడు వణుకు పుడుతుంది. ఈ పరిస్థితి నిద్రపోయినప్పుడు కూడా ఉండడంతో ఒక్కసారిగా శరీరం అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. అలాగే శరీరంలో హార్మోన్ల మార్పుల కు కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి సమయంలో తీసుకునే ఆహారం ఎసిడిటీ గా మారినా ఇలా అనిపిస్తుంది.
అందువల్ల నిద్రపోయే ముందు కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల ఇలా ఉలిక్కిపడడం ఉండదని అంటున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు కెపిన్ ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకుండా.. రోస్టర్ ఆహారం సేవించకుండా ఉండాలి. అంతేకాకుండా ఒకే సమయానికి నిద్రపోవడం.. ఒకే సమయానికి నిద్ర లేవడం వంటి అలవాటులను చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. నిద్రపోయే ముందు చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి ఎలాంటి అలజడి లేకుండా ఉంటుంది.
అయితే ఇలా ఉలిక్కిపడడం అప్పుడప్పుడు జరిగితే ఏం పర్వాలేదు. కానీ పదే పదే ఇలా జరిగితే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. కొందరికి కేవలం ఉలిక్కిపడడం మాత్రమే కాకుండా చెమటలు పట్టడం.. నిరంతరం దగ్గు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం ఉండే అవకాశం ఉంది.