Dadasaheb Phalke Awards 2026 : బాలీవుడ్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ‘ధురంధర్’ ఇప్పుడు అవార్డుల పంట పండించింది.. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 అవార్డుల్లో ఈ సినిమా అత్యధిక అవార్డులను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు వరకు కీలక పురస్కారాలు ధురంధర్ ఖాతాలో చేరాయి. దీంతో ఈ ఏడాది అవార్డుల వేడుకలో ధురంధర్ పేరు మార్మోగింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, అవార్డుల కమిటీ ప్రశంసలు కూడా అందుకుంది. సినిమాలో తన నటనతో మెప్పించిన రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోగా, ఉత్తమ చిత్రంగా కూడా ధురంధర్ నిలిచింది. అంతేకాదు, ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నాకు ఉత్తమ విలన్ అవార్డు దక్కింది. సంగీత విభాగంలో శాశ్వత్ సచ్‌దేవ్ కూడా పురస్కారం అందుకున్నారు.
‘సయారా’కు కూడా ప్రత్యేక గుర్తింపు
ధురంధర్ తర్వాత అవార్డుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచిన మరో చిత్రం ‘సయారా’. ఈ సినిమాలో నటనకు అనీత్ పడ్డా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇర్షాద్ కమిల్ ఉత్తమ గేయ రచయితగా, ఫహీమ్ అబ్దుల్లా ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డులు అందుకున్నారు. సాంగ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా సయారా పాటకే దక్కింది.
కాంతార, హక్ చిత్రాలకు క్రిటిక్స్ ప్రశంసలు
విమర్శకుల విభాగంలో ‘కాంతార: చాప్టర్ 1’ సత్తా చాటింది. ఉత్తమ క్రిటిక్స్ చిత్రంగా ఎంపిక కావడంతో పాటు, రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. హక్ చిత్రానికి కూడా గుర్తింపు లభించింది. యామీ గౌతమ్ ధర్ క్రిటిక్స్ ఉత్తమ నటిగా ఎంపిక కాగా, రీషు నాథ్ ఉత్తమ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ విభాగంలో అవార్డు అందుకున్నారు.
ఓటీటీ, టెలివిజన్ రంగాల్లోనూ అవార్డుల సందడి
సినిమాలతో పాటు డిజిటల్ వినోద రంగంలోని ప్రతిభకు కూడా ఈ వేడుకలో గుర్తింపు లభించింది. ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఉత్తమ వెబ్‌సిరీస్‌గా నిలవగా, ఆర్యన్ ఖాన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘పాతాళ్ లోక్ సీజన్ 2’లో నటనకు జైదీప్ అహ్లావత్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ‘దిల్లీ క్రైమ్ సీజన్ 3’లో నటనకు షెఫాలీ షా ఉత్తమ నటిగా, హ్యుమా ఖురేషి ఉత్తమ ప్రతినాయకురాలిగా ఎంపికయ్యారు.
టెలివిజన్ విభాగంలో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ సిరీస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’లో నటనకు అమర్ ఉపాధ్యాయ్, స్మృతి ఇరానీ ఉత్తమ నటుడు, నటిగా నిలిచారు.
అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రముఖులకు పురస్కారాలు
ఈసారి అవార్డుల వేడుకలో అంతర్జాతీయ కళాకారులకు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ప్రకటించారు. సంగీతం, పాటల రచన, ప్రపంచవ్యాప్తంగా ఆమె చూపిన ప్రభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు అందించారు. అంతర్జాతీయ చిత్రాల విభాగంలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ‘సిన్నర్స్’ చిత్రానికి మైకేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా, ‘హ్యామ్‌నెట్’ చిత్రానికి జెస్సీ బక్లే ఉత్తమ నటిగా నిలిచారు. ప్రపంచ సినిమాకు అందించిన సేవలకు జేమ్స్ కామెరూన్‌కు ప్రత్యేక పురస్కారం లభించింది.
భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు కమల్‌హాసన్, సంగీత ప్రపంచానికి అందించిన విశేష కృషికి ఇళయరాజా అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ అవార్డులతో సత్కరించబడ్డారు. కరణ్ ఆజ్లాకు ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్, సామే రైనాకు కమెడియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు దక్కాయి.
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల్లో బాలీవుడ్ చిత్రాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ధురంధర్ సాధించిన విజయాలు ఆ సినిమాకు మరోసారి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. బాక్సాఫీస్ విజయంతో మొదలైన ధురంధర్ ప్రయాణం ఇప్పుడు అవార్డుల వేదికపైనా హాట్‌టాపిక్‌గా మారింది.